Home తాజా వార్తలు టి20 ర్యాంకింగ్స్…రాహుల్‌ @5

టి20 ర్యాంకింగ్స్…రాహుల్‌ @5

 

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌లో రాహుల్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. కాఫీ విత్ కరణ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే బిసిసిఐ కాస్త కనికరం చూపడంతో రాహుల్‌తో పాటు హార్దిక్ పాండ్య కఠిన శిక్షల నుంచి తప్పించుకున్నారు. ఈ వివాదం నుంచి బయట పడిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే రాహుల్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. గతంతో పోల్చితే అతని ఆటలో నిలకడగా స్పష్టంగా కనిపించింది.

రానున్న ప్రపంచకప్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ ఇది దోహద పడుతుందనడంలో సందేహం లేదు. కాగా, తాజా టి20 ర్యాంకింగ్స్‌లో టాప్5లో చోటు సంపాదించడంతో రాహుల్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందనే చెప్పాలి. ఇదిలావుండగా బౌలింగ్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉండడంతో కుల్దీప్ ఓ ర్యాంక్‌ను కోల్పోక తప్పలేదు. ఇక, బ్యాటింగ్‌లో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ రెండో, ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.

 KL Rahul gets 5th rank in ICC T20 Rankings