Search
Wednesday 21 November 2018
  • :
  • :

మండు వేసవిలో మహా భక్తజన కోటిని ఆకర్షించే కొండగట్టు అంజన్న

Kondagattu-Temple

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడా లేని విధంగా కొండగట్టులో స్వామి నరసింహస్వామి, ఆంజనేయస్వామి ముఖాలతో 500 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిశారని, ఇక్కడి అంజన్నను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని గాఢమైన నమ్మకం. స్వామి దర్శనానికి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన భక్తులతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అంజన్న క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ప్రతి మంగళ, శని, సోమ వారాల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా కొండపై భక్తులకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపడాల్సి ఉంది. ప్రతి యేటా కొండగట్టులో చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంత్సోవాలను ఘనంగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి ఉత్సవాలకు కొండగట్టు క్షేత్రం కాషాయమయం అవుతుంది. భక్తులు 11,21,41 రోజుల దీక్షలు తీసుకుని, జయంతోత్సవాల రోజున మాల విరమణ చేసుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్షా పరులు కాలినడకన కొండగట్టుకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
స్థల పురాణం : ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కొడిమ్యాల పరగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడని, ఉన్నట్లుండి మందలోని ఓ ఆవు తప్పిపోయిందని, దాని కోసం సంజీవుడు ఉత్తర దిశలో వెతికి వేసారి ఓ చింత చెట్టు నీడన పడుకున్నాడని. అతడికి స్వామి కలలో కనిపించి “నేనిక్కడి కొరంద చెట్ల పొదల్లో ఉన్నాను… నాకు ఎండ, వాన, ముండ్ల నుంచి రక్షణ కల్పించు… ఫలానా వైపు వెళ్తే నీ మంద నుంచి తప్పిపోయిన ఆవు కనిపిస్తుంది అని చెప్పాడని, నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన సంజీవుడు ఇది కలయా…? నిజమా…? అనుకుని స్వామి చెప్పిన మార్గంలో వెళ్లి ఆవు కోసం వెతకగా కొరంద పొదల్లో కోటి సూర్యుల కాంతులు విరజిమ్మే ఆ పవిత్ర పవనసుతుడు సంజీవుడికి కనిపించాడని దానితో సంజీవునిలో భక్తిభావం పొంగి పొర్లి, అతడి కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలి స్వామి పాదాలను తడిపాయని, అంతలోనే కొంత దూరం నుంచి ఆవు అంబా అంటూ తన వైపు రావడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, అప్పుడు అతడు చేతిలోని గొడ్డలితో కొరంద పొదను తొలగించి స్వామి వారికి తన శక్తి కొలది ఆలయం నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఆ తర్వాత కొడిమ్యాల వాస్తవ్యుడైన కీర్తిశేషులు కృష్ణారావు దేశ్‌ముఖ్ పదహారు స్తంభాలతో మూడు ఆలయాలు, మూడు గోపురములతో మంటప నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో స్వామికి రెండు ముఖాలు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం అనేకమైన కొండలు, గుట్టలు, దట్టమైన అరణ్యంలో వెలిసింది. చుట్టూ పెద్ద పెద్ద కొండలతో ఉండి ఆ కొండల మీద ఒక చిన్న గట్టు ఉండటం వల్ల ఈ క్షేత్రానికి కొండగట్టు అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మణుడు రావణుడితో యుద్దంలో మూర్ఛపోగా ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకుని వెళ్తుండగా అందులోంచి ఒక కొండ భాగం రాలి ఇక్కడ పడటం వల్లే అది కొండగట్టు అయిందని చెప్పుకుంటారు. సంజీవని పర్వతం నుంచి కొంత భాగం రాలి పడటం వల్ల శారీరక, మానసిక, గ్రహ బాధలు ఉన్న వారు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
కొండగట్టు క్షేత్రంలో ఒకే మండపంలో మూడు వేర్వేరు గర్భగుడులు ఉన్నాయి. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ఉండగా, కుడి పక్కన శ్రీ వేంకటేశ్వర స్వామి, ఎడమ పక్కన అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయానికి వెనుక వైపు భేతాళుడు క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. భేతాళుడికి దక్షిణ దిశలో శ్రీరామ పాదుకలు, వాటికి ఎదురుగా కూర్చుని సీతమ్మ తన కష్టాలను తలుచుకుంటూ ఏడ్వగా బండపై పడిన ఆమె కన్నీటి చుక్కలు గుర్తులు నేటికి ఉన్నాయని భావిస్తారు. దక్షిణం వైపు బొజ్జ పోతన్న, ఆలయానికి ఈశాన్య భాగాన పంచగుండాలు గల పెద్ద కోనేరు ఉంది. ప్రకృతి సిద్ధమైన పొడవైన బండరాతి పరుపుల మధ్యన వెలిసిన ఈ ధర్మ గుండంలో భక్తులు స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుంటారు. భక్తులు 1994కు ముందు అంతంతమాత్రంగానే వచ్చేవారు. 1994లో ఆలయ పునర్నిర్మాణం చేసి త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు చక్రప్రతిష్ట చేశారు. 1995లో అష్టోత్తర శతకుండాత్మక యాగం, 1996లో రాజగోపుర ప్రతిష్ట చేసిన తర్వాత ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని అర్చకులు, అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు కొత్త వాహనం కొనుగోలు చేసినా ముందు కొండగట్టుకు వెళ్లి అక్కడ వాహన పూజ చేయించుకుంటారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపు కడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, విజయం సిద్దిస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో స్వామి వారికి పోటీ పడి ముడుపులు కడతారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ముడుపు కట్టి కోరిన కోర్కెలు తీరిన తర్వాత ముడుపును విప్పి స్వామికి చెల్లించుకుంటారు. మానసిక రోగంతో బాధపడే వారు కొండగట్టుకు వచ్చి స్వామి సన్నిధిలో గడిపితే రోగం నయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి రోజు ఆలయం వద్ద పదుల సంఖ్యలో మానసిక రోగులు కనిపిస్తారు. ఈ యేడు చిన్న హన్మాన్ జయంతి రోజు సుమారు 3 లక్షల మంది హన్మాన్ దీక్షా పరులు మాల విరమణ చేయగా, పెద్ద హన్మాన్ జయంతి రోజు మరో 3 లక్షల మంది మాల విరమణ చేస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

– చీటి శ్రీనివాస రావు
9849360698

Comments

comments