Home వికారాబాద్ భారంగా ఖరీఫ్

భారంగా ఖరీఫ్

Khariff Cultivation Works In Vikarabad District

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సాగునీటి ప్రాజెక్టులు పెద్దగా లేని వికారాబాద్ జిల్లాలో ఈసారి ఖరీఫ్ భారంగా సాగుతోంది. సీజన్ మొదలై నెల రోజులు గడిచినా ఆశించినంత వర్షాలు కురియలేదు. ఒకవైపు ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సహాయం అందించడంతో రెట్టింపు ఉత్సాహంతో పంటలు వేసుకుంటున్నా వరుణుడు నిరాశకు గురి చేస్తున్నాడు. జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 121 మిల్లీమీటర్లు ఉండగా కేవలం 100 మిల్లీమీటర్లే నమోదైంది. ఒకటి, రెండు మండలాల్లో ఫర్వాలేదనిపించినా మిగిలిన 16 మండలాల్లో మైనస్ వర్షపాతం నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్‌లో కంది, పత్తి, మినుము, పెసర, మొక్కజొన్న, వరి పంటలు అధికంగా పండిస్తుంటారు. ప్రస్తుతం మొలకలు పెరుగుతున్న సమయంలో మొదళ్లకు నీరు అందడం లేదు. పలుచోట్ల పంటలు ఎండుముఖం పట్టాయి. కొన్ని మండలాల్లో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో కంది, పత్తి పంటలకు ప్రసిద్ధిగాంచింది.

వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి సెగ్మెంట్లలో 1.75 లక్షల హెక్టార్లలో సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా ఇంకా 30 శాతం మంది రైతులు విత్తనాలు వేసుకోలేదు. ఇప్పటి వరకు 1.30 లక్షల హెక్టార్లలో వేసుకున్నారు. ప్రస్తుతం కంది సాగు 50 వేల హెక్టార్లలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దానికి దీటుగా పత్తి పంట కూడా సాగు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం పత్తి వద్దని సూచించినా నిరుడు, ఈసారి జిలాలో 40 వేల హెక్టార్ల పైచిలుకు పండిస్తున్నారు. ఈసారి కూడా 40 వేల హెక్టార్లకు మించి వేసుకున్నట్లు చెబుతున్నారు. మిగిలిన వాటిలో 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 25 వేల హెక్టార్లలో వరి, 20 వేల హెక్టార్లలో పెసర, మినుము పంటలు వేసుకున్నారు. కేవలం 90 రోజులకే చేతికి వచ్చే పెసర, మినుము పంటలకు అనుకూల వర్షాలు లేకపోవడం పట్ల రైతులు దిగాలు చెందుతున్నారు. జూన్, జూలైలో అనుకూల వర్షాలు ఉంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఈ రెండు పంటలకు తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలో అధికంగా పండిస్తుంటారు. ఆరు నెలలకు చేతికి వచ్చే కంది పంటపై రైతులు ఎక్కువగా శ్రధ్ధ వహిస్తారు. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడులు సాధించే కంది పంటకు మార్కెట్లో ఈసారి అనుకూల ధరలు లభించవచ్చని భావిస్తున్నారు. గతేడాది క్వింటాలు మద్ధతు ధర రూ.5450 నిర్ణయించినా మార్కెట్ యార్డుల్లో 4500 రూపాయలకే పరిమితం చేశారు. దాంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు భారీగా సరకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడులు సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. కంది రైతులకు మేలు చేకూరాలంటే జిల్లాలో కంది బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా నెరవేరలేకపోయింది. అక్టోబరు మాసం నుంచి చేతికి వచ్చే పత్తి పంటకూ ప్రారంభంలో కురిసే వర్షాలే అనుకూలం. సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు రెండవ వారం వరకు సాధారణ వర్షాలు పడితేనే దిగుబడులు భారీగా సాధిస్తారు. అతివృష్టి ఉంటే పత్తి పింజాలను నష్టం వాటిల్లుతుందని అంటున్నారు.

రెండు రోజుల క్రితం కురిసిన తేలికపాటి వర్షం కాస్త ఊరటనిచ్చింది. జూలై మాసంలో కనీసం 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే పంటలకు ఢోకా ఉండదని అంటున్నారు. తాండూరు డివిజన్‌లో పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో పంటలు ఫర్వాలేదనిపిస్తున్నా సకాలంలో వర్షాలు పడకుంటే ఆశలు వదులకోవాల్సిందే. నవాబ్‌పేట, పూడూరు, మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో ఎర్ర, నల్లరేగడి భూములు వేసుకున్న పత్తి పంటలకు అనుకూలంగా వర్షాలు కురియాల్సి ఉంది. ఈ ప్రాంతంలో చెరుకు పంట కూడా ఎక్కువగానే పండిస్తుంటారు. అక్టోబరు నుంచి డిసెంబరు మాసం వరకు చెరుకు కోత నిర్వహిస్తారు. ఒకసారి పంట వేసుకుంటే రెండేళ్ల పాటు దిగబడులు సాధిస్తుంటారు. బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట, పెద్దేముల్ మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో చెరుకు పంట పండిస్తుంటారు. ఈ పంటకు ఎప్పుడూ గిట్టుబాటు ధరలు లభించకపోవడం గమనార్హం. చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలు అనుసరించే విధానాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారాయి.
రైతుబంధు అమలుతో ఉత్సాహంగా..
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేయడంతో ఈసారి రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో ఖరీఫ్‌లో సాగు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో కాస్త నిరాశ చెందారు. రైతుబంధు కింద జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2.24 లక్షల మంది రైతులు లబ్దిపొందారు. వారికి రూ.244 కోట్లను అందించారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు చేయూతనిచ్చినా వర్షాల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.