Home తాజా వార్తలు రేపు టిఆర్‌ఎస్ బిఫారాలు

రేపు టిఆర్‌ఎస్ బిఫారాలు

KCR to give B-Forms to candidates on Sunday

తెలంగాణ భవన్‌లో కెసిఆర్ చేతుల మీదుగా పంపిణీ

 గజ్వేల్‌లో 1500 మంది కార్యకర్తలతో సమావేశం

12 నుంచి ఎన్నికల ప్రచారం ?

మన తెలంగాణ / హైదరాబాద్ : టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఒకేసారి ‘బి ఫారాలను’ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో అందజేయనున్నారు. అసెంబ్లీని సెప్టెంబరు ఆరవ తేదీన రద్దు చేసినరోజునే ఒకే విడతలో 105 మంది అభ్యర్థుల పేర్లను, ఇటీవల మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించినందున ఆ 107 మందికే ఆదివారం కెసిఆర్ ‘బి ఫారాలను’ అందజేయనున్నారు. బి ఫారాలను ఇవ్వడానికి ముందు అభ్యర్థులందరితో కెసిఆర్ విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నారు. బి ఫారాలను అందుకోడానికి అభ్యర్థులంతా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ తరఫున ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి. మిగిలిన 12 మంది అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అభ్యర్థులకు బి ఫారాలను ఇవ్వడానికి ముందే కెసిఆర్ తాను పోటీచేయనున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంళో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు వారితో కెసిఆర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు. సుమారు పదిహేను వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నెల 12 నుంచి ఎన్నికల ప్రచారం?
ఈ నెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున అభ్యర్థులు మంచి ముహూర్తాన్ని చూసుకుని, ఇష్ట దైవానికి సమర్పించి ఆ తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తారు కాబట్టి బి ఫారాలను ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారు. అభ్యర్థులకు బి ఫారాలను ఇచ్చిన తర్వాతి రోజు నుంచే కెసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నిర్దిష్టమైన టూర్ షెడ్యూలు తయారీ తుది దశలో ఉన్నందున శనివారం లేదా ఆదివారం కల్లా విడుదల చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. రోజుకు సగటున మూడు చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపాయి. ప్రతీ ప్రచార సభకు వీలైనంత వరకు హెలికాప్టర్‌నే వినియోగించనున్నారని తెలిపాయి. ఇప్పటికే కెటిఆర్ విస్తృతంగా అన్ని జిల్లాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నందువల్ల తొలుక పార్టీకి కీలకంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపాయి. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు చేసిన ప్రచారం, ఎన్ని గ్రామాల్లో తిరిగారు, ప్రజల స్పందన ఎలా ఉంది తదితర అంశాలన్నింటినీ బి ఫారాలను ఇవ్వడానికి ముందే వారితో కెసిఆర్ చర్చించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో తుది దశలో ఉన్నందువల్ల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి సిద్ధం చేసి అధికారికంగా విడుదల చేయాలని పార్టీ భావిస్తోంది. పాక్షికంగా మేనిఫెస్టోను విడుదల చేసినప్పటికీ మహిళలు, యువతకు ప్రాధాన్యత కల్పించే హామీలను చేర్చి తుది మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా ప్రజల్లో విస్తృతమైన ప్రచారానికి అభ్యర్థులకు అవకాశం కలుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అభ్యర్థుల మార్పుకు అవకాశం లేదు :
అసెంబ్లీని రద్దు చేసిన రోజునే 105 మంది అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేసినప్పటికీ కొన్నిచోట్ల మార్చే అవకాశం ఉందని వచ్చిన వార్తలను పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. బి ఫారాలు అందుకోడానికి ఆ అభ్యర్థులందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపినందువల్ల మార్చే అవకాశమే లేదని తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు ప్రకటించిన 107 మంది అభ్యర్థులూ ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చి కెసిఆర్ చేతుల మీదుగా బి ఫారాలను అందుకుంటారని తెలిపాయి. అభ్యర్థులను మార్చే ఉద్దేశమే ఉన్నట్లయితే అలాంటి స్థానాల్లో ఆహ్వానాలు పంపేవారమే కాదని పార్టీ కార్యాలయ ప్రతినిధి ఒకరు వివరించారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పుకు అవకాశమే లేదని స్వయంగా కెసిఆర్ గతంలోనే ప్రకటించారని, ఆ ప్రకారమే ఇప్పుడు బి ఫారాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అభ్యర్థులందరినీ గెలిపించుకునే బాధ్యతను కెసిఆర్ తీసుకుంటున్నారని, అందువల్లనే అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచార సభల్లో పాల్గొంటారని, ఆ ప్రకారమే రూట్ మ్యాప్ తయారవుతోందని వివరించారు.

KCR to give B-Forms to candidates on Sunday

Telangana Latest News