Search
Friday 16 November 2018
  • :
  • :

ఆకుల్లో రారాజు తమలపాకు

betel

తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. అది లేందే ఏ శుభకార్యాలూ జరుగవు. పెళ్లి పేరంటాలు, నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్లు, వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు. ఆధ్యాత్మికంగా ఇలా వున్నా నిత్య జీవితంలో వీటిని వాడేవారు చాలామంది ఉన్నారు. పాన్, కిళ్లీ రోజూ వేసుకునే అలవాటున్నవారుంటారు. భోజనాలు అయినాక తమలపాకు, వక్క వేసుకోవడం కొంత మందికి నిత్య అలవాటుగా ఉంటుంది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ ,సి విటమిన్‌లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్- అంటే పీచు పదార్థ్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి. తమలపాకును గోరువెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయాల మీద అప్లై చేసి తక్షణం మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే బాలింతరాలికి రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. లేత తమలపాకులు ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు పరిశోధకులు. రోజూ ఒక తమలపాకును, పది గ్రాముల మిరియం గింజలను కలిపి తింటే ఊబకాయం తగ్గి నాజూగ్గా తయారవుతారు. తమలపాకును భోజనం తర్వాత తీసుకుంటే నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. శరీరంపై ఎక్కడైనా వాపు, రక్తం గడ్డకట్టడం లాంటివి జరిగితే తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

రసంలో బెర్రీ , తేనె మిక్స్ చేసి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. దీనిని మితంగా తీసుకున్నంత వరకూ ఎలాంటి సమస్యలు రావనీ, రోజుకు పది లేదా అంతకుమించి తీసుకునేవారిలో ఆరోగ్యసమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తొడిమతో సహా వేసుకునే వారిలో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని ఇటీవలి నిపుణులు చెపుతున్నారు. అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యథేచ్ఛగా వాడకూడదు-. తాంబూలంలో సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. తమలపాకు పొగాకుతో కలిపి నమిలితే నోటిక్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదైనాగానీ తమలపాకుని రోజుకి మితంగా అంటే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి కానీ ఐదారుసార్లు ఇది నమిలితే అది ఒక భయంకరమైన అలవాటైపోతుందనీ, తరువాత ఆ అలవాటు మార్చుకోవాలంటే చాలా కష్టమని నిపుణులు వక్కాణిస్తున్నారు.

Comments

comments