Home ఎడిటోరియల్ కోదండరాం వైఫల్యం ఎందుకు?

కోదండరాం వైఫల్యం ఎందుకు?

 

అసెంబ్లీ ఎన్నికలలో కోదండరాం ఎందు కు విఫలమైనట్లు? ఆయన అంతకు ముందు సామాజిక కార్యకర్తగా, మేధావిగా తగిన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. ఆమేరకు వాటిని ఆయన విజయాలు అనాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు రాజకీయ పరమైన ఆలోచనలు లేవని, సమాజం పక్షాన ‘వాచ్‌డాగ్’ వలె వ్యవహరించగలనని అన్నారు. ఒకవేళ అటువంటి పాత్ర నిర్వహణకు పూనుకొని ఉంటే ఏ విధంగా సఫలమై ఉండేవారో ఊహించి చెప్పలేము. ఎందుకంటే, ఒక పాత్రను ఎంచుకోగానే సరిపోదు. దానిని ఎంచుకున్నంత మాత్రాన ఆటోమేటిక్‌గా సఫలమవుతారని చెప్పలేము. ఆ పాత్ర విషయమై తన నిర్వచనం, అజెండాలు ఏమిటి? వాటిని ఏ విధంగా నిర్వహిస్తారు అనే దానిపైనే సాఫల్యాలు వైఫల్యాలు ఆధారపడి ఉంటాయి.
ఏది ఏమైనా ఆయన తను ప్రకటించిన పాత్రను కాకుండా అంతిమంగా ప్రత్యక్ష రాజకీయాలను ఎంచుకున్నారు. అందుకు ఇదమిత్థమైన కారణాలు ఏమిటో మనకు పూర్తిగా తెలియవు. సమాజాన్ని మార్చాలన్నా, పరిపాలన, అభివృద్ధి సవ్యంగా సాగాలన్నా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనటం, అధికార సాధన అవసరమని తన మిత్రులు సలహా ఇచ్చారని, అందువల్లనే అటువంటి నిర్ణయం తీసుకున్నానని ఒకటి రెండు సందర్భాలలో క్లుప్తంగా అన్నారు కోదండరాం. అదిగాక బయటకు వెల్లడించని కారణాలు ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. ఊహాగానాలు కొన్ని సాగుతున్నాయిగాని, ఆధారాలు లేకుండా వాటిలోకి వెళ్లటం వల్ల ఉపయోగం లేదు. దానినట్లుంచితే, తన మిత్రుల సలహా అంటూ టిజెఎస్ అధ్యక్షుడు చెప్పిన మాటలలో యథాతథంగా తగిన విలువ ఉంది. వాచ్‌డాగ్‌లు మార్పులను సూచించగలవు, వత్తిడులు సృష్టించగలవు తప్ప స్వయంగా మార్పులను తేలేవు. ఆ పని చేయగలది రాజకీయ శక్తులే.
ఆ విధంగా కోదండరాం ఆలోచించటం వరకు సరిగానే ఉన్నదిగాని, తన పొరపాట్లు ఆ తర్వాత నుంచి మొదలయ్యాయి. వాచ్‌డాగ్ పాత్రను గురించి తాను అన్నదానిపై పైన మనం చెప్పుకున్న మాటలు ఈ రాజకీయ పాత్రకు కూడా వర్తిస్తాయి. ఒక పాత్రను ఎంచుకున్నంత మాత్రాన ఆటోమేటిక్‌గా సఫలమవుతారని చెప్పలేము. దానిపై తన నిర్వచనం, అజెండాలు ఏమిటి? వాటి ఏ విధంగా నిర్వహిస్తారు అనే దానిపైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉంటాయి. అందుకు అదనంగా మరొకటి స్పష్టం చేయాలి. “ఏ విధంగా నిర్వహిస్తారు” అనే మాటలో, ఆ వ్యక్తి శక్తి సామర్థాలు ఏమిటి అనేది అంతర్లీనంగా ఉంటుంది.
పార్టీ ఏర్పాటులో కోదండరాం ఉద్దేశాలు మనకు ఇప్పటికీ పూర్తిగా తెలియవు గాని, అవి ఏమైనప్పటికీ ప్రాథమికంగా ఒక మాట చెప్పాలి. ఆయన పార్టీ గురించి మొదట అస్పష్టంగా, తర్వాత స్పష్టంగా మాట్లాడి చివరకు టిజెఎస్‌ను ప్రకటించిన దశలోగాని, అప్పటి నుంచి మొదలుకొని మహాకూటమి మీదుగా ఎన్నికల ఫలితాల వరకు గల దశలోగాని ఆయన ప్రయాణపు తీరును పరిశీలించిన మీదట ఒక విషయం బాగా స్పష్టమైపోయింది. రెండు ఇంగ్లీషు మాటలలో చెప్పాలంటే ఆయన “పొలిటికల్ ఎనిమల్‌” కారు. అదే విధంగా ‘హి ఈజ్ నాట్ కట్ ఫర్ దట్’. ఈ మాటల అర్థం తెలుగులో చెప్పాలంటే, తను ఒక రాజకీయ జీవి కాలేరు. రాజకీయాలు చేయలేరు. అందుకు తగిన లక్షణాలు లేవు.
ఉద్యమం ద్వారా ఏర్పడిన ఒక రాష్ట్రానికి వాచ్‌డాగ్ అన దగ్గది ఒకటి అవసరమని కోదండరాం భావిస్తే అందులో ఆక్షేపించవలసింది లేదు. కాని ఆయన ఆ మాట అనటానికి, పార్టీని ప్రకటించటానికి మధ్య కాలంలో ఆ పాత్ర గురించి నిర్వచించిందిగాని, అటువంటి పాత్రను నిర్వహించిందిగాని నికరమైన రీతిలో పెద్దగా కన్పించదు. అది నిర్వహిస్తానని కొద్దిసార్లు అన్నంత మాత్రాన దాని స్వరూప స్వభావాలు ఏమిటో, కార్యరూపం ఏమిటో ప్రజలకు తెలిసిపోదు. అవన్నీ స్పష్టంగా సామాన్యులకు తెలియాలి, ఆచరణలో వారికి తగినంత కాలం కన్పించాలి. అందువల్ల కలిగే ప్రయోజనమేమిటో అనుభవానికి రావాలి. అపుడుగాని వాచ్‌డాగ్ అయినది తన పాత్రను స్థిరపరచుకోజాలదు. అది జరిగిన తర్వాతగాని ఆ పాత్ర ధారికి రాజకీయ విలువ కూడా ఏర్పడదు. లక్షాల సాధన ప్రత్యక్ష రాజకీయాల ద్వారా మాత్రమే వీలు పడుతుందన్నది సూత్ర రీత్యా నిజమే. కాని ఆ విధంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించే ముందు, వాచ్‌డాగ్ పాత్రను సమర్థంగా నిర్వహించటం ద్వారా గుర్తింపును, సమర్థతను, అనుభవాన్ని సంపాదించుకోవాలి. అవి పార్టీ దశలో ఉపయోగపడతాయి. కాని టిజెఎస్ అధ్యక్షుడు ఇటువంటివి ఏవీ చేయలేదు. కారణాలు ఏవైతేనేమి లాంగ్‌జంప్‌కు నిర్ణయించుకున్నారు.
కోదండరాం రెండవ పెద్ద వైఫల్యం అసలు తన ప్రాపంచిక దృక్పథం, విధానాలు ఏమిటో తెలంగాణ సందర్భంలో వివరిస్తూ ఒక విధాన పత్రాన్ని (కాన్సెప్ట్ పేపర్) ప్రజల ముందుంచక పోవటం. ఆ పని ఆయన ‘వాచ్‌డాగ్’ అవతార కాలంలో చేయలేదు, పార్టీ ఏర్పాటు దరిమిలా కూడా చేయలేదు. ఆయన నుంచి నిర్మాణాత్మకంగా, పాజిటివ్‌గా ఇటువంటివేవీ ప్రజలకు తెలియరాలేదు గాని, ప్రభుత్వంపై, అధికార పక్షంపై, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌పై నిరంతర విమర్శలు మాత్రం వినవస్తూ పోయాయి. విమర్శలు ఆయన హక్కు. కాని పాజిటివ్‌గా చేయవలసినవి చేయటం అంత కన్న చాలా ముఖ్యం. ప్రజలకు కేవలం విమర్శలపట్ల కొద్ది కాలం తర్వాత విసుగు వేస్తుంది. చేయగల దేమిటో పాజిటివ్‌గా చెప్పాలని కోరుకుంటారు. తన మాటల తీరు, శైలి వల్ల ఆయనకు తెలంగాణ మంచి చెడులపట్ల ఏమి ఆలోచనలు ఉన్నాయో తెలియదుగాని, కెసిఆర్ పట్ల వ్యక్తిగత వ్యతిరేకత ప్రధానమైపోయిందనే అభిప్రాయం ఏర్పడుతూ పోయింది. ‘చేత కాకుంటే దిగండి, మేము చేసి చూపిస్తాం’, ‘దించేందుకే బయలు దేరాం’, ‘ఎట్లాగైనా గద్దె దించాలి’ వంటి మాటలు, శీర్షికలు కోదండ రాంకు కలిగించిన నష్టం అపారమైనది. అవి కలిగించిన అభిప్రాయాలను ఆయన సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు సరికదా, కంకణం ఏదో కట్టుకున్నట్లు దానిని మరింత బలపరుస్తూ పోయారు. ఆశ్చర్యకరం, గమనార్హమేమంటే, ఒక వైపు కెసిఆర్‌కు ప్రజాదరణ పెరుగుతూపోతున్న దశలో కోదండరాం ఈ పని చేశారు.
అటువంటి పరిస్థితులలో ప్రజలకు కోదండరాం నిజమైన ఉద్దేశాలు ఏమిటా అన్న సందేహాలు మొదలయ్యాయి. తనపట్ల గౌరవం, నమ్మకం రెండూ తగ్గసాగాయి. ఇటువంటి మార్పు ఆయన ఇంకా పార్టీ పెట్టక ముందే కన్పించింది. దానితో, ఇక ఆయన కాంగ్రెస్‌తో కలిసి పోతారంటూ అంతకు ముందు కొద్ది మందికి ఉండిన అనుమానాలు చాలా మందికి కలగసాగాయి. ఒకసారి ఆ మార్పు వచ్చిందంటే ఇక తన వాచ్‌డాగ్ మాటలనుగాని, పార్టీ ఆరంభించటంలో ఏవో సదుద్దేశాలు ఉన్నాయనిగాని నమ్మటం ప్రజలకు కష్టమవుతుంది. అదే జరిగింది కూడా. చివరకు కూటమితో, చంద్రబాబుతో చేతులు కలపటంతో కథ ఒక ముగింపుకు వచ్చింది. ఇటువంటి కథకు అది తార్కికమైన ముగింపు కూడా. కూటమిలో ఒకసారి చేరిన తర్వాత ఏమేమి జరుగుతూ వచ్చిందో అందరికీ ఒక జుగుప్సాకర విషాదాంత ప్రహసనంగా గుర్తుండే ఉన్నందున ఆ వివరాలు ఇక్కడ చెప్పుకోనక్కర లేదు. ఆ విధంగా కోదండరాం అపరిపక్వ, అస్పష్ట రాజకీయ ప్రయోగం ముగిసిపోయింది. అయితే ఇందుకు ఆయన తనను తాను తప్ప మరెవరినీ నిందించజాలరు.

టంకశాల అశోక్

Kodandaram failed in Telangana Politics