Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కేశవ లీలలు

జిల్లాలో రూ. 5.5 కోట్ల డిపాజిట్ల సేకరణ
విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
పాఠశాలకు చేరుకుంటున్న బాధితులు

Untitled-3మహబూబ్‌నగర్: కేశవరెడ్డి పాఠశాలల యాజమాని కేశవరెడ్డిని కర్నూల్ పోలీసులు అరెస్టు చేయడంతో డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన ఒక్క సారిగా పెల్లుబికింది. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి పాఠశాల వద్దకు బాధితులు చేరుకుని ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే విద్యార్థుల చదువు కోసం ఒక్కసారి డిపాజిట్ చేసినట్లయితే పదో తరగతి వరకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యతోపాటు బుక్స్ మెటీరియల్, యూనిఫామ్స్ అన్నింటిని అందిస్తామన్నారు. దీనిని నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం దొరికిన చోట అప్పు చేసి యాజమాన్యం అడిగినంత డిపాజిట్లు చేశారు. వారితో సేకరించిన డిపాజిట్లకు యాజమాన్యం రశీదులు, ప్రాంసరీ నోట్లను సైతం జారీ చేసి వారిని నమ్మించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.5 కోట్ల వరకు డిపాజిట్లను సేకరించిన యాజమాన్యం ఈ సొమ్ముతో షేర్ మార్కెట్‌లో వ్యాపారం చేసి తిరిగి ఎవ్వరి డిపాజిట్లు వారికి చెల్లిస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ ఇన్నాళ్లు ఏ వ్యాపారం చేసిందో యాజమాన్యానికే తెలియాలి.

కానీ డిపాజిట్లు చేసిన వారికి ఒక్క పైసా చెల్లించ కుండా చేతులెత్తేసింది. ఇక పాఠశాలను విక్రయిస్తున్నారన్న ప్రచారాలకు డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఏడాది ప్రారంభం నుంచే తమ డిపా జిట్లు తిరిగి చెల్లించాలని పట్టు బట్టడంతోపాటు ఆందోళనలు చేశారు. అయితే యాజమాన్యం వెంటనే స్పందించి పాఠశాలలను విక్రయించడం లేదని మరో సారి నమ్మించి పాఠశాలను కొనసాగిస్తున్నారు. కానీ విద్యార్థుల పట్ల శ్రద్ధ, వారికి అందించే విద్య రెండింటిని తగ్గిస్తూ ఒక్కో అడుగు వెనక్కు వేస్తూ వచ్చింది. ఈ సమయంలో పాఠశాల యాజమాని కేశవరెడ్డిని అరెస్టు చేశారనే వార్త వెలువడడంతో డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ఒక్కసారిగా పెల్లుబికింది. తాము చెల్లించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాకే పాఠశాలను విక్రయించాలంటూ వారంతా పట్టుబట్టారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాయపల్లి గ్రామానికి చెందిన శేఖర్ అనే బాధితుడు మాట్లాడుతూ తన అక్క కుమారుడిని ఆరో తరగతిలో ప్రవేశం కల్పించినప్పుడు 2 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వాలని, ఇందుకు గాను విద్యార్థికి పాఠశాల ఫీజుతోపాటు హస్టల్ ఫీజు కూడా వడ్డీలోనే మినహించుకుంటామని యాజమాన్యం బరోసా ఇవ్వడంతో ఉన్న పొలాన్ని అమ్మి డబ్బులు ఇచ్చామన్నారు.

తన అల్లుడు ఇటీవలే ఇక్కడ పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ వేరో చోట చదువుతున్నాడని, డబ్బులు ఇవ్వాలంటూ ప్రామీసరీ నోట్‌తో సహా పలు మార్లు కళాశాల యాజమాన్యాన్ని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన వాపోయాడు. ఇదే తరహా మో సానికి గురైన పలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ ఆవేదనను తెలియపరుస్తున్నారు. గత ఏడాది నుంచి కేశవరెడ్డి పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోవడంతో యాజమాన్యం తప్పించుకు తిరిగే దోరణితో ముందుకు సాగుతున్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి ఆందోళనకు దిగారు. ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు స్వీకరించారు. ఈ పరిస్థితుల్లో కేశవరెడ్డి యాజమాని అరెస్టు కావడంతో పాఠశాల భవితవ్యం ప్రస్తుతం డోలాయమానంలో పడిపోయింది. నాణ్యమైన విద్య, చక్కటి వసతి కల్పించడంతోపాటుగా అత్యున్నతమైన విద్యను అందిస్తామని గొప్పగా చెప్పిన కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను ఈ విధంగా మోసం చేసి కటకటాల పాలుకావడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేపోతున్నారు.

 

Comments

comments