Home రాష్ట్ర వార్తలు రైతు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

రాష్ట్ర ప్రభుత్వానికి కోదండరాం సూచన
అప్పులు, వాణిజ్య పంటల వల్లనే బలవన్మరణాలు, 30 నుంచి 40 మండలాల్లో సమస్య తీవ్రత,
బ్యాంకుల నుంచి అందుతున్న రుణం 40 శాతమే : ఆర్‌ఎస్‌వి, ఐ4 ఫార్మర్స్ అధ్యయనంలో వెల్లడి

main2హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణం కార్యాచరణ చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొన్నదని శనివారం తెలంగాణ జెఎసి ఛైర్మన్ ఎం.కోదండరాం చెప్పా రు. ఆత్మహత్యలు రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న ప్రాం తాలను గుర్తించి వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇందుకు తమ వంతుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. రైతు స్వరాజ్య వేదిక, ఐ 4 ఫార్మర్స్ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల కారణాలపై జరిపిన అధ్యయన ఫలితాలను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావే శంలో వెల్లడించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి, నవీన్, ఐ 4 ఫార్మర్స్ వ్యవస్థాపకులు రణబోతు శ్రీనివాస్ ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడు తూ, రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లోక్‌సభ స్థానాల పరిధిలోని 20 శాసనసభా నియోజకవర్గాలకు చెందిన 30 నుంచి 40 మండలాల్లో రైతు ఆత్మహత్యల సమస్య తీవ్రంగా ఉందన్నా రు. చనిపోయిన వారిలో బోర్‌వెల్స్, వాణిజ్య పంటలైన పత్తి-మొక్కజొన్న పంటలు వేయటం ద్వారా అప్పులపాలయిన వారు అధికంగా ఉన్నారన్నారు. ఈ పంటలకు అధిక పెట్టు బడి అవసరం కాగా సగటున బ్యాంకుల నుంచి 40 శాతం మాత్రమే రుణం అందుతున్నదన్నారు. బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడం, పంటలు ఎండిపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాయన్నారు. కరువు మండలాల ను ప్రకటిస్తే బ్యాంకు రుణాలకు రీషెడ్యూల్ , ఎండిన పంటలకు నష్టపరిహారం దొరుకుతుందన్నారు. ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకున్న మండలాల్లో ఒకటి నుండి రెండు మండలాలను ఎంపిక చేసుకొని తమ వంతుగా ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపడ్తామన్నారు.
స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలి
విస్సా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 1500 మందికి పైగా రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 300 మందిని పరిహారానికి ఆమో దిస్తూ మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించడంపై స్వతంత్రంగా న్యా యవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ప్రైవేటు అప్పులను ప్రభుత్వం తన ఖాతాలోకి బదిలీ చేసుకుంటే చాలా మట్టుకు ఆత్మహత్యలను నివారించడానికి వీలు కలుగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చెప్పడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదేదారి ఎంచు కోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు వే రు వేరు కారణాలున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 7 జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 142 మంది రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేశామని ఆ ఆత్మహత్యలన్నీ వ్యవసాయ సంబంధమైనవేనని నిజనిర్ధారణలో తేలిందని చెప్పారు.
80 శాతం కౌలు రైతులే..
నవీన్ మాట్లాడుతూ, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులున్నారన్నారు. వీరికి ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. పంట రుణం, రాయితీ విత్తనాలు అందుబాటులో లేవన్నారు. లైసెన్స్‌డ్ కల్టివేటెడ్ యాక్ట్ క్రింద రుణ అర్హత కార్డులను ఇస్తే ఆత్మహత్యలు తగ్గుతా యన్నారు. రవి కన్నెగంటి మాట్లాడుతూ, ఆత్మహత్యకు ముందు, ఆత్మహ త్య తర్వాత పరిస్థితులను సమగ్రంగా తెలుసుకునేందుకు వీలుగా రూ పొందించిన ప్రశ్నావళితో అధ్యయనం చేశామన్నారు. 1995 నుండి ఇప్ప టి వరకు రాష్ట్రంలో 26,000 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 3,000 మందిని మినహా మిగిలిన వారిని అధికార, ప్రతిపక్షాలు పట్టించు కోవడం లేదన్నారు. రణబోతు శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతుల ఆత్మ హత్యలను ఆపడంతో పాటు చనిపోయిన రైతు కుటుంబాలను అన్ని విధా ల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ సంస్థ తరపున ఆత్మహత్యలు చే సుకున్న రైతు కుటుంబాల్లోని పిల్లలకు చదువు చెప్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాల్లోని 5 గ్రామాలను దత్తత తీసుకుని సుస్థిర వ్యవసా యం కోసం వాణిజ్య పంటల నుండి రైతులను ఆహార పంటల వైపుకు మళ్లిస్తున్నామన్నారు. రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని తాము అండ గా ఉంటామన్నారు.