Home తాజా వార్తలు తేడా తెలిసి ఓటేయండి

తేడా తెలిసి ఓటేయండి

KCR meetings

ప్రజలే మా బాస్‌లు
ఓటు తలరాతను మార్చే ఆయుధం
విచక్షణతో ఓటు వేయాలి
ఆషామాషీగా తీసుకోవద్దు
గత ప్రభుత్వాలతో ఈ నాలుగేళ్ళ ప్రగతిని బేరీజు వేసుకోవాలి
ఒక పార్టీ ఢిల్లీకి, మరో పార్టీ అమరావతికి గులాంలు
ఏది వాస్తవమో, ఏది అబద్ధమో విశ్లేషించుకోవాలి: కెసిఆర్

మన తెలంగాణ / నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగాం: ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు 58 ఏళ్ళ నిర్వాకానికి, నాలుగేళ్ళ అభివృద్ధి మధ్య జరుగుతున్నాయని, ప్రజలు పార్టీల మాయమాటలు నమ్మి మోసపోకుండా విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. నాయకులు గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం గెలవాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే పార్టీని ఆదరించాలని, ఒక్కసారి ఓటు వేయడంలో సరైన పార్టీని, అభ్యర్థిని ఎంచుకోకపోతే ఐదేళ్ళ పాటు అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజల తలరాతను మార్చే బలమైన ఆయుధం ఓటు అని, ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్‌గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకే రోజున నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో శుక్రవారం పాల్గొన్న కెసిఆర్ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగాలని ఆకాంక్షిస్తూనే వలస పాలనకు దార్లు తెరుస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని, చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే హామీలను గుడ్డిగా నమ్మవద్దని, తాను చెప్పే అంశాలతో సహా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలన్నింటిలో వాస్తవాలను తెలుసుకోవాలని, గతంలో ఆయా పార్టీలు ఏం చేశాయో విశ్లేషించుకోవాలని కోరారు. పార్టీలు చెప్తున్న అంశాల్లో ఏది వాస్తవమో ఏది అబద్ధమో పరిశీలించాలని, గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పాలనను, టిఆర్‌ఎస్ నాలుగేళ్ళ పాలనను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. కూటమిలోని ఒక పార్టీ ఢిల్లీకి, మరో పార్టీ అమరావతికి గులాంలని, పరిపాలనలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడకు పరుగులు తీయాల్సిందేనని అన్నారు. స్వరాష్ట్రంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదని, మళ్ళీ వలస పాలన వద్దనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలే బాస్‌లని, ఏ నిర్ణయమైనా ఇక్కడే జరుగుతుందని, నాలుగేళ్ళ పాలనలో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడానికి కారణం ప్రజల అవసరాలే కేంద్రంగా, మానవీయ కోణం లో రూపొందించినవని అన్నారు.

కాంగ్రెస్ నాలుగు దశాబ్దాలు, తెలుగుదేశం 18 సంవత్సరాలు పాలించాయని, కానీ నాలుగేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో అమలవుతున్న పథకాలు పెట్టలేదని అన్నా రు. ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు 38 ఏళ్ళ విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోయాని, టిఆర్‌ఎస్ మాత్రం ఆరు నెలల్లోనే పరిష్కరించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందని అన్నారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రమాదమని, ఆయనను భుజాలపై మోసుకొచ్చే కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల భూములు, పోడు భూములు, అటవీ శాఖతో ఉన్న వివాదాలకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ బానిసలుగా మనం బతకొద్దని, అందుకే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ప్రజలు వివేకంతో నిర్ణయం తీసుకోవాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, నాయకులు గెలిస్తేనే సరిపోదని, ప్రజలు గెలవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పార్టీల హామీలకు గోల్‌మాల్ కావద్దని, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల 58 పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి కలిగిన అభివృద్ధి ఫలాలను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నాలుగేళ్ళలో టిఆర్‌ఎస్ సాధించిన ఫలాలను బేరీజు వేసుకోవాలని కోరారు.

లోతుగా ఆలోచించకుండా ఆగమాగం అయిపోయి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఐదే ళ్ళు అనుభవించాల్సి వస్తుందని, ప్రజల తలరాతను మార్చే ‘ఓటు’ అనే బలమైన ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవాలని కోరారు. 38 ఏళ్ళుగా కరెండు బాధలు పడ్డ జనం తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే నాణ్యమైన విద్యుత్‌ను పొందుతున్నారని, ఆ పార్టీలకు చేతకానిది టిఆర్‌ఎస్ చేయగలిగిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆకాశంలోంచి ఊడిపడలేదని, గంధర్వులు కాదని, గత పాలనా ఫలితాలు కళ్ళముందు కనిపిస్తున్నాయని, ఇంతకాలం చేయలేని పనుల్ని ఇప్పుడు చేస్తామంటూ ప్రజల్ని నమ్మిస్తున్నాయన్నారు.

ప్రజా అవసరాలే కేంద్రంగా పథకాలు
సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని, కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రామాణికంగా తీసుకుని మానవీయ కోణంలో అనేక పథకాలను చేపట్టిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమం సమయంలో కళ్ళారా చూసిన కష్టాల నుంచి కళ్యాణలక్ష్మి, రైతుబంధు, కంటివెలుగు లాంటి అనేక పథకాలకు రూపకల్పన చేశామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని రామచంద్రాపురం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి ఇళ్ళు కాలిపోతే ఒక రైతు తన బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న రెండు లక్షల రూపాయలు బుగ్గిపాలయిందని, ఆత్మహత్యే శరణ్యమనుకున్న రైతును వారించి తానే ఆర్థిక సాయం చేసి పెళ్ళికి వెళ్ళిన సంఘటనను గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యలు చూసి రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయడానికి రైతుబంధును ప్రవేశపెట్టామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఉత్తమమైన పది పథకాల్లో ఒకటిగా రైతుబంధుకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించిందని గుర్తుచేశారు.

రాష్ట్రానికి అడ్డం పడే చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని?
కొత్త రాష్ట్రమే అయినా అనేక రంగాల్లో దేశవ్యాప్తంగానే మొద టి స్థానంలో ఉన్నదని, తాజాగా విద్యుత్ తలసరి వినియోగంలో సైతం దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న చాలా పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలుకావడంలేదని, అక్కడ పాలన చేయ డం చేతకాని చంద్రబాబు ఇప్పుడు తెలంగాణపై పడ్డారని, ఆయనకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. ఆయనను భుజాన మోసుకొస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. మన గొంతు కసి నీళ్ళు వద్దనే చంద్రబాబు ను తెలంగాణ ప్రజలు ఎట్ల గెలిపిస్తరని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదని, వివేచనతో ఓటు వేస్తారని, తెలంగాణలో ఆంధ్ర పెత్తనాన్ని సహించరని అన్నారు. చంద్రబాబు బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నారని తాను వనపర్తి సభలోనే చెప్పానని, తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి 35 ఫిర్యాదులు, కోర్టుల్లో కేసులు వేశారని, ఇప్పుడు తెలంగాణను గోసపెట్టడానికి మళ్ళీ దండెత్తుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును తాను ఒకసారి తరిమికొట్టానని, ఇప్పుడు ప్రజల వంతు వచ్చిందన్నారు. మనం పారదోలిన చంద్రబాబు దరిద్రాన్ని కాంగ్రెస్ మళ్ళీ తీసుకొస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటే తెలంగాణపై పెత్తనం కోసం చంద్రబాబు వస్తున్నారన్నారు. హైకోర్టు విభజనకు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల విభజనకు చంద్రబాబు అడ్డం పడుతున్నారని ఆరోపించారు.

వెన్నెముక లేని తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదని గుర్తుచేశారు. ఆవేశం లేని, పౌరుషం లేని, వెన్నెముక లేని, తెలివి లేని నాయకులుగానే మిగిలిపోయారని అన్నారు. తెలంగాణను ఇంతకాలం గోస పెట్టిందే కాంగ్రెస్ అని, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని, వ్యతిరేకించి ఏడుగురు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభు త్వం కాల్చి చంపిందని, ఆ తర్వాత 1969లో 369 మందిని కాలి చంపిందని, సకాలంలో తెలంగాణను ఇవ్వకపోవడంతో వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తనంటే తామేమన్నా వద్దంటామా అని ప్రశ్నించిన కెసిఆర్ చంద్రబాబును ఎందుకు నెత్తిమీద పెట్టుకోవాల్సి వచ్చిందని, ఆయనను ఎందుకు తీసుకొస్తోందని, తెలంగాణకు ఎందుకు ద్రోహం చేస్తోందని ప్రశ్నించారు.

ఆరు నూరైనా గిరిజన, మైనారిటీ రిజర్వేషన్లు
తెలంగాణనే సాధించిన కెసిఆర్‌కు గిరిజనులకు, ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలూ టిఆర్‌ఎస్, ఎంఐఎంకు వస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్నారు. కేంద్రంల చక్రం తిప్పాలని తాను కోరుకోవడంలేదని, కానీ కాంగ్రెస్ లేని, బిజెపి లేని ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తథ్యమన్నారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో, అన్ని అధికారాలనూ కేంద్రం దగ్గరే పెట్టుకోవడంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి దొందూ దొందేనని అన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చామని, దీంతో 3500 మంది గిరిజనులు, ఆదివాసీలు త్వరలో సర్పంచ్‌లు కానున్నారని, డ్బ్బై ఏళ్ళ వారి డిమాండ్‌ను ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు అమలుచేయలేదని, టిఆర్‌ఎస్‌తోనే ఇది సాధ్యమైందని అన్నారు.

నేను సిఎంగా ఉన్నంతవరకు ఉచిత కరెంటు
ఒక రైతుగా కరెంటు కోతల బాధ ఎలాంటిదో తనకు తెలుసునని, తన వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోయాయని, లక్షలాది మంది రైతుల అష్టకష్టాలు పడ్డారని, ఆ బాధల్ని పారదోలేందుకు విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించామని, తమ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు, తాను సిఎంగా ఉన్నంతకాలం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టం చశారు. రైతుబంధు, రైతుబబీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు.. ఇలా అనేక పథకాలు కొనసాగుతాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర పెంచడానికి, సంపదను పెంచడానికి వారి ఉత్పత్తులను ఐకెపి మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలుచేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టి కల్తీకి ఆస్కారంలేని నాణ్యమైన సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు.

మా బాస్‌లు తెలంగాణ ప్రజలే
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు అమరావతిలో, ఢిల్లీలో బాస్‌లు ఉంటే తమకు మాత్రం తెలంగాణ ప్రజలే బాస్‌లు అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలో నిర్ణయాలు జరగడంలో ఉన్న ప్రయోజనం నాలుగేళ్ళ అనుభవంలోనే అర్థమవుతోందని, పాలనాపరమైన ఏ నిర్ణయమైనా మనం తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని, కూటమి పార్టీలకు అలాంటి అవకాశం లేదని, అమరావతి, ఢిల్లీలకు వెళ్ళక తప్పదని అన్నారు. ప్రజలు వారి ఓట్ల ద్వారా ఆ రెండు పార్టీలకు దయ్యం దిగేలా వ్యవహరించాలని కోరారు. మన వేలుతో మన కన్నునే పొడిపించే కుట్ర జరుగుతోందని అన్నారు.

ఏపీలో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు
మన బతుకు మనం బతుకుతూ ఉంటే ఏదో ఉద్ధరించే పేరుతో చంద్రబాబు మనపై పెత్తనం కోసం వస్తున్నారని, ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ఆ రాష్ట్రంలో చేసిందేమీ లేదని, ఈసారి ఆయనకు అక్కడ డిపాజిట్లు కూడా రావని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రుణమాఫీలో చంద్రబాబు అక్కడి రైతులను మోసం చేశారని, మన రాష్ట్రంలో అమలవుతున్న వినూత్న పథకాలేవీ ఆ రాష్ట్రంలో లేవన్నారు.

కోటి ఎకరాలకు సాగునీరు నా కల
ఎంత కష్టమైనా, ఎంత ఆర్థిక భారమైనా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడం తన కల అని, మరో సంవత్సరంలో అది తీరబోతుందని, ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృ తం కానుందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా ఆ లక్షం నెరవేరే వరు విశ్రాంతి తీసుకోనని అన్నారు. కాళేళ్వరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చే ఏడాది జూన్ నుంచి ఒక్కో ప్రాంతానికి అందబోతున్నాయని, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సైతం వస్తాయని తెలిపారు.

గొర్రెల పథకం కాంగ్రెస్ గొర్రెలకు అర్థం కాలేదు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పథకం దీర్ఘకాలిక లక్షం కాంగ్రెస్ గొర్రెలకు అర్థం కాలేదని, అందుకే విమర్శిస్తున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నాలుగున్నర వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పటికే 72 లక్షల గొర్రెలను గొల్ల, కుర్మ లబ్ధిదారులకు పంపిణీ చేశామని, 40 లక్షల పిల్లలు పుట్టాయని అన్నారు. సమైక పాలనలో కులవృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడంలో భాగంగానే ఇలాంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రతీ రోజు ఇతర రాష్ట్రాల నుంచి మాంసం అవసరాల కోసం మన రాష్ట్రానికి లారీల్లో గొర్రెలు వస్తున్నాయని, మన దగ్గర గొల్ల, కుర్మలు 35 లక్షల జనాభా ఉన్నా ఈ పరిస్థితి రావడంపై ఆలోచించి ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. త్వరలో మన రాష్ట్ర మాంసం అవసరాలు తీరడంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామన్నారు.

పింఛనుదార్లకు ప్రత్యేక డైరెక్టరేట్
రాష్ట్రంలోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ళ కు పెంచడానికి పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే పింఛనుదార్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న లివింగ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ లాంటి నిబంధనలతో వస్తున్న ఇబ్బందులను పార్టీ దృష్టికి తెచ్చారని, త్వరలోనే ఈ బాధను తొలగించడానికి పింఛనుదార్ల కోసం ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేయడంపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆత్మగౌరవానికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు
కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళకు, ఇప్పుడు కడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు పోలికే లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవంతో మహిళలు బతికేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, ఒక్క ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్ళకు సమమని అన్నారు. రాత్రికి రాత్రి కట్టడానికి ఇవేమన్నా బిస్కట్లా అని ప్రశ్నించి రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల ఇండ్లు అవసరమని, ఏటా రెండు వేల ఇళ్ళు కట్టినా వచ్చే టర్మ్‌లో మొత్తం లక్షాన్ని పూర్తి చేస్తామని అన్నారు.

ధనిక రైతుల మేలు కోసమే 2 లక్షల రుణమాఫీ
రాష్ట్రంలో 94 శాతం మంది రైతులు పేదవారేనని, రెండు ఎకరాల లోపు ఉన్నవారేనని, వారికి లక్ష కంటే ఎక్కువ అప్పులు లేవని, అందుకే లక్ష రూపాయల రుణమాఫీని మేనిఫెస్టోలో పెడుతున్నామని కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల రుణ మాఫీ హామీ ఇస్తోందని, కానీ అంత మొత్తంలో అప్పు తీసుకున్నది కేవలం రెండు శాతంగా ఉన్న ధనిక రైతులేనని, వారి ప్రయోజనం కోసమే ఈ హామీని ఇస్తోందన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
బయ్యారం ఉక్కు ప్లాంట్‌ను నిర్మించడంపై పునర్ విభజన చట్టంలో హామీ ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదని, కుంటిసాకులు చెప్తూ నాలుగేళ్ళుగా దాటేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత ఖర్చుతోనైనా దీన్ని నెలకొల్పుతుందని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్& కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలుపుతామని గత ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారని, వేలాది మంది ఆత్మత్యాగం చేసుకుంటే వారిని అవమానించే తీరులో మళ్ళీ ఆంధ్రలో కలుపుతారా అని ప్రశ్భించారు. అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ ఇదే చేతకానితనంతో ఉందన్నారు.

కెమెరామెన్‌లో చంద్రబాబు అభిమానులున్నారా?
తెలంగాణపై చంద్రబాబు పెత్తనాన్ని కోరుకుంటున్నారా అని కెసిఆర్ ప్రశ్నించడంతో అన్ని సభల్లోనూ ప్రజలు ‘లేదు’ అని బదులిచ్చారు. అయితే చేతులెత్తి నినదిస్తూ ప్రజలు ఈ స్పందనను తెలియజేయడంతో కెమెరాలను ప్రజలపైకి ఫోకస్ చేయాలని వీడియో జర్నలిస్టులకు కెసిఆర్ సూచించారు. అయితే ఒక కెమెరామాన్ తిప్పకపోవడంతో ‘ఈయన చంద్రబాబు అభిమాని లాగున్నడు. అందుకే తిప్పుతలేడేమో’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

మల్లన్నసాగర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు
జనగామ నియోజకవర్గానికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. జనగామ కరువుతో అల్లాడిన ప్రాంతమని, దీంతో గతంలో యువకులు వలసపోయారని అన్నారు. జనగామలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తనది అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్, దేవాదుల పూర్తి చేసి వందలాది చెరువుల్ని నింపుతామని అన్నారు. కెసిఆర్ సిఎం కాకపోతే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎంఎల్‌ఎ కాకపోతే జనగామ జిల్లా అయ్యేది కాదని పేర్కొన్నారు. ప్రజలు గ్రామాలకు వెళ్లగానే చర్చ పెట్టి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

KCR meetings in six constituencies

Telangana Latest News