Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కొటక్ బ్యాంక్ లాభం రూ.1,124 కోట్లు

bs

గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి

 న్యూఢిల్లీ: మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో(క్యూ4) ప్రైవేటురంగ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 15 శాతం పెరిగి రూ.1,124 కోట్లు నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.976 కోట్లుగా ఉంది. రూ.1,230 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా.. ఈ అంచనాలను అందుకోలేకపోయింది. ఏడాదిఏడాది ఆధారంగా చూస్తే నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 19.4 శాతం వృద్ధిని సాధించింది. ఎన్‌ఐఐ రూ.2,161 కోట్ల నుంచి రూ.2,580 కోట్లకు పెరిగింది. స్థూల నిర్ధరక ఆస్తులు 2.31 శాతం నుంచి 2.22 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పిఎలు కూడా 1.09 శాతం నుంచి 0.98 శాతానికి మందగించాయి. సంవత్సరం క్రితం త్రైమాసికంలో రూ.267 కోట్ల నుంచి రూ.307 కోట్లకు కేటాయింపులను బ్యాంక్ పెంచింది. కాగా ఫలితాలు బాగుండడంతో సోమవారం ట్రేడింగ్‌లో కోటక్ మహింద్రా బ్యాంక్ షేరు విలువ జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. కోటక్ మహింద్రా బ్యాంక్ షేరు బిఎస్‌ఇలో రూ.1203 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో షేరు ఇంట్రాడేలో 2.50 శాతం లాభపడి రూ.1218.30ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి షేరు 2 శాతం పెరిగి రూ.1211 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1193.65లుగా, రూ.1218.30లుగా ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం క్యూ4 ఫలితాల్లో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తొలిసారిగా భారీ నష్టాలను నమోదు చేసింది. మొండి బకాయిల కారణంగా రూ.2,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.1,225 కోట్లుగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లిస్ట్ అయిన యాక్సిస్ బ్యాంక్ నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి.. మొండి బకాయిలు పేరుకుపోవడం, వాటికి కేటాయింపులు చేయడం కారణంగా బ్యాంక్‌కు నష్టాలు తప్పలేదు. శిఖా శర్మ నేతృత్వంలోని బ్యాంక్ ఈసారి కేటాయింపులను మూడు రెట్లు పెంచింది.

Comments

comments