Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నేడు ఢిల్లీకి సిఎం

KCR will Go to Delhi Today

పెండింగ్‌లపై కదలిక రప్పించడానికి ఉన్నతాధికారులతో కలిసి వెళ్లనున్న కెసిఆర్

నేటి సాయంత్రం పయనం
ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో పెండింగ్ అంశాలపై సంప్రదింపులు
ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో స్వయంగా వెళ్లి సాధించుకురావాలని నిర్ణయం
జోనల్ వ్యవస్థకు తక్షణ ఆమోదం పొందే అవకాశం 

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని మోడీతో పాటు, ఇతర కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు చేసినా, కేంద్రం నుంచి ఆశించిన స్పం దన రావడం లేదని భావిస్తున్న సిఎం తానే స్వయంగా వెళ్ళి  అవసరమైతే ఢిల్లీలోనే రెండు మూడు రోజులుండి, ప్రధాని, ఇతర మంత్రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గం, ఎంపి లు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో జరగనున్న సమావేశాన్ని తొందరగా ముగించుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అయిపోయిన తర్వాతనే ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ పెద్దలతో చర్చించే అంశాలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం కోరి రోజులు గడుస్తున్నా ఇంకా రాకపోవడంపై ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సహా కేంద్ర మంత్రులతో లోతుగా చర్చించనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించకపోవడంతో పంచాయితీ కార్యదర్శుల నియామకంతో పాటు మరికొన్ని నియామకాల్లో జాప్యం జరుగుతుందని భావించిన ముఖ్యమంత్రి జోనల్ వ్యవస్థకు తక్షణం ఆమోద ముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని ఈ పర్యటనలో కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తున్నారని, అయినా ఆశించిన ఫలితం రావడం లేదని, దీంతో ముఖ్యమంత్రే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది.

జోనల్ వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అదనపు ఎఫ్‌ఆర్‌బిఎం నిధుల విడుదల, వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల నిధులు, మహిళా సంఘాలు, రైతులకు ఇచ్చే రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీలో కేంద్ర ప్రభుత్వ వాటా విడుదల, హైకోర్టు విభజన, రీజనల్ రింగు రోడ్డుకు నిధులు, సచివాలయం నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో మాట్లాడి రావాలని సిఎం నిర్ణయించినట్లు పేర్కొనింది. ఈసారి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించాలని సిఎం భావిస్తున్నారని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సత్వర పరిష్కారానికి ప్రధాని కార్యాలయం చొరవ చూపాలని ప్రధానిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరనున్నారని తెలిపింది. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇటీవలికాలంలో ప్రధానితో ఇది మూడవ భేటీ
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ కావడం ఇది మూడవసారి అవుతుంది. తొలుత జూన్ నెలలో కలవగా రెండవసారి ఈ నెల మొదటివారంలో కలిశారు. ఇప్పుడు మూడవసారి కలవడానికి వెళ్తున్నారు. తొలిసారి కలిసిన సందర్భంగా పది అంశాలను ప్రస్తావించిన సిఎం కెసిఆర్ రెండవ భేటీ సందర్భంగా మరొక అంశాన్ని చేర్చారు. ఇప్పుడు ఆ అంశాలతో పాటు ఎఫ్‌ఆర్‌బిఎం, రైతుల రుణాలకు ఇచ్చే వడ్డీ రాయితీ, మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ తదితరాలను కూడా ప్రస్తావించనున్నారు. ఈ నెలలో ప్రధానిని కలిసిన తర్వాత కేరళలో వరదలు, మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతి తదితర సంఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర అంశాలపై ప్రధాని ఆమోదం లభించడంలో జాప్యం జరిగింది. టిఆర్‌ఎస్ ఎంపిలంతా పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజున (ఆగస్టు 10) ప్రధానితో భేటీ అయ్యి పదకొండు పెండింగ్ అంశాల గురించి వివరించి చొరవ తీసుకోవాల్సిందిగా కోరారు. రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి పనులు పూర్తిచేసుకోవడంపై దృష్టి పెట్టారు. అవసరమైతే నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండేలా అధికారగణాన్ని వెంట తీసుకుని వెళ్తున్నారు.

Comments

comments