Search
Sunday 23 September 2018
  • :
  • :

అయ్యో దేవుడా…!

Kondagattu Ghat road accident

అంజన్న దర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు….

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 57 మంది దుర్మరణం చెందారు.  మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.  మృతుల్లో  నలుగురు చిన్నారులు,  30 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నారు. జగిత్యాల డిపోకు చెందిన (ఎపి 28 జెడ్ 2319) ఆర్‌టిసి బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తుండగా ఘాట్ రోడ్డుపై అదుపు తప్పి సుమారు 12 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడగా 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో 33 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులోని మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు గుండెలను కలచివేశాయి.

సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ,మెరుగైన వైద్యానికి ఆదేశాలు

మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవాలి
– తెలుగులో ట్వీట్ చేసిన రాష్ట్రపతి కోవింద్

షాక్‌కు గురయ్యాను
– ప్రధాని మోడీ

బాధితులకు సత్వర వైద్యం
– గవర్నర్ నరసింహన్

ప్రమాదం విచారకరం
– రాహుల్ గాంధీ

కొండగట్టు ప్రమాదంపై విచారణ కమిటీ

కమిటీలో పోలీసు, రవాణా, ఆర్ అండ్ బి నిపుణులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలోనే ఎన్నడూ జరగనంతటి ఘోర బస్సు ప్రమాదం సంఘటనపై విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన రోడ్డు భద్రతా డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ప్రాథమిక దర్యాప్తు జరిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. దీనిపై లోతైన దర్యాప్తు జరిపి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా, దిద్దుబాటు చర్యలపైనా ఆలోచించిన వీరు ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో పోలీసు, రవాణా, రోడ్లు భవనాల శాఖలకు చెందిన అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కమిటీ కొండగట్టు బస్సు ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల నుంచి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి చాలా మంది సంతాపం తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తలా ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించగా ఆర్‌టిసి సంస్థ తలా మూడు లక్షల రూపాయల చొప్పున ప్రకటించింది.

Comments

comments