Home ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి సిద్ధం

సమరానికి సిద్ధం

కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ,
ఓడితే ఇంటికే,

నేడు ఎలిమినేటర్ పోరు

hydబెంగళూరు: క్వాలిఫయర్-2కు డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాఱబాద్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ నాకౌట్ మ్యాచ్‌లో హైదరాబాద్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు తర్వాతి మ్యాచ్‌లో క్వాలిఫయర్-1లో ఓటమి పాలైన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. అద్భుత ఆటతో రైజర్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో జట్టును గాయాలు వేధిస్తున్నాయి. సీనియర్ బౌలర్ ఆశీష్ నెహ్రా ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఫిట్‌నెస్ పరీక్షలో గెలిస్తేనే అతనికి తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది.

వార్నర్‌పైనే ఆశలు..

ఇక, రైజర్స్ ఆశలన్నీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైనే నిలిచాయి. అద్భుత ఫాంతో లీగ్ దశలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన వార్నర్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ ఇన్నంగ్స్‌పై కన్నేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ చెలరేగితే అడ్డుకోవడం కోల్‌కతాకు అంత సులువుకాదు. నిలకడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే డేవిడ్ పూర్తి సామర్థంతో ఆడితే అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. మరో ఓపెనర్ శిఖర ధావన్ కూడా దూకుడు మీదున్నాడు. నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ఇందులో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, కొత్త ఆటగాడు విజయ్ శంకర్ కూడా జోరుమీదున్నాడు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. నిలకడగా ఆడి భారీ ఇన్నింగ్స్ ఆడితే హైదరాబాద్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. అయితే యువరాజ్ ఫిట్‌నెస్ సాధించక పోవడం జట్టును కలవర పెడుతోంది. ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న యువీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతను బరిలోకి దిగతాడా లేదా అన్నది ఇంకా తేలలేదు. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మన్ కానె విలియమ్‌సన్‌కు ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో విలియమ్‌సన్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అప్ఘాన్ బౌలర్ మహ్మద్ నబి లేదా హెన్రిక్స్ స్థానంలో విలియమ్‌సన్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. వికెట్ కీపర్ నమాన్ ఓజా కూడా బ్యాట్‌ను ఝులిపించే సత్తా కలవాడే. దీంతో హైదరాబాద్‌కు బ్యాటింగ్‌లో ఢోకా లేదు. అయితే నిలకడలేమి ఒక్కటే జట్టును బాధిస్తోంది. అంతేగాక, చివరి వరుస బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉండడం జట్టును కలవర పరిచే అంశం.

బౌలింగే బలం…
ఇక, బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లో సన్‌రైజర్స్ చాలా బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, మహ్మద్ నబి, బిపుల్ శర్మ తదితరులతో బౌలింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ ఇప్పటికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా అద్భుత బౌలింగ్‌ను కనబరుస్తున్నాడు. ఒకవైపు పరుగులు నిరోధిస్తూనే కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. కౌల్ కూడా నిలకడైన బౌలింగ్‌తో జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఒత్తిడిని సైతం తట్టుకుంటూ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేగాక, కీలక సమయాల్లో వికెట్లను పడగొడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నబి, హెన్రిక్స్‌లు కూడా సత్తా కలిగిన వారే. ఈ మ్యాచ్‌లో కూడా వార్నర్ బౌలర్లపై నమ్మకం పెట్టుకున్నాడు.

జోరు తగ్గింది..

మరో వైపు ప్రారంభంలో వరుస విజయాలతో ఎదురులేని జట్టుగా కనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తర్వాత పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. కెప్టెన్ గౌతం గంభీర్, రాబిన్ ఉతప్పలు ప్రారంభంలో అద్భుతంగా ఆడి జట్టుకు ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టారు. అయితే కొన్ని మ్యాచ్‌ల నుంచి వీరి జోరు తగ్గింది. ఓపెనర్ అవతారం ఎత్తిన సునిల్ నరైన్‌లో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. కెప్టెన్ గంభీర్‌లో కూడా నిలకడ కనిపించడం లేదు. మరో ఓపెనర్ క్రిస్ లిన్ మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అత నిపై ఆశలు పెట్టుకుంది. నరైన్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అతను చెలరేగితే హైదరాబాద్ బౌలర్లకు కష్టాలు తప్పవు. యూ సుఫ్ పఠాన్, మనీష్ పాండేలు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. సమష్టిగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయడం కోల్‌కతాకు కష్టం కాక పోవచ్చు. ఇక, బౌల్ట్, ఉమేశ్ యాదవ్, నరైన్‌లతో కూడిన పటిష్టమైన బౌలింగ్ లైనప్ జట్టుకు అందుబాటులో ఉంది. కాగా, రెండు జట్లలోనూ ప్రతిభా వంతులకు కొదవలేదు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.