Home ఖమ్మం కెసిఆర్ ఆశీర్వాదంతోనే ఎంపిగా ఎన్నికయ్యా … నామా

కెసిఆర్ ఆశీర్వాదంతోనే ఎంపిగా ఎన్నికయ్యా … నామా

MP Namaఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీర్వాదంతో  తాను ఎంపిగా గెలుపొందినట్టు నామా నాగేశ్వరరావు తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఎన్నెస్టీ రోడ్డులో గల తెలంగాణ భవన్‌లో  ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల కృషితోనే ఎంపిగా విజయం సాధించానని, ప్రజల సహకారాన్ని ఎప్పటికీ మరువనన్నారు. ప్రజలు తనపై ఎంతో విశ్వాసంతోనే ఓటు వేసి గెలిపించారని, వారికి తాను నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తానని ఆయన పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఐదు సంవత్సరాల అనుభవంతో మరో ఐదు సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాడి జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో పాటుపడతానన్నారు. పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటు వేసే భాగ్యం తెలంగాణ ప్రాంత వాసిగా తనకు అవకాశం లభించటం అదృష్టంగా భావించానన్నారు. ఖమ్మం అవిభాజ్య జిల్లాకు ప్రధానంగా నీటి వనరైన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటంలో తాను కూడా పాటు పడతానన్నారు. ఎంపిగా గత అనుభవాన్ని రంగరించి మరో ఐదు సంవత్సరాల పాటు జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఏ బాధ్యత అప్పగించినా తాను సిద్ధమేనని, పార్టీతో పాటు తమ అధినేత కెసిఆర్,  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల మాటే శిరోధార్యంగా భావించి పార్లమెంట్ సభ్యునిగా తాను పనిచేస్తానని చెప్పారు. పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్ష నేతగా బాధ్యతలు ఇస్తే చేపట్టడానికి తాను  సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు గాయత్రి రవి, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్ధినేని బేబీ స్వర్ణకుమారి, ఖమ్మం ఎఎంసి మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నేతలు బొమ్మెర రాంమూర్తి, కమర్తపు మురళి, బిచ్చాల తిరుమలరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Khammam MP Nama Nageswara Rao Press Meet