Home తాజా వార్తలు వల్లకాళ్లయిన ఊళ్లు

వల్లకాళ్లయిన ఊళ్లు

కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన 7 గ్రామాల్లోని 51 మంది, రోజంతా అంత్యక్రియలు 

Tears, Bus accident, Funeral

మన తెలంగాణ/ జగిత్యాల/ కొడిమ్యాల : కొండగట్టు దుర్ఘటనతో కొడిమ్యాల మండలంలోని ఐదు గ్రామాలు వల్లకాడులుగా మారా యి. బస్సు ప్రమాదంలో శనివారంపేట గ్రామానికి చెందిన 12 మంది మృత్యువాత పడగా, హిమ్మత్‌రావుపేటలో 11, డబ్బు తిమ్మయ్యపల్లిలో 11, రాంసాగర్‌లో 9 మంది, తిర్మలాపూర్‌లో ఐదుగురు, కోనాపూర్‌లో ఇద్దరు, సండ్రల్లపల్లిలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఏడు గ్రామాల్లో మొత్తం 51 మంది మృతి చెందగా 31 మంది గాయాల  పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొండగట్టు ప్రమాదంలో ఆయా గ్రామాల్లో నాలుగిళ్లకు ఒక బాధిత కుటుంబం ఉండటంతో పక్క ఇళ్లల్లో చనిపోయినా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించే పరిస్థితి లేకుండా పోయింది. కొండగట్టు ప్రమాద సంఘటన సోషల్ మీడియా ద్వారా ఖండాంతరాలకు వ్యాపించడంతో తమ వారిని కడసారి చూపు చూసుకునేందుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇంటి బాట పట్టారు. గల్ఫ్ దేశాల నుంచి తమ వారు రానున్నట్లు తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు దొరకకపోవడంతో ఐస్ గడ్డలు తెప్పించి వాటి మధ్యన శవాలను పెట్టి ఊకతో కప్పి వేశారు.

ఫ్రీజర్లు దొరకక ఊక కప్పుకునే దుస్థితి ఏర్పడిందని, శవాలను ఊకలో దాచిపెట్టుకునే పరిస్థితి ఎవరికి రావద్దంటూ సోషల్ మీడియాలో హాల్‌చల్ చేయడంతో అధికారులు స్పందించి కొన్ని ఫ్రీజర్లను గ్రామాలకు పంపించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో కళకళలాడాల్సి ఉండగా ప్రమాద సంఘటన నేపథ్యంలో ప్రతి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఒకరిద్దరి అంత్యక్రియలను మంగళవారం సాయంత్రమే పూర్తి చేయగా మిగతా వారి అంత్యక్రియలు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. తమ వారికి కడసారి వీడ్కోలు పలికేందుకు గ్రామస్థులు, బంధువులంతా శవాల వెంబడి స్మశాన వాటికల దాకా వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలతో గ్రామాలన్నీ దద్దరిల్లాయి. ఎవరిని ఓదార్చాలో తెలియకుండా ఒకదాని వెంట ఒకటి శవాలు స్మశాన వాటికలకు తరలిపోవడాన్ని ఆయా గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

తల్లిదండ్రుల మృతి… శోక సంద్రంలోకుమారులు

బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామానికి చెందిన గోలి రాయమల్లు భార్య అమ్మాయికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కోసం జగిత్యాలకు వెళ్లేందుకు వారిద్దరూ బస్కెక్కారు. బస్కెక్కిన అరగంట లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెం దారు. వారికి ఇద్దరు కుమారులు కాగా చిన్న కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. తల్లిదండ్రులు మృతి చెందినట్లు తెలియగానే కన్నీరుమున్నీరు గా విలపిస్తూ గ్రామానికి చేరుకున్నాడు. తల్లిదండ్రుల శవాలను ఒకే ట్రాక్టర్‌పై ఉంచి స్మశాన వాటికకు తరలించగా, వారి కుమారులు మధు, అనిల్‌లు నిప్పు పట్టుకుని అంతిమయాత్రలో నడవగా వారిని చూసి గ్రామస్థులంతా కంటతడి పెట్టుకున్నారు. ఈ దుస్థితి పగవారికి కూడా రావద్దంటూ బోరున విలపించారు.

కాన్పు కోసం వెళ్తూ ముగ్గురు మృత్యువాత…

కాన్పు కోసం జగిత్యాల ఆస్పత్రికి వెళ్తూ రెండు కుటుంబాల్లో ముగ్గురు దుర్మరణం పాలు కావడాన్ని రెండు గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడిమ్యాల మండలం శనివారం పేట గ్రామానికి చెందిన ఎండ్రికాయల సుమలత నిండు గర్భిణి. బుధవారం కాన్పు చేస్తామని వైద్యులు పేర్కొనడంతో ఒక్క రోజు ముందుగానే ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం గర్భిణి సుమలత, ఆమె అత్త ఎండ్రికాయల వెంకవ్వ, మండలంలోని కోనాపూర్‌కు చెందిన ఉత్తెం భూలక్ష్మిలు కలిసి జగిత్యాలకు బస్సులో ప్రయాణమయ్యారు. కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఆ ముగ్గురు దుర్మరణం పాలు కాగా ఇటు శనివారంపేటలో, అటు కోనాపూర్‌లో విషాదం అలుముకుంది. సుమలతకు ఇది మూడవ గర్భం కాగా ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమలత మృతితో ఆ ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అమ్మ కావాలంటూ ఆ చిన్నారులు రోధించడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. భార్య, బిడ్డను కడసారి చూసేందుకు సౌదీలో ఉన్న సుమలత తండ్రి నర్సయ్య అక్కడి నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అమ్మ కోసం ఏడ్చిన…

బస్సు ప్రమాదంలో కళ్ల ముందే కన్నతల్లి మృతి చెందడాన్ని శనివారంపేటకు చెందిన సలెంద్ర మణిదీప్ అనే చిన్నారి జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రమాదం గురించి తలచుకుంటూ వణికిపోతున్నాడు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ తనను ఎవరో బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అమ్మ కావాలని అడిగితే ఎవరూ చూపించలేదంటూ చెబుతుండగా అతడి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అమ్మ కావాలని అడిగితే వస్తుందంటూ చెబుతూనే ఉన్నారని, అమ్మ మాత్రం రాలేదని, అమ్మను చూపిస్తామంటూ ఈ రోజు ఉదయం ఇంటికి తీసుకువస్తే అమ్మ చనిపోయి ఉందంటూ గద్గద స్వరంతో మణిదీప్ చెబుతుండగా అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చావు అంటే ఏమిటో తెలియని ఆ చిన్నారే తల్లి చితికి నిప్పంటించడం హృదయాలను ద్రవింపజేసింది.

కన్న కొడుకు కడసారి చూపునకు నోచుకోని తండ్రి…

కన్న కొడుకు బస్సు ప్రమాదంలో మృతి చెందగా, భార్య తీవ్ర గాయాల పాలై ఆ స్పతిలో ఉన్నా వారిని చూడలేని దుస్థితి ఆ తండ్రిది. శనివారంపేటకు చెందిన గాజుల అశోక్ బతుకుదెరువు కోసం ఏడాది క్రితం సౌదీ వెళ్లాడు. అయితే అతడికి గత నాలుగు నెలలుగా పని లేకపోవడంతో పని కోసం కంపెనీని వదిలి బ యటకు వెళ్లాడు. బస్సు ప్రమాదంలో అతడి భార్య లత తీవ్రంగా గాయపడగా, కుమారుడు హర్షవర్ధన్ మృతి చెందాడు. అయితే ఈ విషయం కుటుంబ స భ్యుల ద్వారా అశోక్‌కు తెలిసినా తన చేతిలో పాస్‌పోర్టు, వీసా లేకపోవడంతో రాలేక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కడసారి చూపుకు నోచుకోలేకపోయానని సౌ దీలో అశోక్, ఇంటి పెద్ద దిక్కు రాలేకపోయాడని ఇక్కడ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.