Home జాతీయ వార్తలు బాధితుల నేల కేరళ

బాధితుల నేల కేరళ

పదిరోజులుగా నీటిలోనే కేరళ….

Kerala-Floods

తిరువనంతపురం : జలఖడ్గపు విలయపు ధాటికి కోలుకోలేని రీతిలో తల్లడిల్లుతోన్న కేరళ ఇప్పుడు బాధితుల నేలగా మారింది. ఓ వైపు కొంచెం వర్షాలు తెరిపినిచ్చి, వరదలు తగ్గుతున్నా ఇప్పటికీ వేలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉపసంహరించుకున్నారు. అయినా సురక్షిత ప్రాంతాలను చేరుకునే ఆత్రుతలో ప్రజానీకం ఉన్నారు. ఇప్పటికే వర్షబాధిత కేరళలో 245 మంది మృతి చెందారు. కళ్ల ముందు కనివిని ఎరుగని రీతిలో సంభవించిన కుండపోత వానలతో బతుకులు అగమ్యగోచరంగా మారిన వారి వైనం దైన్యంగా ఉంది. ఆగస్టు 8వ తేదీన ఆరంభం అయిన ఉధృత వర్షాలు పెను ప్రళయాన్నే సృష్టించాయి. ఓ వైపు ఇళ్ల ముందు ఉరకలు వేస్తున్న నీటి సుడులు. మరోవైపు ఇళ్లల్లో బందీలుగా వేలాది మంది…గత పది రోజులుగా కేరళలోని పలు ప్రాంతాలు మిగితా ప్రపంచంతో సంబంధాలు లేకుండా రెక్కలు తెగిన పక్షిలా మారింది. ఇండ్లల్లో తినడానికి తిండి లేక, ఇంట్లో బురద మేటలు వేసుకుపోగా ఎర్నాకులం, త్రిస్సూర్, అలప్నుజా జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు తల్లడిల్లుతున్నారు. అన్నింటికి మించి ఇదుక్కీ జిల్లాలో మృతుల సంఖ్య అత్యధికంగా 43కు చేరింది. పలు జిల్లాల్లో మృతుల సంఖ్యపై అధికారిక లెక్కలు వెలువడ్డాయి. మల్లాపురం జిల్లాలో 28 మంది, త్రిస్సూర్‌లో 27 మంది వరదలకు బలి అయ్యారు. ఇక అలాపూజా జిల్లాలోని చెంగనూర్‌లో ఇప్పటికీ కనీసం 5వేల మంది జలదిగ్డంధంలో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపైగా వివిధ సహాయక శిబిరాలల్లో తలదాచుకుంటున్నారు.
నాలుగురోజులుగా తిండీ తిప్పలు లేవు
ఏదో విధంగా చావు తప్పి బయటపడ్డాం. ఇప్పటికీ నాలుగు రోజులుగా తిండి లేదు. ఎటుచూసినా మెడ లోతు నీళ్లు. చుట్టూ ఉన్న నీళ్లతోనే దప్పిక ఆకలి తీర్చుకోవల్సి వస్తోందని , ఇప్పుడిప్పుడే పతనంథిట్ట జిల్లాలోని రాన్నీ సహాయక శిబిరంలోకి వచ్చిన ఓ మహిళ తెలిపింది. అలప్పుజాకు సమీపంలోని అరన్‌ములా వద్ద కూడా ఓ మహిళ తన బాధలు తెలియచేసుకుంది. తనకు రెండు రోజులుగా తిండి లేదు, నీళ్లు లేవని తెలిపింది. వరద ముంచుకొస్తున్నా, వానలు వీడకున్నా ఇప్పటికీ వందలాది మంది తమ ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. ఎక్కడికి పోయినా తమకు బాధలు తప్పవనే దైన్యంతో గడుపుతున్నారు. బుధవారం రాత్రి ఓ చర్చిలో ఒక భాగం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఎర్నాకులం జిల్లాలోని పరావూర్‌లో జరిగిన ఈ దుర్ఘటన గురించి ఆలస్యంగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చర్చిలో దాదాపు 600 మంది తలదాచుకున్నారు. అయితే వారికి ఇప్పటివరకూ ఏ వైపు నుంచి కూడా సరైన సాయం అందలేదు. చర్చిలోకి వచ్చిన ఛాతీలోతు నీళ్లల్లోనే జనం బిక్కుబిక్కు మంటున్నారు. తమ పరిస్థితి గురించి అక్కడికి వచ్చిన టీవీ ఛానల్స్ ప్రతినిధులతో తెలియచేసుకుంటున్నారు.
‘తిండి లేదు., తాగే నీరు లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆదుకునేందుకు ఎవరూ రాలేదు ’ అని ఓ వ్యక్తి తెలిపారు. ఇక ఈ చర్చిలో ఓ భాగం కూలి ఆరుగురు చనిపోయిన ఘటనపై ఇప్పటికీ అధికార యంత్రాంగం నుంచి నిర్థారణ ఏదీ వెలువడలేదు. ఇది కేవలం అధికార యంత్రాంగం ఉదాసీనత, అంతకు మించి ప్రజల ప్రాణాల పట్ల వారికున్న బాధ్యతారాహిత్యం అని విమర్శలు వెలువడ్డాయి.

దిశలు మారుతున్న నదులు, వాగులు

పలు చోట్ల నదుల కట్టలకు గండ్లు పడటంతో అవి దిశను మార్చుకుని దూసుకువస్తున్నాయి. దీనితో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. త్రిస్సూర్‌లో కరివన్నూర్ నది ప్రాంతంలో గండ్లు పడటంతో అది పొంగిపొర్లిన ఘటనలో దాదాపు 42 గ్రామాలు జలమయం అయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి విఎస్ సునీల్ కుమార్ తెలిపారు. త్రిస్సూర్ జిల్లాలో రెండు లక్షల మందికి పైగా శిబిరాలలో తలదాచుకుంటున్నారు. కొచ్చి నౌకా విమానాశ్రయం సోమవారం నుంచి తిరిగి ప్రయాణాలకు సిద్ధం అవుతోంది. దీనితో కొంత ఊరట ఏర్పడింది. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు జలమయం కావడంతో దీనిని ఈ నెల 26వరకూ మూసివేశారు. దీనితో ఇప్పుడు నేవీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు దిక్కు అయింది. రైల్వేశాఖ 18 రైళ్లను రద్దు చేసింది. పాక్షికంగా తొమ్మిది రైళ్లను రద్దు చేసింది. ఇక ఆదివారం కన్నాకుమారి ముంబై సిఎస్‌టి ఎక్స్‌ప్రెస్‌ను పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాగర్‌కోయిల్, తిరునల్వేలి, మధురై, దిండిగల్, ఎరోడ్‌ల మీదుగా దారి మళ్లించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రైలు, రోడ్డు మార్గాలు జలమయం అయ్యాయి.రాష్ట్ర రవాణా సంస్థ, ప్రైవేటు సంస్థల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది.

రూ. 21వేల కోట్ల నష్టం

కేరళలో గత పదిరోజులుగా కొనసాగుతోన్న జలవిలయానికి మృతుల సంఖ్య ఇప్పటికే 245కు చేరింది. దాదాపు 8 లక్షల మంది నిర్వాసితులు అయ్యారు. ఇప్పటికీ రూ 21,000 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల సహాయక శిబిరాలలో ఈ ఎనిమిది లక్షల మంది బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ వివరాలను ఆదివారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సీనియర్ అధికారి పిహెచ్ కురియన్ ఆదివారం ఇక్కడ తెలిపారు. వరద పరిస్థితి, బాధితుల గురించి సమగ్ర అధికార ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. పలు ప్రాంతాలలో వర్షాలతో సంభవించిన నష్టం సమాచారం అందుతోందని కురియన్ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు ప్రాంతాలలో జల దిగ్బంధంలో ఉన్న ప్రజలకు ఆహారం, సహాయక సామాగ్రి సరఫరాకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయని ఈ అధికారి తెలిపారు. మారుమూల ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా పోవడంతో అక్కడికి మరపడవలతో, దాదాపు 24 హెలికాప్టర్లతో చేరుకుని సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉన్న మరో పదివేల మందిని సోమవారం నాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.

నష్టం వివరాలు

భారీ వర్షాలతో 40,000కు పైగా హెక్టార్లలో పంట నష్టం
1000కి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టం
26,000 ఇళ్లు పాక్షిక ధ్వంసం
134 వంతెనలు, 16,000 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా ధ్వంసం
పలు విధాలుగా జరిగిన నష్టాలతో ఇప్పటికీ మొత్తం నష్టం రూ 21,000 కోట్లు

బాధితులు సురక్షిత ప్రాంతాలకు

కేరళలో జల దిగ్డంధంలో ఉన్న వారిలో అత్యధికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకూ వరద తాకిడితో మృతుల సంఖ్య 210కి చేరిందని సిఎం వెల్లడించారు. అత్యధికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినందున ఇక ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించే అంశంపై దృష్టి సారిస్తుందని వివరించారు. ఆదివారం పలు ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీనితో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ఎత్తివేసినట్లు సిఎం తెలిపారు. రాష్ట్రంలో దాదాపు ఏడులక్షల ఇరవైనాలుగు వేల మంది వరకూ బాధితులు అయ్యారని సిఎం చెప్పారు. అంతకు ముందు ఆయన రాష్ట్ర రాజధానిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 22వేల మందిని సైనిక సిబ్బంది రక్షించింది. త్రివిధ బలగాలు చేపడుతున్న రక్షణ, సహాయక చర్యలు అభినందనీయం అని సిఎం కొనియాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, ప్రతి పంచాయితీలో ఆరు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు , వరద తగ్గుముఖం పట్టడంతో ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కేరళ పరిస్థితిపై రాష్ట్రపతి ఆరా

న్యూఢిల్లీ కేరళ వరద పరిస్థితిపై ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడారు. కేరళ ప్రజల పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారని, ఈ కష్టకాలంలో వారు వారు ధైర్యంగా కలిసికట్టుగా వ్యవహించడాన్ని రాష్ట్రపతి అభినందించారని, దేశమంతా కేరళవాసుల కష్టాలలో పాలుపంచుకుని వారిని ఆదుకుంటుందని రాష్ట్రపతి తెలిపారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవడం పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. సహాయక సంస్థలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఆయన అభినందించారని వెల్లడించారు.