Home దునియా కళల కాణాచి కోణార్క సూర్య దేవాలయం

కళల కాణాచి కోణార్క సూర్య దేవాలయం

 Konark Temple

 

క్రీ.శ. 1236–1264 మధ్య గంగా వంశానికి చెందిన నరసింహదేవ కోణార్క్ ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం వున్న ఆలయ నిర్మాణానికి 1200 మంది పనివారు పనిచేశారు, 12 సంవత్సరాల ఆదాయాన్ని ఈ నిర్మాణానికి వెచ్చించారు. అప్పుడు నిర్మింపబడ్డ ఆలయం గర్భగుడి విమానం ఎత్తు 229 అడుగులు వుండేది. అయితే అదిప్పుడు లేదు. శిథిలమయింది. ఈ శిథిలాలలోని కొన్ని విగ్రహాలను ఆర్కియలాజికల్ సర్వేవారు నిర్వహిస్తున్న మ్యూజియంలో భద్రపరచారు. అంత ఎత్తు ఆలయం శిథిలమయిన తర్వాత ప్రస్తుతం వున్న ఆలయంలోని శిల్పాలే అబ్బురపరచే కళాఖండాలై దేశదేశాలవారినీ ఆకర్షిస్తున్నాయంటే అసలు ఆలయం ఇంకెలా వుండేదో అనిపిస్తోందికదా.

ఈ ఆలయ నిర్మాణానికి ఎర్ర ఇసుకరాయిని వాడారు. ఆలయం 24 చక్రాలున్న రథాకారంలో వుంటుంది. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలతోబాటు అపురూపమైన నిర్మాణ శైలికూడా చూడవచ్చు. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డ ఈ ఆలయం తూర్పుముఖంగా వున్నది. అందుకనే బాలభానుడి తొలి కిరణాలు ఈ ఆలయ ప్రధాన ద్వారం మీద పడతాయి. ఆలయ ఆవరణలోకి తూర్పువైపు నుంచి ప్రవేశించగానే ఎదురుగా కనిపించేది నృత్యమందిరం. దీనికి రెండు వైపులా రెండు శిల్పాలు ఏనుగుమీద ఎక్కిన సింహం, ఆ ఏనుగు తొండంలో బంధింపబడ్డ మనిషి ఇవ్వన్నీ ఒకే శిలలో చెక్కబడ్డాయి. వీటిని గజసింహాలంటారు. ఈ మండపానికి పై కప్పు వుండదు. ఈ మండపం మీద అనేక నృత్య భంగిమలలో, వాయిద్యాలు వాయిస్తున్న స్త్రీ పురుషుల అద్భుత శిల్పాలు చెక్కబడ్డాయి. పూర్వం దైవ పూజా సమయంలో సూర్య భగవానునికి స్వాగతం పలుకుతూ ఇక్కడ నృత్యాలు జరిగేవి.

దీని వెనుకే సూర్య భగవానుని రథాకారంలో వున్న సూర్య మందిరం ఉంది. సప్తాశ్వాలు లాగుతున్న ఈ రథానికి 24 రాతి చక్రాలున్నాయి. మరి సూర్యుడు సప్తాశ్వ రథారూఢుడుకదా. ఒక్కొక్క చక్రం వ్యాసం 9 అడుగులు ఉంది. ప్రతి చక్రానికి 8 మందమైనవి, 8 పలచని రేకులు వున్నా యి. ఇవి రాత్రి, పగలుని సూచిస్తాయి. ఈ ఆలయ నిర్మాణమే కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. చక్రాలన్నిటిమీదా, జంతువులు, పక్షులు, మనుషుల శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. రథానికి కింద భాగంలో మిగతా శిల్పాలతోపాటు 1452 ఏనుగులుకూడా వివిధ భంగిమలలో చెక్కబడి వున్నాయి.

ఈ ఆలయం బయట గోడలకి మూడు వైపులా మూడు సూర్య భగవానుని విగ్రహాలు సూర్య గమనాన్ని సూచిస్తూ వుంటాయి. పొద్దున్న ఉదయించే సూర్యుడు మిత్ర ముఖం ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం ప్రచండ సూర్యుడు పుంసన్ ముఖం గంభీరంగా, సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడు హరితస్వ ఉదయంనుంచీ విధినిర్వహణలో విశ్రాంతి లేకుండా వుండటంవల్ల ఈయన ముఖంలో అలసట కనబడుతుంది. విగ్రహాలలో వైవిధ్యాన్ని ఎత్తు, వస్త్రాలు, ముఖ కవళికలు మొదలగు వివరాలన్నీ ఆ మూడు సమయాలను సూచిస్తూ అద్భుతంగా చెక్కబడ్డాయి. అందమైన శిల్పాలకు నెలవైన ఈ ఆలయం దర్శించేటప్పుడు గైడ్ సహాయం తప్పకుండా వుండాలి. లేకపోతే అంత దూరం వెళ్ళి అనేక సుందర శిల్పాలు చూడకుండానో, వాటి విశేషాలు గమనించకుండానో వస్తారు.

పి. యస్.యమ్. లక్ష్మి

 

Konark Temple Story in Telugu