Home తాజా వార్తలు ఐసిఐసిఐ బ్యాంక్ ‘మొండి’ దెబ్బ

ఐసిఐసిఐ బ్యాంక్ ‘మొండి’ దెబ్బ

chanda-kochar

 క్యూ4లో లాభం 50 శాతం క్షీణత

  నికర లాభం రూ.1,020 కోట్లు నమోదు 

నూఢిల్లీ: ఐసిఐసిఐ బ్యాంక్‌నూ మొండి బకాయిలు వదల్లేదు. మార్చి ముగింపు నాటి క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో బ్యాంక్ లాభం 49.62 శాతం క్షీణించి రూ.1,020 కోట్లు నమోదు చేసింది. మొండి బకాయిలకు కేటాయింపులను పెంచడం వల్ల బ్యాంక్ లాభాలు పడిపోయాయని సంస్థ పేర్కొంది. దీంతో బ్యాంకు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం రూ.2,025 కోట్లుగా ఉంది. కాగా బ్యాంక్ కేటాయింపులు రూ.2,898 కోట్ల నుంచి రూ.6,625 కోట్లకు అంటే 129 శాతం పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 1 శాతం పెరిగి 6,022 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.24 శాతం పెరిగింది. గత త్రైమాసికంలోని 7.82 శాతంతో పోలీస్తే ఈ త్రైమాసికంలో మొత్తం రుణాలు 8.84 శాతంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇది 7.89 శాతంగా నమోదైంది. కాగా గత నెలలో క్యూ4 ఫలితాల్లో ప్రైవేటురంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ కూడా మొండి బకాయిల కారణంగా నిరాశపర్చింది. బ్యాంక్ తొలిసారిగా రూ.2,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.1,225 కోట్లుగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లిస్ట్ అయిన యాక్సిస్ బ్యాంక్ నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి.. మొండి బకాయిలు పేరుకుపోవడం, వాటికి కేటాయింపులు చేయడం కారణంగా బ్యాంక్‌కు నష్టాలు తప్పలేదు. శిఖా శర్మ నేతృత్వంలోని బ్యాంక్ ఈసారి కేటాయింపులను మూడు రెట్లు పెంచారు. గతేడాదిలో రూ.2,581 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.7,180 కోట్లు కేటాయింపులు చేశారు.
రూ.1.50 డివిడెండ్
బ్యాంక్ ప్రకటించిన ఫలితాల్లో బ్యాంకు వాటాదారులకు 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు 1.50 రూపాయలు చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు ప్రతిపాదించినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ రూ.2.50 డివిడెండ్‌ను ప్రకటించింది.
4 శాతం పెరిగిన షేరు విలువ
స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ క్యూ4 ఫలితాలను వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో బ్యాంక్ షేరు విలువ 4 శాతం పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేరు విలువ రూ.10 లాభపడి రూ.293 వద్ద స్థిరపడింది.
వీడియోకాన్ వివాదంపై కొచ్చర్
వీడియోకాన్ రుణ వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచ్చర్ స్పందించలేదు. అయితే క్యూ4 ఫలితాల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె వివాదంపై స్పందించారు. ఈ వివాదంలో బోర్డు తన వైఖరిని వెల్లడించిందని, దర్యాప్తులో విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని ఆమె వెల్లడించారు. అంతకుమించి కొచ్చర్ ఇంకా వేరే ఏమీ మాట్లాడలేదు. కాగా 2012లో క్విడ్ ప్రొకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌కు ఐసిఐసిఐ బ్యాంకు రూ.3250 కోట్ల రుణం మంజూరు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో బ్యాంక్ సిఇఒ చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రుణ వ్యవహారంలో చందా కొచ్చర్ లబ్ధి పొందారని, ఆమె భర్త పరోక్ష లబ్ధిదారుడని ఇండియన్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ ట్రస్టీ అరవింద్ గుప్తా సాక్ష్యాలతో సహా ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఐటి శాఖ నూపవర్ రిన్యూవబుల్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసింది. సిబిఐ ఇప్పటికే ఈ కేసులో అనేక మందికి ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. వారిలో నూపర్ డైరెక్టర్ ఉమనాథ్ వెంకట్ నాయ క్, నూపవర్ మాజీ డైరెక్టర్ మహేష్ పుగాలియా, చందా కొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్‌లు ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ సిఎండి చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఆదాయం పన్ను శాఖ రెండో నోటీసులు పంపింది. వ్యక్తిగత ఆదాయం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలని నోటీసుల్లో కోరింది.