Home దునియా వంటల రారాణి కిరణ్‌వర్మ

వంటల రారాణి కిరణ్‌వర్మ

ఆమె వంట చేస్తే అదిరిపోవాల్సిందే! దేశం కాని దేశంలో భారతీయరుచులు చూపిస్తూ మనవాళ్ళందరికీ కరువు తీరేలా, కడుపు నింపేలా ఆతిథ్యం ఇస్తోంది కిరణ్‌వర్మ. అమెరికా దేశానికి ఆమె కొత్త కాదు. చెప్పాలంటే అమెరికా వెళ్ళే మన భారతీయులకు కూడా ఆమె కొత్త కాదు. కిరణ్ వర్మ పేరు చెబితే మన వాళ్ళే కాదు, మన రుచులకు అలవాటు పడిన టెక్సాస్‌లోని ఆ చుట్టుపక్కల ఇతర దేశీయులు కూడా లొట్టలేయాల్సిందే. ఏమిటీ కిరణ్‌వర్మ ప్రత్యేకత అనుకుంటున్నారా? తెలుసుకుందాం…

Cook

కిరణ్ వర్మ నలభై సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్లింది. ఢిల్లీ నివాసి. వాళ్ల అమ్మ ఆమెను డాక్టరును చేయాలనుకుంది. నాన్న లాయర్ని చేయాలనుకున్నాడు. కానీ కిరణ్ మాత్రం తన మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంది. మంచి చెఫ్‌గా అవతరించింది. అమెరికా వెళ్లిన తర్వాత మొదట్లో అక్కడ ఆమెకీ ఆమె స్నేహితులకీ తినడానికి ఏమీ దొరికేది కాదు. అందుకే వాళ్ళంతా ఒక చోట చేరి వంటలు చేసుకుని మన రుచులు తినేవారు. అప్పటికే కిరణ్ వర్మ వంటల్లో సిద్ధహస్తురాలు. ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఆమె రెస్టారెంట్‌నే కొనేసింది. ఇప్పుడు హ్యూస్టన్‌లో ఆమెకు అనేక సంవత్సరాలుగా వినయవిధేయలతో పనిచేసే ఉద్యోగులు, ఆమె చేసే రుచులకోసం వెంపర్లాడిపోయే పర్మినెంట్ కస్టమర్లు తయారయ్యారు.

ఆమె రెస్టారెంట్ మూడుపువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.18 ఏళ్ల వయసులో ఢిల్లీ వదిలిపెట్టి భర్తతో కలిసి టెక్సాస్ వెళ్లిపోయింది ఆమె. అప్పటికి ఆమె భర్త ఇంజనీరింగ్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆమెకు బోర్‌గా ఉండేది. తర్వాత బ్యాంక్‌లో చేరి కస్టమర్ సర్వీస్ చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లను పెంచడంలో నిమగ్నమైపోయింది. 2005లో వాళ్లు కాలేజీలకు వెళ్లిపోయారు. దాంతో ఆమెకు మళ్లీ ఖాళీ సమయం చిక్కింది. ఈసారి ఏదైనా సృజనాత్మకంగా చేయాలని గట్టిపట్టుదల పట్టింది వర్మ. అప్పుడే ఫ్రెండ్స్ హోటల్‌లో రెండు రోజులు పనిచేయాల్సి వచ్చింది. వాళ్ల రిక్వెస్ట్‌మీద రెండు నెలలు ఆపని కొనసాగించడంతో వంటలపై ఆమెకు మరింత ఇష్టం ఏర్పడింది. అంతలోనే ఓ రెస్టారెంట్ అమ్మకానికి రావడంతో ఆమె ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసింది. మొదట ఒక గొప్ప స్టార్‌కుక్‌ను తెచ్చుకుని అతడి దగ్గర నేర్చుకుంది. ఇక ఆ తర్వాత విజృంభించింది వర్మ. కస్టమర్ ఈజ్ గాడ్ అనేదే నా ఏకైక మంత్రం అంటుంది ఆమె.

భారతీయుల ఆతిథ్యాన్ని చవిచూడాలంటే ఎవరైనా కిరణ్ వర్మ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిందే. ఎవరైనా కూడా అదే పనిచేస్తారు మరి. ఆమెతోపాటే ఇంకొందరు మహిళా చెఫ్‌లు కూడా పనిచేస్తారు. కానీ కిరణ్ మాత్రం ఉదయం 10.30గంటలకు రంగంలోకి దిగితే రాత్రి పొద్దుపోయే వరకు కిచెన్‌లో తన ప్రతాపం చూపిస్తుంది. ఆమె శ్రమ చేసేది కస్టమర్లకు సంతృప్తి కలిగించేందుకే. విజయం ఎప్పుడూ ఆమెను వెన్నంటే ఉంటుంది. అందుకే ఆవిడ అభినవ వంటల మాతగా పేరు తెచ్చుకుంది. నిఖార్సైన భారతీయ ఆహారం ఎక్కడ దొరుకుతుంది? భారతీయ సమతుల ఆహారం ఎక్కడ లభిస్తుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే అందరూ కిరణ్ వర్మ వైపే చూపిస్తారు. అదీ కిరణ్ వర్మ అంటే! చెప్పొచ్చేదేమిటంటే ఆమె మరో రెస్టారెంట్ కూడా ఓపెన్ చెయ్యాలనే ఆలోచనలో ఉందట. గుడ్‌లక్ చెప్పేద్దాం. హ్యూస్టన్ ప్రాంతంలో విజేతలైన మహిళల్లో, అమేజింగ్ ఉమెన్‌లో ఆమె కూడా ఒకరు.