Home ఆఫ్ బీట్ విష్ణు… విచిత్ర విన్యాసం!

విష్ణు… విచిత్ర విన్యాసం!

Kerala Photographer Who Shot to Fame By Hanging Upside Down From a Tree

ఇంట్లో పెళ్లిలాంటి శుభకార్యాలకు తప్పనిసరిగా ఫొటోగ్రాఫర్ ఉండాల్సిందే. అందులోనూ పెళ్లికి ఫొటోగ్రాఫర్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే వధూవరుల ఫొటోషూట్‌కి డిమాండ్ పెరిగింది. పెళ్లి ఫొటోలు అనేవి జీవితాంతం గుర్తుండి పోయేవి. వాటిని కొంచెం వినూత్నంగా తీయించుకోవడం ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. వెడ్డింగ్ ఫొటోలు తీయించుకోవడంలో భారతీయులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. వినూత్నంగా, విభిన్నంగా తీసే ఫొటోగ్రాఫర్లు చాలా కొద్దిమందే ఉంటారనే విషయం తెలిసిందే. వెడ్డింగ్ సీజన్ వచ్చిందంటే చాలు ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనే. కేరళకు చెందిన ఫొటోగ్రాఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. అతడు తీసిన పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఇంటర్‌నెట్, వాట్సప్‌ల్లో వైరల్ అవుతున్నాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. “జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!” అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు.

చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ విష్ణు తీసిన ఫొటోల వీడియో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో తెలిసిందే. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట! విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్. ‘వైట్‌ర్యాంప్’ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్-, నవ్య’ల పెళ్లిని కవర్ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను ఒప్పించాడు. చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీశాడు. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్ మెంబర్ ఒకరు షూట్ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్ ఫొటోగ్రాఫర్స్ వాట్సప్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేశారు. ఫన్నీగా ఉన్న ఆ వీడియో గంటల్లోనే వైరల్ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి. ఈ ఆలోచన హఠాత్తుగా అప్పటికప్పుడు తట్టింది నాకు. పెళ్లి కొడుకు ఇంట్లో ఫొటోలు తీస్తుండగా, పెరట్లో చెట్టు కనిపించింది. నాకు నచ్చింది. టాప్ యాంగిల్‌లో ఎలా తీయాలా అని ఆలోచించాను. ఇక మిగతాది మీకు తెలిసిందే అంటాడు విష్ణు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన విష్ణును త్రిసూర్ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్ ఫొటోగ్రాఫర్’ అని పిలుచుకుంటున్నారు. మలయాళంలో వివ్వల్ అంటే గబ్బిలం. ఫొటోలు బాగా రావడంతో షియాజ్,-నవ్యలు కూడా సంతోషంగా ఉన్నారట. పైసా ఖర్చు, ప్రచారం లేకుండా సెలబ్రిటీగా పేరుతెచ్చుకున్న విష్ణు అండ్ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. “నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ అనుభవం బాగా పనికొచ్చింది అంటాడు నవ్వుతూ విష్ణు. ఈ రంగంలో వచ్చి మూడేళ్లయిందంటాడు. పనిలో ఉన్న కమిట్‌మెంట్, పట్టుదల వల్ల కొత్తగా అందరికంటే భిన్నంగా తీయాలనే ఆలోచనే తనను నడిపిస్తుందంటాడు. ఇలా చెట్లెక్కి ఫొటోలు తీయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు చాలా సార్లు తీశాను. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఇది వైరల్ అయ్యిందంటాడు. ఈ క్రెడిట్ మొత్తం నా కజిన్‌కు దక్కుతుంది. అతనే నన్ను వైట్‌ర్యాంప్ ఓనర్ బిజుకి పరిచయం చేశాడు. ఇలా నాకీ అవకాశాలు వచ్చాయి. చాలా ఐడియాలున్నాయి. టెక్నిక్ సాయంతో వాటిని అమలుపరచాలనుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరింత వినూత్నంగా పనిచేస్తాను అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. తల్లిదండ్రులు రవీంద్రన్, మణి. ఇలాంటి అడ్వెంచర్ పనులకు మొదట భయపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.