Home తాజా వార్తలు నవమార్గ దర్శనం

నవమార్గ దర్శనం

KCR to announce Federal Front plans at TRS plenary

నేడే టిఆర్‌ఎస్ చరిత్రాత్మక 17వ ప్లీనరీ 

జిల్లాల నుంచి రానున్న 15 వేల మంది ప్రతినిధులు
తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి దిక్సూచిగా చేసే విధంగా ఫ్రంట్ నిర్మాణావశ్యకతను చాటనున్న కెసిఆర్ సందేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అధికార పార్టీగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర సమితి తన 17 ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని దాటి 18వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో కొంపల్లిలో శుక్రవారం జరుగుతున్న ప్లీనరీకి ప్రత్యే క ప్రాధాన్యత ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఈ ప్లీనరీ వేదిక గా పార్టీ నేతల మొదలు క్రింది స్థాయి కార్యకర్త వరకు పార్టీ అధినేత కెసిఆర్ మార్గ నిర్దేశనం చేయనున్నారు. ఈ నాలుగేళ్ళలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలు పొందిన లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలకు సంబంధించిన సమీ క్ష, వ్యూహరచన ఈ ప్లీనరీ ప్రత్యేకతగా ఉండనుం ది. ఉద్యమ పార్టీగా మొదలై బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగి భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా జరుగుతున్న పరిణామాలపై కెసిఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. రానున్న ఎన్నికలకు గ్రామస్థాయి కార్యకర్త మొదలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వరకు అందరినీ సమాయత్తం చేయడం, సవాళ్ళు ఎన్ని
ఎదురైనా అభివృద్ధి, సంక్షేమాలే విజయావకాశాలుగా ప్రజల దగ్గరకు చేరేలా ఉత్సాహపర్చడం ఈ ప్లీనరీ లక్షంగా ఉండనుంది.

గత వారం రోజులుగా ప్లీనరీ ఏర్పాట్లను రోజుకో మంత్రి చొప్పున పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ ప్లీనరీ గురించి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన అన్ని ప్లీనరీలకంటే ఇప్పుడు జరుగుతున్న ప్లీనరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని, ఎన్నికలకు వెళ్తున్న సందర్భంగా జరుగుతున్నందున మళ్ళీ గెలుపుపైనే మొత్తం దృష్టి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ప్లీనరీ సమయానికి ఎన్నికల కోలాహలం ఉంటుంది కాబట్టి ఇంత పెద్దయెత్తున జరపలేమని, ఆ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించడానికి ఈ ప్లీనరీ వేదికగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆలోచనను వారి దగ్గరకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలను ఉత్సాహపర్చడం ప్రధానమైనదని అన్నారు. భవిష్యత్ రాజకీయాలకు కెసిఆర్ ఈ ప్లీనరీలో దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను యావత్తు దేశానికి ఏ విధంగా అవసరమో ఫ్రంట్ ఆవశ్యకత సందర్భంలో వివరిస్తారని తెలిపారు. ఎంపి కవిత మాట్లాడుతూ, ఈ నాలుగేళ్ళలో తెలంగాణలో సాధించిన అభివృద్ధికి ప్రతీకగానే ప్లీనరీ సభా వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’ అని నామకరణం చేశామని, తమిళనాడు నమూనా నేటి అవసరం అనే సందేశాన్ని ఈ ప్లీనరీ సందర్భంగా స్పష్టం చేస్తామని తెలిపారు.
నాడు ఉద్యమం… నేడు విజయాలు
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నందున విజయం సాధించామని, ఇప్పుడు దాని స్థానే ఈ నాలుగేళ్ళ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి ఫలాలపైనే ఎక్కువగా ఆధారపడాలని పార్టీ భావిస్తోందని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలకు ఈ ప్లీనరీ సందర్భంగా ఘాటైన సమాధానం ఇవ్వడంతోపాటు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులకు ఒక సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్ళలో అన్ని ఉప ఎన్నికల్లోనూ వరుస విజయాలు, గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని విజయాలు పార్టీకి అనుకూలమైనప్పటికీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కార్యకర్తలు, సమన్వయకర్తలకు ఈ వేదికగా కెసిఆర్ విధులు అప్పగించనున్నారు. ప్రస్తుతం ప్లీనరీ వరకు మాత్రమే పరిమితమవుతున్నా త్వరలో భారీ స్థాయిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ ప్లీనరీకి జిల్లా మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, సభ్యులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మండలపరిషత్ చైర్మన్లు, సభ్యులు, సర్పంచ్‌లు… ఇలా కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం.
జాతీయ రాజకీయాల్లో మార్పుకు నాంది
కేంద్ర ప్రభుత్వానికి తొలి నుంచీ చేదోడువాదోడుగా, మద్దతుగా ఉంటూ వచ్చిన టిఆర్‌ఎస్ ఇటీవలి కాలంలో అసమ్మతిని వ్యక్తం చేస్తోంది. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఇవ్వనంతటి గట్టి మద్దతును నీతి ఆయోగ్ ఏర్పాటు, నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు లాంటి సందర్భాల్లో ఇచ్చి కేంద్రానికి అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్, ఐటిఐఆర్, బిసి రిజర్వేషన్లు.. ఇలా అనేక అంశాల్లో కేంద్రం సహకార ధోరణితో లేకపోవడం రాష్ట్రాన్ని బాధించింది. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమం, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ.. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ఈ నాలుగేళ్ళుగా ఒక రోల్ మోడల్‌గా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం, సహకారం అందకపోవడం కెసిఆర్‌ను అసంతృప్తికి గురిచేసింది. రాష్ట్రాల హక్కుల్ని సైతం కేంద్రం కొన్ని సందర్భాల్లో కాలరాస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్లీనరీలో పార్టీ ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మంత్రులు ఈటల రాజేందర్, లకా్ష్మరెడ్డి మాత్రం తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని గట్టిగానే వినిపిస్తారని తెలిపారు.
గుజరాత్ మోడల్‌తో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ప్రధాని స్థాయికి వచ్చినట్లుగానే ఇప్పుడు తెలంగాణ మోడల్‌తో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ ప్లీనరీలో ప్రతినిధులు ఆరు తీర్మానాలను ఆమోదించనున్నారు.