Search
Sunday 23 September 2018
  • :
  • :

ఖతర్నాక్ ‘కింగ్స్’

  • 10 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు
  • మ్యాక్స్‌వెల్ సేన చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
  • చితక్కొట్టిన గప్తిల్.. పేసర్ సందీప్‌కు 4 వికెట్లు

KXIP

పంజాబ్ బౌలర్ల ధాటికి ఢిల్లీ మరోమారు 67 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. పేసర్ సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ లైనప్‌తో రాణించడంతో ఢిల్లీ తట్టుకోలేక విలవిల్లాడింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శనతో ఢిల్లీ ఐపిఎల్ చరిత్రలో 10 వికెట్ల విజయాన్ని పంజాబ్‌కు అందించింది. ఓపెనర్లు గప్తిల్, ఆమ్లా చితక్కొట్టడంతో పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లోనూ ఢిల్లీ వరుస పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఢిల్లీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగుకు పడిపోగా, పంజాబ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

మొహాలీ : అత్యుత్తుమ ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అదరగొట్టేసింది. పంజాబ్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్) 50 పరుగులు, ఆమ్లా (20 బంతుల్లో 1 ఫోర్) 16 పరుగులతో విజృంభించగా కింగ్స్ ఎలెవన్ జట్టు 10 వికెట్ల తేడాతో ఢిల్లీడేర్‌డెవిల్స్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఆటగాళ్లు ఆడూతూ పాడుతూ మంచి శుభారంభాన్ని అందించారు. ఆదిలోనే దూకుడును పెంచేసిన వీరద్దరూ ఢిల్లీ బౌలర్ల విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ చితక్కొట్టేశారు. దీంతో పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి విజయం సాధించింది. 20 పరుగులు ఇచ్చిన పంజాబ్ పేసర్ సందీప్ శర్మ అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీయడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ స్వల్పస్కోరుకే చాప చుట్టేసింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పంజాబ్ జట్టుకు 2 పాయింట్లు దక్కగా, నాలుగు వికెట్లు తీసి ఢిల్లీని మట్టికరిపించిన సందీప్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచిన ఢిల్లీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే ఆలౌటై పంజాబ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
ఢిల్లీ చెత్త ప్రదర్శన..
వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీడేర్ డెవిల్స్ జట్టు మరోసారి చెత్త ప్రదర్శనతో పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. జట్టుకు కొండంత అండైన కెప్టెన్ జహీర్‌ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో కరుణ్ నాయర్ సారథి బాధ్యతలు చేపట్టాడు. కరుణ్ నాయకత్వంలో జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో ఏ ఒక్కరూ కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. దీంతో ఢిల్లీ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమై చేతులేత్తేసింది. జహీర్ లేని లోటుతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఢిల్లీ కరుణ్ కెప్టెన్సీలో ఆశించిన స్థాయిలో రాణించలేక ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుని ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వాని ంచగా, ఓపెనర్లుగా శాంసన్, బిల్లింగ్స్ బరిలోకి దిగారు. ఆదిలోనే శాంసన్ (5) పరుగులకే చేతులేత్తేయగా, బిల్లింగ్స్ కనీసం ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. వీరిద్దరికి పంజాబ్ బౌలర్ అద్భుతంగా రాణించి ఓపెనర్లను పెవిలియన్‌కు పంపేశాడు. అనంతరం వచ్చిన తాత్కాలిక కెప్టెన్ కరుణ్ నాయర్ (11) అక్సర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్‌ను కూడా (6) పరుగులకే సందీప్ శర్మ వెనక్కి పంపేశాడు. రిషబ్ పంత్ (3), అండర్సన్ (18), రబడా (11) పరుగులకే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేక ఒకరితరువాత మరొకరు వెనువెంటనే వికెట్లను చేజార్చుకున్న ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శనతో 17.1 ఓవర్ల వద్ద 67 పరుగులకే ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోగా, అక్సర్ పటేల్, ఆరోన్ రెండు వికెట్లు, మోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు.
స్కోరుబోర్డు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: శాంసన్ (సి) మోహిత్ శర్మ (బి) సందీప్ శర్మ; 5, బిల్లింగ్స్ (సి) సాహా (బి) సందీప్ శర్మ; 0, కరుణ్ నాయర్ (బి) అక్సర్ పటేల్; 11, శ్రేయాస్ అయ్యర్ (సి)&(బి) సందీప్ శర్మ; 6, రిషబ్ పంత్ ఎల్‌బిడబ్లు (బి) మ్యాక్స్‌వెల్; 3, అండర్సన్ (బి) ఆరోన్; 18, మోరీస్ (సి)&(బి) పటేల్ ; 2, రబడా (సి) మార్ష్ (బి) సందీప్; 11, అమిత్ మిశ్రా నాటౌట్; 4, మహమ్మద్ షమీ (సి) సందీప్ (బి) ఆరోన్; 2, నదీమ్ (సి)&(బి) మోహిత్ శర్మ; 0. ఎక్స్‌ట్రాలు: 5. మొత్తం: (17.1 ఓవర్లలో ఆలౌట్) 67 పరుగులు. వికెట్ల పతనం: 1-1, 2-7, 3-22, 4-25, 5-30, 6-33, 7-59, 8-62, 9-67, 10-67. పంజాబ్ బౌలర్లు: సందీప్ శర్మ 4-0-20-4, టి నటరాజన్ 2-0-7-0, మోహిత్ శర్మ 1.1-0-3-1, అక్సర్ పటేల్ 4-0-22-2, మ్యాక్స్‌వెల్ 4-0-12-1, వరుణ్ ఆరోన్ 2-0-3-2.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గుప్తిల్ నాటౌట్; 50, హాసీమ్ ఆమ్లా నాటౌట్; 16. ఎక్స్‌ట్రాలు: 2. మొత్తం: (7.5 ఓవర్లలో 0 వికెట్లు) 68 పరుగులు. ఢిల్లీ బౌలర్లు: మొహమ్మద్ షమి 2-0-19-0, రబడా 2-0-18-0, మోరీస్ 2-0-13-0, అమిత్ మిశ్రా 1-0-9-0, నదీమ్ 0.5-0-9-0.

Comments

comments