Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఖైరతాబాద్ గణపతి

1979లో 20 అడుగుల వినాయకుడిని తయారు చేసి ఇక్కడ ప్రతిష్టించారు. 1981లో 25 అడుగుల నాట్య వినా యకుడు, 1982లో మూషిక వాహన వినాయకుడి ద్వారా ఖైరతాబాద్ గణపతికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

Khairatabad Ganapati

తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి అంటే మొదటగా మదిలో మెదిలేది భాగ్యనగరంలోని ఖైరతాబాద్ గణేశుడే. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణపతికి 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు లక్షలాది మందిని భక్తిపరవశుల్ని చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ వినాయకచవితి ఉత్సవాలకు 63 సంవత్సరాల చరిత్ర ఉంది. భక్త కోటిపై తన కరుణ నిండిన చూపుల్ని ప్రసరింపచేస్తున్నట్లు కొలువు తీరే ఖైరతాబాద్ భారీ గణపతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.

ఒక్క అడుగు నుంచి 60 అడుగుల దాకా..

ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 1954లో ఒక అడుగు ఎత్తు గణేశుడి విగ్రహంతో ప్రారంభమైంది. అప్పట్లో ఖైరతాబాద్ కౌన్సిలర్ సింగరి శంకరయ్య స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు. తొలి ఏడాది వినాయకుడి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా నగరం మొత్తం తిరుగుతూ, వినాయక నవరాత్రులను అందరూ ఘనంగా నిర్వహించా లని కరపత్రాలు పంచాడు శంకరయ్య. అప్పటి నుండి ఏటా వినాయకుడి ఎత్తు పెంచుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1979లో 20 అడుగుల వినాయకుడిని తయారు చేసి ఇక్కడ ప్రతిష్టించారు. 1981లో 25 అడుగుల నాట్య వినాయకుడు, 1982లో మూషిక వాహన వినాయకుడి ద్వారా ఖైరతాబాద్ గణపతికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. 1987 నుంచి వినాయకుడి ఎత్తును క్రమంగా పెంచుతూ వెళ్లారు. 2015లో 60 అడుగుల భారీ గణపతికి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

సింగరి శంకరయ్య మరణానంతరం అతడి సోదరుడు సింగరి సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పట్లో హైదరాబాద్‌లో కేవలం పాతబస్తీ, రాంకోట్, ధూల్‌పేట, ఖైరతాబాద్‌లలో మాత్రమే ఈ ఉత్సవాలు జరిగేవి. 1985 వరకు ఖైరతాబాద్ భారీ గణపతిని నెలరోజులపాటు పూజించి విజయదశమి(దసరా) రోజున నిమజ్జనం చేసేవారు. అప్పట్లో ఈ వినాయకుడి వద్ద నెలరోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా జరిగేవి.

నిమజ్జనం ముందు రోజున జరిగే శివతాండవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు. 1954లో వినాయకుడిని ఓ చిన్న పాడుబడ్డ దేవాలయం ఎదురుగా (ప్రస్తుత గ్రంథాలయంలో) ప్రతిష్టించారు. ఆ దేవాలయంలో అసలు రూపం ఎవరికీ తెలియకున్నా గణపతిదేవాలయంగా భావించి సింగరి శంకరయ్య అక్కడ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే భవనాన్ని నిర్మించాలని సంకల్పించాడు. అజంతా శిల్పాల్లోని 19 వ గుహ ఆకారంలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించాడు. నిర్మాణంలో ఉన్న సమయంలో ఈ భవనం కింది అంతస్తులో 10 అడుగుల వినాయకుడిని పెట్టేందుకు అనువుగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. రానురాను భక్తుల ఆదరణ పెరగడం, ప్రజల డిమాండ్ మేరకు ఎత్తును పెంచాల్సి రావడంతో ఈ గ్రంథాలయ ఆవరణలో వినాయకుడిని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది.

Comments

comments