Home తాజా వార్తలు కెసిఆర్‌దే హవా

కెసిఆర్‌దే హవా

ఆమడ దూరంలో కాంగ్రెస్ 

మళ్ళీ ఆయనే సిఎంగా రావాలి
43% మంది ప్రజల మనోగతం

ఇండియా టుడే, యాక్సిస్ సర్వే 

నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలన చాలా బాగుంది 48%

Percentage

బంగారు తెలంగాణ నినాదంతో ముందుకు సాగుతున్న కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందస్తు ఎన్నికల సమరభేరీ మోగించిన ఆయనకు మళ్లీ పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడ్డారు. ‘దండాలయ్యా.. దండాలయ్యా, మీతో మేమూ ఉంటామయ్యా’ అని ఎలుగెత్తి చాటారు. జనాభిప్రాయ సేకరణలో విశ్వసనీయత సంపాదించిన ‘ఇండియా టుడే గ్రూప్, యాక్సిస్ మై ఇండియా’ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో జరిపిన సర్వే సారాంశమిది.

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో ఎన్నికలు త్వరలో జరుగుతాయన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమయంలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇండియా టుడే గ్రూప్, యాక్సిస్ మై ఇండియా సంస్థలు ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’లో భాగంగా సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ప్రజలు కెసిఆర్‌కు, నాలుగున్నరేళ్ళ పరిపాలనకు పట్టం కట్టారు. మళ్ళీ కెసిఆరే సిఎంగా రావాలని 43% మంది ప్రజలు కోరుకుంటుండగా, నాలుగున్నరేళ్ళ పనితీరు ‘చాలా బాగుంది’ అంటూ 48% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 18% మంది కోరుకుంటుండగా, కిషన్‌రెడ్డి కావాలని 15% మంది ఒవైసి కావాలని 4% మంది కోరుకుంటున్నట్లు ఈ సర్వే లో వెల్లడైంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో మొత్తం 7110 మందిని ఈ సంస్థలు ప్రశ్నించగా పై ఫలితాలు వచ్చినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం సర్వే నిర్వహించగా వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సిఎం కావాలని 43% మంది కోరుకుంటుండగా, చంద్రబాబు కావాలని 38% మంది కోరుకున్నారు. పవన్ కల్యాణ్ పట్ల 5% మంది మొగ్గుచూపారు.
తెలంగాణలో సర్వే సంచలనం : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ ఇండియాటుడే సంస్థతో పాటు యాక్సిస్ మాయ్ అనే సంస్థ కలిపి చేసిన సర్వేలో ప్రభుత్వ పనితీరు పట్ల 48% సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని 43% మంది కోరుకుంటున్నట్లు వెల్లడి కావడంతో రాజకీయ చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీల మధ్య పొత్తు కుదరబోతుందన్న వాతావరణం నెలకొన్న సమయంలోనే ఈ సర్వే జరగడం, ఈ అంశాలపై అవగాహన ఉన్న ప్రజలు కెసిఆర్‌కు పట్టం కట్టాలని కోరుకోవడం విశేషం. సర్వేలో కెసిఆర్ దూసుకుపోతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ తరహా పరిస్థితి కనిపించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే ప్రజలు కేవలం 18% మంది మాత్రమే ఉండడం గమనార్హం. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారిలో సగానికంటే తక్కువమంది మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ఆసక్తి కనబర్చారు. ఉత్తమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని ఈ రెండు సంస్థలు ప్రజల అభిప్రాయాలను కోరగా కెసిఆర్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపడం ఈ నాలుగున్నరేళ్ళ పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ప్రజలే అందుకు కారణాన్ని కూడా విశ్లేషించి చెప్పారు. నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని 48% మంది (దాదాపు సగం మంది) కోరుకోవడం విశేషం. ఈ పనితీరే కెసిఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవడానికి కారణమైంది.
అధిక ధరలే ప్రధాన సమస్య : నాలుగున్నరేళ్ళ కెసిఆర్ పాలనలో నచ్చిన అంశాలతో పాటు రానున్న ఎన్నికల్లో ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ప్రజల నుంచి ఆ సర్వే సంస్థలు అభిప్రాయం కోరగా 43% మంది ప్రజలు అధిక ధరలు అనే అంశాన్ని ప్రస్తావించగా, ఆ తర్వాతి స్థానంలో 33% మంది నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. ఆ తర్వాత 30% మంది వ్యవసాయ అంశాల్ని ప్రస్తావించారు. ప్రస్తుత కెసిఆర్ పాలన పట్ల 48% మంది సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ 25% మంది మాత్రం మార్పు రావాల్సిన అవసరం ఉందని, 18% మంది ‘ఫర్వాలేదు’ అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే కేంద్రం పనితీరుపట్ల ప్రజలు తక్కువ సంతృప్తినే వ్యక్తం చేశారు. కేవలం 41% మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. 32% మంది మార్పు రావాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో మళ్ళీ మోడీ రావాలనే కోరుకుంటున్నారు : కేంద్ర పనితీరుపట్ల 41% మాత్రమే సంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ప్రధాని ఎవరు కావాలని కోరుకుంటున్నారన ప్రశ్నకు మాత్రం 44% మంది ‘ఔను’ అని సమాధానమిచ్చారు. రాహుల్‌గాంధీ పట్ల 39% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. ఏకంగా 44% మంది ప్రజలు రాహుల్‌గాంధీ ప్రధానిగా కావాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా కేవలం 39% మంది మాత్రమే మోడీపట్ల ఆసక్తి కనబర్చారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుపట్ల కేవలం 31% మంది మాత్రమే ‘బాగుంది’ అని అభిప్రాయపడగా 42% మంది మార్పు రావాల్సి ఉందని, 23% మంది ‘ఫర్వాలేదు’ అని అభిప్రాయపడ్డారు.