Home కెరీర్ పోలీసుల లెక్క రూ.470 కోట్లు….

పోలీసుల లెక్క రూ.470 కోట్లు….

keshavareddy-schools

పోలీసుల లెక్క రూ.470 కోట్లు, అసలు లెక్క రూ.800 కోట్ల పైమాటే
తెలంగాణ నుంచి కొల్ల గొట్టింది రూ.150 కోట్లు
వైట్ కాలర్ నేరాలకు పరాకాష్ట కేశవరెడ్డి విద్యా సంస్థ గోల్‌మాల్
రెండు దశాబ్దాలుగా అక్రమాలు జరుగుతున్నా చోద్యం చూసిన సర్కారీ విభాగాలు
మన తెలంగాణ/ హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థ ముసుగులో నిబంధనలకు విరుద్దంగా కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసిన కేశవ రెడ్డి స్కూల్స్ అసలు రంగు ఒక్కోటి వెలుగులోకి వస్తోంది. ఇప్పటి వరకు కేశవ రెడ్డి స్కూల్స్ వసూలు చేసింది 470 కోట్ల రూపాయలేనని ఎపి పోలీసులు అంటున్నా ఈ మొత్తం 800 కోట్ల రూపాయలకు పైబడే వుంటుందని బాధితులు చెబుతున్నారు. కేశవ రెడ్డి సంస్థ వసూళ్లలో తెలంగాణ నుంచి 150 కోట్ల రూపాయల వరకు వుండవచ్చని పోలీసు రాష్ట్ర పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యా సంస్థ ముసుగులో రెండు దశాబ్దాలుగా కేశవరెడ్డి స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్లు వసూలు చేస్తున్నా దీనిపై చర్యలు తీసుకునే విషయంలో అటు పోలీసులు ఇటు డిపాజిట్ల నియంత్రణ రంగం పూర్తిగా వైఫల్యం చెందడం ఒక ఎత్తు కాగా దేశ వ్యాప్తంగా ఇటీవల వెలుగు చూసిన బడా వైట్ కాలర్ నేరాలకే ఇది పరాకాష్టగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో భారీ వైట్ కాలర్ నేరం వెలుగు చూసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఏడు రాష్ట్రాలలో లక్షలాది మందిని నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ గోల్‌మాల్ వ్యవహారం ఇంకా మరువక ముందే కేశవ రెడ్డి విద్యా సంస్థ బిచాణా ఎత్తి వేసింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ మామూలు టీచర్ నాగిరెడ్డి కేశవ రెడ్డి 1990 దశకంలో ప్రారంభించిన కేశవ రెడ్డి స్కూల్స్ మొదట రాయలసీమకే పరిమితమైనా అనతి కాలంలోనే ఉమ్మడి ఎపిలోని అన్ని ప్రాంతాలలో విస్తరించి ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకదానిగా పేరుగాంచింది. ఈ సంస్థలో చదువుకున్న అనేక మందికి మంచి ర్యాంకులు రావడంతో వేల సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఈ క్రమంలోనే కేశవరెడ్డి 1996లో దేశంలోనే తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ల సేకరణ ప్రారంభించారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతూ ఇందుకు గానూ లక్ష రూపాయల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశాడు కేశవ రెడ్డి. ఓ ప్రైవేటు పాఠశాల ఇలా చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినా, 19 ఏళ్లుగా పోలీసులు కానీ బ్యాంకింగ్ రంగానికి చెందిన నిఘా విభాగం కానీ గుర్తించి చర్యలు తీసుకోకపోవటం పెద్ద వైఫల్యమని చెప్పాలి. నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థ లేదా మరేదైనా వ్యాపార వర్గాలు తమ వ్యాపార విస్తరణ కోసం ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసే పక్షంలో దీనిపై రిజర్వ్ బ్యాంక్‌కు ముందుగానే సమాచారం ఇవ్వాలి. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను ఎందుకు వాడుతున్నదీ చెప్పడంతో పాటు ఈ డబ్బులు ఎలా వినియోగమవుతున్నదీ తెలపాలి. డిపాజిటర్లకు తిరిగి ఎలా చెల్లిస్తారనే అంశంపై వివరించాలి. కానీ కేశవ రెడ్డి వీటిని ఎక్కడా పాటించలేదు. ఆఖరుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల డిపాజిట్లకు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా నెలకు రూపాయిన్నర వడ్డీ కొంత కాలం చెలి ్లంచాడు. మొదట దీనిపై కేశవ రెడ్డి రసీదులు ఇచ్చి కొన్నేళ్ల తరువాత ప్రామిసరీ నోట్లు ఇవ్వసాగాడు. కేశవ రెడ్డి 1996 నుంచి ఇలా చేస్తున్నా దీని పై ఆయా ప్రాంతాలకు చెందిన బ్యాంకులకు పోలీసు నిఘా వర్గాలకు కనీస సమాచారం లేక పోవడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాలపై సమాచారం సేకరించేందుకు బ్యాంకింగ్ రంగానికి చెందిన నిపుణులు ప్రత్యేకంగా ఉంటారు. పోలీసు నిఘా విభాగం కూడా వీటిపై సమాచారం సేకరించి సర్కారుకు నివేదికలు అందించాల్సి ఉంది. కేశవ రెడ్డి అక్రమాలపై బ్యాంకింగ్ రంగం, నిఘా విభాగం ఎలా విఫలం అయిందనే దాని పై రాబోయే రోజుల్లో వాస్తవాలు వెలుగు చూసే వీలుంది. కేశవ రెడ్డి ఇచ్చిన లంచాలకు మరిగి ఈ రెండు విభాగాల అధికారులు అసలు విషయాలను దాచారాని అనుమానాలు వ్యక్తం అవుతున్నా నిజాలను పోలీసులు త్వరలో వెలికి తీసే అవకాశాలున్నాయి.
ఇంతకు వసూలు చేసింది ఎంత…? ఆ నిధులు ఎక్కడికెళ్లాయి…?
ఇదిలావుండగా కేశవ రెడ్డి స్కూల్స్ నిర్వాహకుడు కేశవ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసింది ఎంత అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇతన్ని అరెస్టు చేసిన కర్నూలు జిల్లా పోలీసులు మాత్రం కేశవ రెడ్డి వసూలు చేసింది 470 కోట్ల రూపాయల వరకు ఉంటుందని లెక్కలు తేల్చారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు ఈ సొమ్ము 800 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. కేశవరెడ్డి స్కూల్స్ బాధితులు తెలంగాణలో కూడా వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా తాను వసూలు చేసిన వందల కోట్ల రూపాయల డిపాజిట్లను ఏం చేశాడనే విషయమై కేశవ రెడ్డి పోలీసులకు సరైన సమాధానం ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి భారీగా భూములు కొన్నానని ఒకసారి, అధిక వడ్డీకి అప్పులు తీసుకుని నిండా మునిగానని మరోసారి చెబుతుండడంతో పోలీసులకు ఎటు పాలుపోవడం లేదు. తాను వసూలు చేసిన డబ్బులు భద్రంగానే ఉన్నాయని, ఏడాది తరువాత అందరికి తిరిగి ఇస్తానని కేశవ రెడ్డి చెబుతున్నా అతని మాటల్లో నిజమెంతో పోలీసుల పూర్తి విచారణ తరు వాత కానీ తెలిసే అవకాశం లేదు