Home జాతీయ వార్తలు భయం గుప్పిట్లోనే కేరళ

భయం గుప్పిట్లోనే కేరళ

వరదలు తగ్గుముఖం పట్టినా ఇంకా జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు
మరో రెండు రోజుల వర్షాలు, కేంద్ర హోం మంత్రి ఏరియల్ సర్వే , వంద కోట్ల సాయం ప్రకటన

Heavy-Rains-in-Kerala

తిరువనంతపురం : తొమ్మిది దశాబ్దాలుగా ఎప్పుడూ లేని రీతిలో కేరళలో జలవిలయం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆదివారం వరద బాధిత ప్రాంతాలలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గగనతల సమీక్ష నిర్వహించారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే తేరిపిని ఇస్తున్నా ఇంకా మొత్తం మీద తీవ్రస్థాయిలో ఆందోళన కల్గిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో చెప్పారు. కేరళలో పొంగిపొర్లుతున్న ఇదుక్కి రిజర్వాయర్‌లో ఆదివారం నీటి మట్టం కొంచెం తగ్గి 2400 అడుగుల స్థాయికి చేరింది. దీనితో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పుడేం జరుగుతుందో అనే భయం వారిని వేటాడుతోంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల సం బంధిత ఘటనలలో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 37కు చేరింది. పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే మగ్గిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఉన్నతాధికారులతో కలిసి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉన్నతాధికా రులు ఉన్నారు. పరిస్థితి విషమంగానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయం అందుతుందని రాజ్‌నాథ్‌సింగ్ భరోసా ఇచ్చారు. ఇడుక్కీ, ఎర్నాకులం జిల్లాల్లో ఏరియల్ సర్వే జరిపిన తరువాత ఆయన కొచ్చికి చేరుకున్న దశలో విలేకరులతో మాట్లాడారు. కేరళకు వంద కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో సైన్యం రంగంలోకి దిగింది. భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 8 జిల్లాల్లో పరిస్థితిని గమనించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు వెలువరించింది. దీనితో ఇప్పటికే తల్లడిల్లుతోన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. యంత్రాం గం పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధంగా ఉంది.
ఉన్నదంతా పోయింది…మిగిలిందేమీ లేదు
కేరళలో పలుప్రాంతాలలో ఇప్పుడు ప్రజల పరిస్థితి దయ నీయంగా మారింది. సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి ఎదుట బాధితులు తమ కష్టాలను రోదిస్తూ తెలియచేసుకున్నారు. చాలా కష్టంగా ఉందని, వరదలతో దిక్కుతోచని స్ధితి ఏర్పడిందని, జీవితంలో కష్టపడి సంపాదించుకుని ఆదా చేసుకున్నదంతా ఈ వరదలతో ఊడ్చిపెట్టుకుపోయినట్లు అయిందని ఇకపై ఏమి చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లాచెదురైన బతుకులను తిరిగి కూడదీసుకోవాలంటే కష్టమే అన్పిస్తోందని వాపొయ్యారు.రాష్ట్రంలో పలుప్రాంతాలలో ఆకస్మిక వరదలతో, భారీ వర్షాలతో ప్రజల విలువైన భూమి పత్రాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపొయ్యాయి. దీనితో యువతలో ఆందోళన నెలకొంది. ఈ విధంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి డుప్లికేట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రత్యేక అదాలత్‌లను ఏర్పాటు చేస్తామని సిఎం విజయన్ ప్రకటించారు.
తీవ్రస్థాయి వరద పరిస్థితి తలెత్తడంతో రంగంలోకి దిగిన త్రివిధ దళాల సైనిక బలగాలు విశేష సేవలు అందిస్తున్నాయి. పలు ప్రాంతాలలో ప్రాణాలకు తెగించి ప్రమాదకర పరిస్థితులలో ఉన్న ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సైన్యం, నౌకా, వాయుదళాలు, జాతీయ విపత్తు నిర్వహణ దళాల బృందాలు సకాలంలో రంగంలోకి దిగడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
1924 తరువాత ఉధృత జల బీభత్సం

రాష్ట్రంలో సగభాగం వరద తాకిడికి గురయిందని అధికారులు తెలిపారు. 1924లో సంభవించిన భారీ వర్షాలు , వరదలు తరువాత రాష్ట్రంలో ఇది పెను ప్రకృతి వైపరీత్యం అని వెల్లడించారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో కనీసం 37 మంది మరణించారని తెలిపారు. ఇప్పటికే 55వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారని వెల్లడైంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు, జనజీవిత పునరుద్ధరణ చేపడుతున్నామని, తరచూ కురుస్తున్న భారీవర్షాలతో ఇది దుర్లభంగా మారుతోందని రాష్ట్ర సిఎం పినరయి విజయన్ ఆదివారం విలేకరులకు తెలిపారు.ఈ కష్టకాలంలో అందరి సహకారం ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న ఇదుక్కీ, వెయనాడ్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల కూడా ఉన్నారు. నేతలు పలు చోట్ల సహాయక శిబిరాలను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు.