Search
Friday 21 September 2018
  • :
  • :

వరుస సిరీస్‌లపై కోహ్లి ఆగ్రహం

Kohili

నాగ్‌పూర్: ఏమాత్రం విరామం లేకుండా వరుసగా సిరీస్‌లు నిర్వహిస్తున్న భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. శుక్రవారం శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను బిసిసిఐ తీరుపై తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయాడు. తాము కూడా మానవ మాత్రులమేనని, తమకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా వరుసగా సిరీస్‌లు నిర్వహించుకుంటూ పోతే ఎలా అని బిసిసిఐని ప్రశ్నించాడు. ఇటీవల కాలంలో టీమిండియా కనీసం విరామం కూడా లేకుండానే ఆయా సిరీస్‌లలో పాల్గొంటుందన్నాడు. దీంతో ఆటగాళ్లందరూ ఎంతో అలసి పోయారన్నాడు. తమకు కొంత కాలం విశ్రాంతి కల్పించాలన్న ఆలోచన కూడా బోర్డు అధికారులకు రాక పోవడం చాలా బాధగా ఉందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ క్రమం తప్పకుండా సిరీస్‌లు ఆడుతుందని, దీంతో క్రికెటర్లు ఎంతో అలసి పోయారని తెలిపాడు. తమకు కొంత విశ్రాంతి కల్పించితే బాగుండేదని తెలిపాడు. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు కొంత విరామం లభించినట్టయితే తమకు ఎంతో ఊరట లభించేదన్నాడు. అంతేగాక సిరీస్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగే అవకాశం ఉండేదన్నాడు. కానీ, శ్రీలంక సిరీస్ ముగిసిన వెంటనే రెండు రోజుల వ్యవధి కూడా లేకుండానే జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరక తప్పదన్నాడు. ఇది తనతో పాటు సహచర ఆటగాళ్లను ఎంతో కలవరానికి గురి చేస్తుందన్నాడు. ఏ జట్టు కూడా తమలాగా విరామం లేకుండా క్రికెట్ ఆడడం లేదని కోహ్లి అన్నాడు. ఈ విషయంలో బిసిసిఐ అధికారులు అనుసరించిన వైఖరి తనను ఎంతో విస్మయానికి గురి చేసిందన్నాడు. ఏ జట్టుకైన దక్షిణాఫ్రికాతో సిరీస్ అంటే చాలా కఠినమని, అలాంటి సిరీస్ కోసం ఏ మాత్రం ప్ర ణాళిక లేకుండా బరిలోకి దిగడం మంచిది కాదన్నాడు. తమకు కనీసం ఒక నెల రోజుల విరామం అయినా కల్పించి ఉంటే బాగుండేదని కోహ్లి అన్నాడు. అయితే ఆ వెసులుబాటు తమకు అందుబాటులో లేకుండా పోయిందని కోహ్లి వాపోయాడు.
విజయం సాధిస్తాం…
కాగా, శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని కోహ్లి వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, ఈసారి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు సాగుతామన్నాడు. తొలి టెస్టులో గెలుపు వాకిట వరకు వచ్చి డ్రాతో సరిపెట్టుకోవడం చాలా బాధకు గురిచేసిందన్నాడు. కానీ, నాగ్‌పూర్ టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకున్నామని తెలిపాడు. కిందటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తమ బ్యాటింగ్ ఏమాత్రం బాగాలేదన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ తాను, ఓపెనర్లు తప్ప మిగతావారు విఫలం కావడం ఆందోళన కలిగించే అంశమేనన్నాడు. అయితే రెండో టెస్టులో ఇటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడుతామన్నాడు. తమ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో గాడిలో పడడం ఖాయమన్నాడు.

Comments

comments