Home తాజా వార్తలు కేరళకు బియ్యం

కేరళకు బియ్యం

Telangana to send 500 tonnes of rice to Kerala

లారీల్లో 500 టన్నులు పంపిన ప్రభుత్వం 

 వాహనాలకు జెండా ఊపిన మంత్రులు ఈటల రాజేందర్, నాయిని 

మన తెలంగాణ/ హైదరాబాద్: కేరళ వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (బాయిల్డ్ రైస్) బుధవారం కేరళకు పంపించింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బియ్యం లారీలను బుధవారం ఉదయం కేరళకు పంపించారు. పీపుల్స్ ప్లాజా నుంచి 18 లారీల్లో బియ్యాన్ని పంపించగా, మరో 6 లారీల్లో బియ్యాన్ని వివిధ జిల్లాల నుంచి పంపించారు.

ఈ బియ్యాన్ని కేరళలోని కొచ్చిఎర్నాకులం సమీపంలో ఉన్న ఎడతల టౌన్ సిడబ్లుసి (సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) గోదాంకు చేరవేస్తారు. 1102 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోదాములకు లారీలు18 గంటల్లో చేరుకుంటాయి. ఒక్కో లారీలో 210 క్వింటాళ్ల చొప్పున 24 లారీల్లో 500 టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించారు. బియ్యం నాణ్యతను పరిశీలించి తూకం వేసి లోడింగ్ చేశారు. లారీలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. ఎడతలకు చేరి అన్‌లోడింగ్ అయ్యే వరకు పౌర సరఫరాల భవన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీటిని నిరంతరం పర్యవేక్షిస్తారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్, కేరళ ఫుడ్ సెక్రటరీ శ్రీమిని ఆంథోనీ, ఫుడ్ డైెరెక్టర్ డాక్టర్ ఎన్.టి.ఎల్. రెడ్డిలు ఈ ప్రక్రియను సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
వస్తు సామాగ్రి వాహనాలకు జెండా ఊపిన నాయిని
దయనీయ పరిస్థితుల్లో ఉన్న కేరళ వరద బాధితుల కోసం వస్తు సామాగ్రిని తీసుకెళ్ళే వాహనాలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ఊపి సాగనంపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సమన్వయంతో కాన్ఫడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ (సిటిఆర్‌ఎంఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ నెల 19వ తేదీన వస్తు సామాగ్రిని సేకరించి 200 బ్యాగుల బియ్యం, ఇతర వస్తువులు, బట్టలు తదితరాలను 16 వాహనాలలో కేరళకు పంపారు. కొన్ని వాహనాలు ఇప్పటికే బయలుదేరగా మరికొన్నింటిని బుధవారం పంపారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఇటీవలే తాను కేరళ వెళ్లానని, అక్కడి పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఊహించని వరదలతో ఇళ్లు కూలిపోయి, బంధువులను కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ సహృదయంతో రూ.25 కోట్లు ఆర్ధిక సహాయం చేయడంతో పాటు 500 క్వింటాళ్ల బియ్యం, ‘బాలామృతం’, నీటి శుద్ధి పరికరాలు పంపారన్నారు. కొత్తగా ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎంతో బాధ్యతతో పొరుగు రాష్ట్రానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సిటిఆర్‌ఎంఏ ప్రతినిధులు లిబ్బి బెంజిమన్, జోషి దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.