Home జాతీయ వార్తలు కేరళ విలవిల

కేరళ విలవిల

జల దిగ్బంధంలో ఇడుక్కి
సహాయచర్యలకు రంగంలోకి దిగిన సైన్యం,
రిసార్టులో చిక్కుకున్న 50 మంది పర్యాటకులు
వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష

Heavy-Rains

తిరువనంతపురం: కేరళను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నాయి. ఇప్పటికే మూడు గేట్లు ఎత్తిన ఇడుక్కి రిజర్వాయర్‌నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశాలు ఉండడంతో ఇడుక్కితో పాటుగా మూడు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయినందున పర్యాటకులు ఈజిల్లాను సందర్శించడంపై నిషేధం విధించారు. ముఖ్యంగా పదినుంచి ఇరవై సెంటీమీటర్ల దాకా వర్షం పడవచ్చని భావిస్తున్న తొలి 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వందలాది పట్టణాలు, గ్రామాలు నీట మునగడం, వరదల కారణంగా రాష్ట్రంలో29మందికి పైగా చనిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత పెద్దదయిన ఇడుక్కి రిజర్వాయర్‌తో పాటుగా 22 రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసినందున జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్), నేవీ. సైనిక దళాలకు చెందిన సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

కొండచరియలు విరిగిపడ్డం కారణంగా రోడ్లు మూసుకు పోవడంతో మున్నార్‌లోని ప్లమ్ జుడి రిసార్ట్ వద్ద బుధవారంనుంచి చిక్కుకు పోయిన దాదాపు 50 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని, వీరిని కాపాడేందుకు సైన్యం సహాయం తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ చెప్పారు. వీరిలో కొంతమంది విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు. వీరినందరిని సైన్యం సాయంతో కేరళ పర్యాటక శాఖ విశ్రాంతి కేంద్రాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన అయిదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టినందున పెరియార్, చెరుతోని నదుల్లో ప్రవాహం భారీగా పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తగా ఉండాలని నదీ పరీవాహక ప్రజలను అధికారులు హెచ్చరించారు. శుక్రవారం ఉదయం వరద పరిస్థితిని, సహాయ చర్యలను సమీక్షించిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించారు. నీటి ప్రవాహం భారీగా పెరగడంతో ఇడుక్కి రిజర్వాయర్‌నుంచి ఇప్పుడు విడుదల చేస్తున్న నీటికి మూడు రెట్లు నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ఈ నెల 12 దాకా అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి తిరువనంతపురంనుంచి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కోరే మరే ఇతర సహాయాన్నయినా అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నంథానన్ ట్విట్టర్‌లో తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని తాను హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు. కాగా నిన్న రాత్రినుంచే సైన్యానికి చెందిన అయిదు కాలంలు సహాయక చర్యలనకోసం రంగంలోకి దింపినట్లు కల్నల్ అజయ్ శర్మ తెలిపారు.