Home తాజా వార్తలు స్వయంగా తనిఖీ చేస్తా

స్వయంగా తనిఖీ చేస్తా

 

పంచాయతీలు పచ్చగా, పారదర్శకంగా ఉండాలి

350మంది పంచాయతీ రిసోర్సు పర్సన్లకు అవగాహన

రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్
ఐదేళ్లలో రూ.40వేల కోట్లు
కరెంటు బిల్లు బకాయిపడితే సస్పెన్షన్
పన్నులు వందశాతం వసూలు చేయాలి
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి
మధ్య మధ్యలో పద్యాలతో
కర్తవ్య బోధ చేసిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నీ గ్రీన్ విలేజ్, క్లీన్ విలేజ్‌లుగా మారాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో సర్పంచ్‌లు, కార్యదర్శి సమిష్టిగా పనిచేయాలని, అవినీతికి పాల్పడినా, విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించినా వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, సీరియస్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సర్పంచ్‌లకు కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు, విధుల నిర్వహణ, నిధుల వినియోగం, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం తదితర పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖకు చెందిన సుమారు 350 మంది రిసోర్స్ పర్సన్లకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ దాదాపు ఆరు గంటల పాటు అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్దిపై ప్రభుత్వ విధానాన్ని, సర్పంచ్‌లు, కార్యదర్శుల పనితీరు గురించి కూలంకషంగా వివరించారు. గ్రామ పాలన పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఉదారంగా నిధులను మంజూరు చేస్తుందని, పారదర్శకంగా పాలన సాగించేందుకు అన్ని అధికారాలనూ ఇస్తుందని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా, నిధులను దుర్వినియోగం చేసినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. ప్రతీ పంచాయతీలో ఒక మొక్కల నర్సరీ విధిగా ఉండాల్సిందేనని, ఆరు నెలల వ్యవధిలో తప్పనిసరిగా వైకుంఠధామం (స్మశానవాటిక) ఏర్పడాలని, ప్రతీ ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటే ప్రణాళిక అమలు కావాలని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రతీ ఇంటి నుంచి వ్యర్థాలను సేకరించడానికి ట్రైసైకిళ్ళను వినియోగించాలన్నారు. ఇకపైన జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్లు పంచాయతీల్లోనే జరగాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను ఇస్తుందని, దీనికి తోడు ఎంఎల్‌సి, ఎంఎల్‌ఏలు కూడా వారి ‘అభివృద్ధి నిధుల’ నుంచి సమకూరుస్తారని తెలిపారు. పంచాయతీల్లో పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా 25 తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక బృందంలో తాను కూడా ఉంటానని, దూర ప్రాంతాలు పర్యటించడానికి హెలికాప్టర్‌లను కూడా సమకూరుస్తామని తెలిపారు. నిరంతరం తనిఖీలు జరుగుతూనే ఉంటాయని, ఎవరు ఎప్పుడు ఎక్కడికి పోతున్నారో తెలియకుండా ఆకస్మిక తనిఖీలుంటాయని, ప్రతీ రోజు ఏదో ఓ చోట తనిఖీ జరుగుతూనే ఉంటుందని తెలిపారు. నిధులు ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నదీ ఆరా తీయడంతో పాటు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సమాచారం తెప్పించుకుంటామన్నారు. పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత కాపాడడానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తామని, ఎక్కడ తేడా వచ్చినా సర్పంచ్, గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేస్తామని, పంచాయతీరాజ్ చట్టంలోనే ఇందుకు నిబంధనలను కూడా పొందుపరిచామని సిఎం వివరించారు. పంచాయతీల పరిధిలో వంద శాతం పన్నులను వసూలు చేయాలన్నారు. వీధి దీపాలు, విద్యుత్ కనెక్షన్లకు తరచూ డిస్కంలకు బాకీ పడుతూ ఉంటాయని, ఈ పద్ధతి మారాలన్నారు.
సర్పంచ్, కార్యదర్శులు ‘మార్పు’ ఏజెంట్లు:
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రిసోర్సు పర్సన్లతో ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమైన కెసిఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులే ‘ఛేంజ్ ఎజెంట్లు’గా ఉంటారన్నారు. గ్రామల వేదికగానే ఏడాది ప్రణాళికకు బదులుగా ఐదేళ్ళ ప్రగతి ప్రణాళికలను రూపొందించాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను, గ్రామ ప్రజలను కలుపుకుని సమిష్టిగా గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. గ్రామాల వికాసానికి సర్పంచులు అంకితభావంతో పనిచేయడానికి కావాల్సిన అవగాహనను, చైతన్యాన్ని రిసోర్సు పర్సన్లు కలిగించాలని సూచించారు. పంచాయతీల్లో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తోందని, గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల (స్మశాన వాటికలు) నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని నొక్కిచెప్పారు.- ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఆదాయ, వనరులను బేరీజు వేసుకుంటూ ఐదేళ్ల గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా పనులను చేపట్టాలన్నారు. గ్రామం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, ఐదేళ్ల తర్వాత ఎలాంటి మార్పులు జరగాలి, ఐదేళ్ల కాలంలో ఎన్ని నిధులు వస్తాయి, వాటితో ఎలాంటి పనులు చేయాలి తదితర విషయాలను ముందుగానే నిర్థారించుకుని కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి సూచించారు. చీకట్లో బాణం విసిరినట్లు కాకుండా, లక్ష్యసిద్దితో గురి చూసి కొట్టాలన్నారు. పన్నుల వసూలుకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలని, ఇందులో సర్పంచులకు, కార్యదర్శులకు రిసోర్సు పర్సన్లు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రతీ ఆరు నెలలకోసారి రిసోర్స్ పర్సన్లతో తానే స్వయంగా సమావేశం అవుతానని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు:
సొంత స్థలం లేనివారు కుటుంబ సభ్యులు చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియదని, ఆ బాధ వర్ణణాతీతమని, కాబట్టి ప్రతీ గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామాన్ని నిర్మించాలని కెసిఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ తగిన స్థలాన్ని ఇవ్వాలని, ఒకవేళ అలాంటి స్థలం లేకుంటే ప్రభుత్వ భూమిని వాడుకోవాలని, ఈ రెండూ లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. దాతలెవరైనా ముందుకొస్తే వారి భూమిని తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే వైకుంఠధామాన్ని నిర్మించాలని, అన్ని గ్రామాల్లో ఆరు నెలల్లో వైకుంఠ ధామాల నిర్మాణం జరగాలని సిఎం ఆదేశించారు.
పదవి సేవ కోసమే& అధికారం కోసం కాదు :
ప్రజా ప్రతినిధులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని మరవద్దని, ప్రజా ప్రతినిధులు తాము ప్రజా సేవకులమే తప్ప, అధికారం చెలాయించేవాళ్లం కాదు అనే భావనతో ఉండాలన్నారు. చట్టసభల్లో ‘అధికార పార్టీ’, ‘ప్రతిపక్ష పార్టీ’ అనే పదాలు పోవాలని, గ్రామాల్లో కూడా అధికారం అనే మాట రావద్దని స్పష్టం చేశారు. సర్పంచ్ గా ఎన్నిక కాగానే కొందరి వేషభాషల్లో మార్పు వస్తుందని, దాన్ని ప్రజలు స్వీకరించరని, సహజత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. పెత్తనం చేయడానికి ఉన్నామనే భావనను మనసులోకి కూడా రానీయవద్దన్నారు. దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) నిరంకుశత్వం(అటోక్రసీ)గా మారుతోందని, ఇది మంచిది కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతో రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు. తాము ప్రజల ప్రతినిధులం అనే భావనను మరవద్దని, ప్రజలందరినీ సంఘటితపరిచి, గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రజల సంఘటిత శక్తిలోని బలమెంతో గుర్తెరగాలి అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
పల్లెలు పచ్చగా కళకళలాడాలి
గ్రామంలో పచ్చదనం పెంచడం గ్రామ పంచాయతీల ప్రధాన బాధ్యతల్లో ఒకటని నొక్కిచెప్పిన కెసిఆర్ పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలని, కచ్చితంగా ప్రతీ గ్రామంలో ఒక మొక్కల నర్సరీ ఉండాలని, ప్రతీ ఇంటికి ఆరు మొక్కలకు తక్కువ కాకుండా కోరుకున్న రకాల మొక్కలను పంచాయతీలు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గ్రామంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత పంచాయతీలదేనని, మొక్కల పెంపకం కోసం ‘నరేగా’ (గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులను వాడుకోవాలని సూచించారు. గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి ఇండెంట్ సేకరించి ఎవరు ఏ రకం మొక్కలు కోరుకున్నారో వాటిని అందించే బాధ్యత పంచాయతీలదేనన్నారు. వీధుల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నీడను, ఆక్సిజన్‌ను ఇచ్చే వేప, రావి లాంటి చెట్లను నాటాలని, పొలాల గట్ల మీద అవసరమైన మొక్కలను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ వేయండి
గ్రామంలో పారిశుద్ద నిర్వహణ కట్టుదిట్టంగా జరగాలని వివరించిన కెసిఆర్ ఎప్పుడూ వీధులు అద్దంలా మెరవాలని, ఎట్టి పరిస్థితుల్లో చెత్తాచెదారం రోడ్లపై కనిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రజలు తమ ఇండ్లను ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో ఊరిని కూడా అలాగే ఉంచుకోవాలని, రోడ్డుపై చెత్తవేసే వారికి రూ. 500 చొప్పున జరిమానా విధించాలన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించడానికి ట్రైసైకిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవడంతో పాటు పాడుపడిన, నిరుపయోగంగా ఉన్న బావులను, బోర్లను వెంటనే పూడ్చివేయాలని సూచించారు. మురికికాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీరు నిల్వ ఉండకుండా గుంతలను కూడా పూడ్చాలన్నారు. పిచ్చిచెట్లను తొలగించాలని పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ఖచ్చితంగా మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, దోమల వ్యాప్తిని నిరోధించేందుకు క్రమం క్రమం తప్పకుండా మందును పిచికారి చేయాలని ముఖ్యమంత్రి వివరించారు.
వంద శాతం పన్నులు వసూలు చేయాలి& బకాయిలు చెల్లించాలి:
ఖచ్చితంగా వందకు వంద శాతం పన్నులను వసూలు చేయాలని, పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సర్పంచులు గ్రామంలోనే నివాసం ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని, గ్రామ అవవసరాలను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నెలకోసారి విధిగా గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహిస్తూ, రెండు నెలలకోసారి గ్రామ సభను నిర్వహించాలని నొక్కిచెప్పారు. పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. వీధి దీపాలు వెలిగేలా, పగటిపూట వాటిని ఆర్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనన, మరణ వివరాలనమోదుతో పాటు వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. గ్రామంలో వ్యక్తిగత ఆస్తుల మ్యుటేషన్ (పేరు మార్పిడి)పై కూడా కొత్త పంచాయతీలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వంగిన కరెంటు స్తంభాలను సరిచేయడానికి, కిందికి జారిన వైర్లను సరిచేయడానికి మరమ్మత్తు అవసరాల నిమిత్తం ‘పవర్ డే’ను నిర్వహించాలని సూచించారు. ప్రతీ గ్రామంలో దోబీ ఘాట్లు కూడా ఉండాలన్నారు.
ఐదేళ్ళలో గ్రామాలకు రూ. 40 వేల కోట్ల నిధులు :
రాష్ట్రంలోని మొత్తం జనాభాలో గ్రామాల్లోనే 2.02 కోట్ల జనాభా ఉందని, 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాల అభివృద్ధికి మన రాష్ట్రానికి ఏడాదికి రూ. 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో రూ.1,628 కోట్లు జోడిస్తుందని, ఆ విధంగా ప్రతీ ఏటా రూ. 3,256 కోట్లు గ్రామాలకు సమకూరుతాయని ముఖ్యమంత్రి నిధుల వివరాలను రిసోర్సు పర్సన్లకు అర్థం చేయించారు. ఈ లెక్క ప్రకారం ఒక్కో వ్యక్తికి రూ. 1,611 చొప్పున 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఏటా రూ. 8 లక్షలు వస్తున్నాయని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు ఇంకా ఎక్కువగానే నిధులు వస్తాయని, ఇవి కాకుండా ‘నరేగా’ నిధులు కూడా పెద్ద మొత్తంలోనే సమకూరుతాయన్నారు. ప్రతీ ఏటా రూ. 3,500 కోట్ల ‘నరేగా’ నిధులు రాష్ట్రానికి వస్తాయని, వీటిని సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. లేబర్ కంపోనెంట్‌కు ‘నరేగా’ నిధులను వాడి, మెటీరియల్ కంపోనెంట్ కోసం గ్రామ పంచాయతీ నిధులను, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిల నియోజకవర్గ ‘అభివృద్ధి నిధుల’ ద్వారా సమకూరే డబ్బును వాడుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు వారి నియోజకవర్గ అభివృద్ధి నిధులను గ్రామాల అభివృద్ధికే వినియోగిస్తారని తెలిపారు. సుమారు రూ.480 కోట్ల మేర గ్రామాలకు సమకూరుతాయన్నారు. ఇలా మూడు మార్గాల ద్వారా గ్రామాల అభివృద్దికి ఏడాదికి రూ. 7,236 కోట్లు సమకూరుతాయని, ఈ నిధులే కాకుండా రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా, దాతల విరాళాల ద్వారా కూడా పంచాయతీలు నిధులు సమకూర్చుకోవాలన్నారు. శ్రమదానం ద్వారా కూడా కొన్ని పనులు డబ్బులతో అవసరం లేకుండా జరుగుతాయని సూచించారు. మొత్తంగా ఐదేళ్లలో సుమారు రూ. 40 వేల కోట్లు గ్రామాలకు సమకూరుతాయని, ఈ నిధులతో గ్రామాలాభివృద్ధికి ఎన్నో అద్భుతాలు చేయవచ్చని సిఎం వివరించారు.
కరెంటు బిల్లు బకాయి పెడితే సస్పెండే
వీధి దీపాలు, ఇతర అవసరాల కోసం పంచాయతీలు వాడే విద్యుత్‌కు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని గుర్తుచేసిన కెసిఆర్ ఇకపైన ఆ పాత విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. గ్రామ పంచాయతీలు విద్యుత్ సంస్థలకు రూ.2,570 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా దృష్టి పెట్టాలన్నారు. మున్సిపాలిటీల నుంచి కూడా విద్యుత్ సంస్థలకు రూ. 455 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, అన్నీ కలిపి మొత్తం రూ.3,025 కోట్ల బకాయిలున్నాయన్నారు. ఈ తీరులో విద్యుత్ సంస్థలు ఎలా నడుస్తాయని ప్రశ్నించిన కెసిఆర్ నిరంతరాయంగా గ్రామాలకు, పట్టణాలకు కరెంటు ఎలా సరఫరా చేస్తాయని ప్రశ్నించారు. ఇకపై ఎప్పటికప్పుడు కరెంటు బిల్లులను చెల్లించాలని, జాప్యం చేసినవారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
టీచర్ లాగా పాఠాలు బోధించిన సిఎం
రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ టీచర్ పాత్ర పోషించారు. ప్రతీ విషయంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సమావేశంలో మధ్యాహ్నం రెండు గంటల వరకూ నిలబడే పాఠాలు చెప్పారు. భోజన విరామం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిలబడే మాట్లాడారు. గ్రామ పంచాయతీ కొత్త చట్టం, గ్రామ పంచాయతీల బాధ్యతలు- విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చు పెట్టే పద్దతులు, ప్రజా ప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మధ్యలో చాలాసార్లు హాస్యం, ఛలోక్తులు విసరడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో రిసోర్సు పర్సన్ల సందేహాలను నివృత్తి చేశారు. చాలా ఓపిగ్గా వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

పలుమార్లు పద్యాలు చదివిన కెసిఆర్
వివిధ అంశాలపై రిసోర్సు పర్సన్లకు అవగాహన కల్పించే క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశంలో పలుమార్లు సందర్భోచితంగా పద్యాలు చదివి, వాటి అర్థాన్ని విడమరిచి చెప్పారు. ‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు’ అంటూ వేమన పద్యం పాడి, గ్రామాల్లో సంస్కరణల అమలు నిరంతర ప్రక్రియగా సాగాలని, కొంత కాలానికి అది ప్రజలకు, ప్రతినిధులకు అలవాటుగా మారుతుందని వివరించారు. ‘నయమున బ్రాలున్ ద్రావరు, భయమునను విషమ్మునైనా భక్షింతురుగా’ అనే సుమతీ శతకంలోని పద్యాన్ని పాడి, గ్రామ పంచాయతీలు విధి నిర్వహణలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని చెప్పారు. భయముంటేనే బాగా పనిచేస్తారని, పాలన పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ‘జాతస్యహి మరణం దృవం’ అనే భగవద్గీత శ్లోకం చదివి పుట్టినవారు గిట్టక మానరు, కాబట్టి చనిపోయిన తర్వాత కూడా మర్యాదగా, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానవాటికలు నిర్మించాల్సిన అవసరాన్ని చెప్పారు. “బతికినంత కాలం కులం పేరిట, మతం పేరిట కొట్టుకు చచ్చినం. చనిపోయిన తర్వాతనైనా ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి” అన్నారు. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రుస్తులై’ అనే ఏనుగు లక్ష్మణకవి సుభాషితం చదివి, గ్రామాల వికాసానికి మంచి సంకల్పంతో నడుం బిగించి, తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన స్పూర్తితో పనిచేయాలని అర్థం చేయించారు.
స్పూర్తి ప్రధాతల గాధలను వివరించిన ముఖ్యమంత్రి
రిసోర్సు పర్సన్లకు అవగాహన, స్పూర్తి కలిగించే క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధిలో ఎంతో కృషి చేసిన వ్యక్తులను, సంస్థలను, గ్రామాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతో వారు సాధించిన విజయాలను, అవి దేశానికి ఉపయోగపడిన విధానాన్ని విడమరిచి చెప్పారు. భారతదేశ మొదటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి ఎస్‌కె డే దేశంలో పంచాయతీ రాజ్ ఉద్యమానికి పురుడు పోసిన విధానాన్ని, ఆయన సలహాలు, సూచనల మేరకే మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నీటి పారుదల నిర్మాణానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి చర్యలు తీసుకున్న వైనాన్ని కెసిఆర్ వివరించారు. గ్రామాల వికాసం కోసం నాడు ఎస్‌కె డే హైదరాబాద్‌లో నెలకొల్పిన జాతీయ పంచాయతీరాజ్ అభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ గురించి గుర్తుచేశారు. ఆయన చొరవతోనే షాద్‌నగర్, పటాన్‌చెరు బ్లాకులు ఏర్పడిన విషయాన్ని చెప్పారు. కొంకణ్ ప్రాంతంలో ప్రజలను చైతన్యపరిచి, ఎత్తుపల్లాలుండే భూభాగంలో వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపించిన బండార్కర్ గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలోని వన్రాయ్ సొసైటీ స్వచ్చందంగా గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించి, చేసిన సేవను వివరించారు. కూసం రాజమౌళి అనే ఒక వ్యక్తి చేసిన కృషి కారణంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ప్రపంచానికే ఓ ఆదర్శ గ్రామంగా ఎలా తయారైందో వివరించారు. గ్రామస్తులు, ముఖ్యంగా మహిళల సాధికారితకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం ఓ ఉదాహరణగా చెప్పిన సిఎం, గ్రామాల స్వయం సమృద్ధికి, లాభదాయక వ్యవసాయానికి ఆ ఊరు ఓ రోల్ మోడల్ అని చెప్పారు. ఒక్క దోమ కూడా లేకుండా పరిసరాలను ఎలా కాపాడుకోవచ్చో హైదరాబాద్ నగర శివారు ప్రగతి రిసార్ట్స్ చేసి చూపించందని చెప్పారు. రిసోర్స్ పర్సన్లంతా తమ శిక్షణా కాలంలో గంగదేవిపల్లి, అంకాపూర్, ప్రగతి రిసార్ట్ సందర్శించాలని కోరారు.
గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కు అరుదైన గౌరవం
రిసోర్సు పర్సన్లకు అవగాహన కల్పిస్తూ మాట్లాడిన సందర్బంగా ముఖ్యమంత్రి గంగదేవిపల్లి గ్రామం గురించి వివరించారు. ఈ సందర్భంగానే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గురించి మాట్లాడారు. అయితే ఆశ్చర్యకరంగా పంచాయతీరాజ్ శాఖ ఎంపిక చేసిన రిసోర్సు పర్సన్లలో రాజమౌళి కూడా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి రాజమౌళిని సభకు పరిచయం చేశారు. ఆయన ఆదర్శ నాయకుడని కొనియాడారు. వేదిక మీదకి పిలిపించి, సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టి గౌరవం ఇచ్చారు. రాజమౌళిని స్పూర్తిగా తీసుకుని గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించానని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేసుకున్నారు.
పెదిరిపాడు సంఘటనపై సిఎం ఖండన
మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బాలప్పను నేలపై కూర్చోబెట్టిన సంఘటనను సిఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు రిసోర్సు పర్సన్లనుద్దేశించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ప్రారంభోపన్యాసం చేశారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత చెప్పి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు సరైన అవగాహన కల్పించి, గ్రామ వికాసానికి వారిని చేంజ్ ఏజెంట్లుగా మార్చాలని చెప్పారు. స్థానిక సంస్థలను పనిచేసే పరిపాలనా విభాగాలుగా తీర్చిదిద్దడం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన శిక్షణ ఇవ్వడం, ఎప్పటికప్పుడు వారి పనితీరును మదింపు చేయడం కోసం నిష్ణాతులైన రిసోర్సు పర్సన్లను ప్రభుత్వం ఎంపిక చేసిందని సిఎస్ వెల్లడించారు. గ్రామ వికాస ప్రణాళికలపై అవగాహన కలిగి, పంచాయతీ రాజ్ సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన 320 మందితో రాష్ట్ర స్థాయి బృందాన్ని తయారు చేసిందని వెల్లడించారు. పంచాయతీ రాజ్ అధికారులతో పాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అద్యాపకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మాజీ సర్పంచులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడ ఇందులో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వీరికి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ రిసోర్స్ పర్సన్లే జిల్లాల వారీగా సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా తరగతులు ప్రతీ ఆరు నెలలకోసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహదారు రాజీవ్‌శర్మతో పాటు శాసనసభ్యులు రెడ్యానాయక్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ‘సెర్ప్’ సిఇవో పౌసమి బసు, సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

KCR Review on village Development at Pragathi Bhavan