Home వార్తలు కిరోసిన్ మాఫియా

కిరోసిన్ మాఫియా

బ్లాక్ మార్కెట్‌లో పెరిగిన నీలి కిరోసిన్ దందా
డీలర్ల సహకారంతో నల్లబజారుకు భారీగా కిరోసిన్ తరలింపు
చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

Kerosene1మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలోని రేషన్ దుకాణాల్లో కిరోసిన్ మాఫియా చొరబడింది. పేదలకు అందాల్సిన కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకొంటున్నది. దీనిపై నిఘాపెట్టాల్సిన అధికారులు ఆక్రమార్కులకు కొమ్ముకాయడంతో ఈ వ్యవహారం బహిరంగంగానే  కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు తెల్లకార్డుదారులకు ప్రతినెలా నాలుగు లీటర్లు, వంటగ్యాస్ ఉన్న వినియోగాదారుడికి ఒక లీటర్ చొప్పున కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే నగరంలోని పౌరసరఫరాలశాఖ సర్కిల్- 4, సర్కిల్- 6, సర్కిల్-8, సర్కిల్- 9 పరిధుల్లోని కొంతమంది డీలర్లు వినియోగదారులకు సక్రమంగా కిరోసిన్‌ను పంపిణీ చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్‌ను వీరు యథేచ్ఛంగా నల్లబజార్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల నుంచి మాఫియా తక్కువ ధరకు కిరోసిన్‌ను కొనుగోలు చేసి నల్లబజార్‌లో అధిక ధరలకు అమ్ముతూ ప్రభుత్వానికి సవాల్ విసురు తోంది. ప్రధానంగా నగరశివార్లలో ఉన్న రంగుల కంపెనీలకు మాఫియా సభ్యులు కిరోసిన్‌ను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. లారీలలో కూడా ఈ కిరోసిన్‌ను వాడుతుండటంతో మాఫియా వారికి కూడా కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. రేషన్‌షాపుల ద్వారా లీటర్‌కు 15 రూపాయలకు అమ్మాల్సిన కిరోసిన్ ఈ మాఫియా 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కంపెనీలకు అమ్ము తున్నది. అలాగే స్థానికంగా ఉన్న హోటళ్లు, ఇడ్లీ, మిర్చిబండ్లు, గప్‌చుప్ దుకాణాలకు, ప్రైవేట్ హాస్టళ్లకు నీలి కిరోసిన్‌ను తరలిస్తూ అధిక ధరలకు అమ్ముకుం టున్నారు. ఇటీవలే ఈ సర్కిళ్ల పరిధుల్లో సెంట్రల్, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 27మంది రేషన్ డీలర్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే బియ్యం అక్రమ రవాణాను తాత్కాలికంగా బంద్ చేసిన డీలర్లు మాఫియాతో కుమ్మక్కై కిరోసిన్ అక్రమ దందాను ప్రారంభించినట్లు తెలిసింది. కిరోసిన్ మాఫియా బహిరంగంగా ఈ దందాను కొనసాగిస్తున్నా పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
డీలర్లపై అధికారులకు ప్రేమెందుకో?
మాఫియాతో కుమ్మక్కై ఆక్రమంగా కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తూ పట్టుబడుతున్న డీలర్లపై పౌర సరఫరాశాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు డీలర్లు కిరోసిన్‌ను నల్లబజార్‌కు తరలిస్తున్న విష యాన్ని గుర్తించిన వినియోగదారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కిరోసిన్‌ను తరలిస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడంలో, వారిపై చర్యలు తీసుకో వడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పౌర సరఫరాల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా పలుమార్లు కిరోసిన్‌ను తరలిస్తున్న కొంతమంది డీలర్లను పట్టుకున్నారు. అయితే తమ శాఖాధికారులు పట్టుకున్న సందర్భాల్లో కూడా అధికారులు డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరోసిన్‌ను తరలిస్తూ పట్టుబడి డీలర్లు రెండో రోజు నుండే యథావిధిగా దుకాణాలను నడుపుతున్నారని వారంటున్నారు. అధికారులు సదరు డీలర్లపై ఎంతకంతా ప్రేమో తెలియడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిరోసిన్ మాఫియాపై ఉక్కుపాదం మోపి, పేదలకు కిరోసిన్ సక్రమంగా అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.