Home కలం నడిచే విజ్ఞానం కొమర్రాజు

నడిచే విజ్ఞానం కొమర్రాజు

Kommarajuబహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు, నిగర్వి, నిస్వార్థు డు, దేశభక్తి మిన్నగా గలవాడు, సుప్ర సిద్ధ చరిత్ర పరిశోధకులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. వీరు కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని పెను గంచిప్రోలులో 1876 మే 18న జనన మొందారు. తల్లిదండ్రులు గంగ మాంబ, వెంకటప్పయ్య. వేంకట లక్ష్మణరావు గారి తండ్రి వారి నాల్గవ యేటనే పరమపదించారు. సవతి అన్నగారైన శంకర రావు వద్ద ఉంటూ భువన గిరిలో బాల్యాన్ని గడిపారు. వారి సోదరి అచ్చ మాంబను తన మేనమామ మాధవరావు వివాహం చేసుకు న్నారు. ఆయన మధ్య పరగణా లలో సబ్ డివిజనల్ అధికారిగా పని చేస్తున్నందున, వారితో పాటు లక్ష్మణ రావు కూడా మహారా ష్ట్రకు వెళ్లకతప్పలేదు. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా అక్కడే సాగింది. మోరిస్ కళాశాలలో 1900లో తత్తశాస్త్రం, సంస్కృ తం, ఐచ్ఛికాలుగా బి.ఎ. పట్టా స్వీకరించాడు. అనంతరం 1901 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రైవేటు పరీక్ష రాసి ఎం.ఎ పట్టా పొందారు. తెలుగు, పాళీ, సంస్కృతం, మరాఠి, బెంగాలీ, గుజరాతీ, హిందీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడాయన.
చిన్నతనంలోనే గురువుల ప్రోత్సాహంతో రచనలు చేసేవారు. అప్పుడే వృద్ధ వివాహాల్ని నిరసిస్తూ, రచనల్ని చేశారు. వీరి ప్రహసనాలు మహారాష్ట్ర పాఠకలోకానికి ప్రశంసాపా త్రాలైనాయి. కళాశాలలో చదివేనాటికి ‘భార్యా వియోగం’ అనే భావ గీతం రాశారు. రచయిత స్వానుభవమా అన్నట్లు పలువు రు భ్రాంతికిలోనైనారు. మరాఠా భాషలో వీరనేక భావ గీతాలు, ప్రహసనాలు, వ్యాసాలు రాయడమైంది. అక్కడి “సమాచార్‌”, “వివిధ జ్ఞానవిస్తార్‌” అనే పత్రికా సంపాదక బాధ్యతల్ని సైతం వీరు నిర్వహించారు.
కొమర్రాజు వారు మరాఠా భాషలో రచనా వ్యాసంగం చేసినా, తెలుగు భాషను అధ్యయనంలోనూ, రచనా వ్యాసంగం లోనూ మరువలేదు. “విశ్వము యొక బాల్య స్వరూపము” “విశ్వము యొక్క విరాట్ స్వరూపము” వంటి విజ్ఞాన దాయక వ్యాసాలు “జనానా” “శారద” వంటి పత్రికల ద్వారా ప్రకటింప చేశారు. వారి సోదరి అచ్చమాంబ కూడా చక్కని రచయిత్రి. ఆమెచే “అబలా సచ్చరిత్ర రత్నమాల” అనే గ్రంథాన్ని రాయింప చేశారు.
1905 సెప్టెంబర్ మాసంలో మద్రాస్ బీచ్‌లో అయ్యదేవర కాళేశ్వర రావు, గాడి చెర్ల హరి సర్వోత్తమ రావు గార్ల సాంగత్యం లో పాల్గొని తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి ఒక నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టాలని తీర్మానించుకొన్నారు.
1880లో లక్ష్మణరావు గారి తండ్రి మునగాల సంస్థానంలో దివానుగా ఉంటూ చనిపోయాడు. అనంతరం విద్యావేత్తయైన లక్ష్మణరావు ఆ పదవిని స్వీకరించి బహు నేర్పుతో నిర్వహిం చారు. ఆ చొరవతోడనే మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావుల సాయంతో 1901లో హైదరాబాద్ నగరం నందు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని, 1904లో వరంగల్లులో శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయాన్ని స్థాపింపజేశారు. వారి భాషా, సాహిత్య సేవలు గొప్పవి. 1905లో తెలుగు వాళ్లలో ఆధునిక విజ్ఞానం, దేశ చరిత్ర, స్వాతంత్య్రాభిలాష పెంపొందించాలనే తపనతో “విజ్ఞాన చంద్రికా మండలి”ని స్థాపన గావించారు. అది కొన్ని రోజులు హైదరాబాద్‌లో నిర్వహించిన అనంతరం మద్రాసుకు తరలింపవలసి వచ్చింది. ఇందులో చిలుకూరి వీరభద్రరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కట్టమంచి రామలింగారెడ్డి, ఆచంట లక్ష్మీపతి, గురజాడ అప్పారావు, అయ్యదేవర కాళేశ్వర రావు, గోటేటి జోగిరాజు పంతులువంటి ఉద్దండులు తమ రచనల్ని ప్రకటించుకున్నారు. అట్లా దేశ చరిత్రలు, మహాత్ముల జీవిత చరిత్రలు అనేక శాస్త్రాంశాలు వెలువడుటకు విజ్ఞాన చంద్రికా మండలి తోడ్పాటునందించింది. ఆ స్ఫూర్తితో అనంతర కాలంలో గ్రంథ మాలల స్థాపనలెన్నో జరిగాయి. “విజ్ఞాన చంద్రికా పరిషత్తు”ను స్థాపించి, అనేక మందికి పరీక్షలు నిర్వహించి ప్రోత్సహపరిచారు.
కొమర్రాజు వారు శాసన పరిశోధకులు కూడా. శివ స్కందవర్మ కంతేరు శాసనము, చిత్తాపుఖాను శాసనము, చాళు క్య భీముని అత్తిలి తామ్ర శాసనము వంటి అనేక శాసనా ల్ని వీరు సాధికారికంగా ప్రకటిం చారు. పాశ్చాత్య చరిత్రకా రులు రాసిన పక్షపాత రచనలకు సమాధానంగా చారిత్రకా ధారాలతో “హిందూ మహాయుగం” “మహ్మదీయ మహా యుగం”, “శివాజీ చరిత్ర”, “మహారాష్ట్ర విజృంభణ”, “హైందవ చక్రవర్తులు”, “ఢిల్లీ దర్బారు” వంటి సాధికారిక రచనల్ని వెలువరించారు. అంతేకాదు బమ్మెర పోతన నివాస స్థలం ఏకశిలా నగరంగా, భద్రాచలంలోని ‘పంచవటి’ రామా యణంలోనిదేనని వీరు సప్రమాణంగా నిరూపించారు.
వివిధ విషయాల్ని అనేక వ్యాసాల రూపాల్లో సప్రమాణ సాధికారాలతో రాశారు. జనానా, ఆముద్రిత గ్రంథ చింతామణి, గ్రంథాలయ సర్వస్వము, స్వధర్మ ప్రకాశిక, శారద, కళ, సరస్వతి, అభినవభారతి, ఆంధ్రపత్రిక వార్షిక సంచిక, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక వంటి పత్రికలల్లో ఎన్నో వ్యాసాలు రాశారు. అవి వారి బహుముఖ సాహితీ వైభవాలకు నిదర్శనాలు. “లక్ష్మణ రాయ వ్యాసావళి” అనే పేరుతో అవన్నీ అనంతర కాలంలో గ్రంథ రూపాన్ని దాల్చాయి.
లక్ష్మణ రావు గారి మరో గొప్ప సాహసం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ రచనోద్యమం. అప్పటికి దక్షిణ భారతంలో విజ్ఞాన సరస్వాలు లేవు. ఆంగ్ల భాషలో ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’, వంగ దేశంలో “విశ్వకోశ్‌” లు ఉన్నాయి. ఆప్రేరణగా ఆయన 1912 లో తెలుగులో విజ్ఞాన సర్వస్వానికి ఉద్యుక్తులైనారు. 3 సంపుటాలే వెలువడ్డాయి. ‘అ’ నుండి ‘అహ్రి’ వరకు మాత్రమే 25 వ్యాసాలు వచ్చాయి. ఈ కృషిలో నిమగ్నుడై ఉండగానే అనుకోకుండా వారు 1923 జులై 13న కన్నుమూశారు.
ఆయన ఒక నడిచే విజ్ఞాన సర్వస్వం. సకల శాస్త్ర పాండిత్యం గలవాడు. బహుభాషా కోవిదుడు. ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో పాటు వేదవేదాంగాలు, చరిత్ర పరిశోధనలు చేసిన వారు. గొప్ప సంఘ సంస్కర్త. దేశభక్తి పరాయణులు. వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు.