Home బిజినెస్ కోటక్ బ్యాంక్ మేనేజర్ అరెస్టు

కోటక్ బ్యాంక్ మేనేజర్ అరెస్టు

kotakన్యూఢిల్లీ: అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్మును చెలామణిలోకి తేవడానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలో కోటక్ బ్యాంక్ మేనేజర్ ఒకరిని ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఆయన పనిచేసే బ్యాంకు శాఖలో పెద్ద నోట్ల రద్దు తరువాత తొమ్మిది నకిలీ ఖాతాలలో రూ. 34కోట్ల మేర డిపాజిట్లు జరిపారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేశారు. కె.జి. మార్గ్ శాఖ మేనేజర్ అశీష్ కుమార్‌ను మంగళవారం రాత్రి పొద్దుపో యాక ప్రశ్నించి అరెస్టు చేశారు. అక్రమార్జన సొమ్ము చెలామణి నిరోధక చట్టం నిబంధనల కింద ఆయనను అరెస్టు చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని ఇడి అధికారులు వెల్లడించారు. కుమార్‌ను ఇదివరకే సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. దర్యాప్తు సంస్థలకు సహకారం అందజేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. తొమ్మిది నకిలీ ఖాతాలలో రూ.34కోట్ల నల్లధనం డిపాజిట్ చేశారనే ఆరోపణపై ఢిల్లీ పోలీసులు గత వారం ఇద్దరిని అరెస్టు చేశారు.
పెద్దమొత్తంలో డిపాజిట్లు అవాస్తవం: ఎస్‌బిఐ
నోట్ల రద్దు తర్వాత అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎస్‌బిఐ బ్యాంకు శాఖల్లో పెద్దఎత్తున డిపాజిట్లు వచ్చాయనే వార్తలు కలకలం సృష్టించాయి. అయితే ఈ వార్తలను ఎస్‌బిఐ ఖండిస్తూ.. నవంబర్ 8 తర్వాత 1,300 కోట్లకు పైగా నగదు వివిధ శాఖల్లో జమ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ఈమేరకు బ్యాంకు రీజినల్ మేనేజర్ బైరాగి ప్రకటన చేశారు. ఇటానగర్ రీజియన్ పరిధిలో తమ బ్యాంకుకు మొత్తం 43 శాఖలు ఉండగా.. అందులో 26 శాఖలు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయన్నారు. వీటిలో నవంబర్ 8కి ముందు 1,595కోట్లు డిపాజిట్లు ఉండగా డిసెంబర్ 24 నాటికి రూ.1,748 కోట్లకు మాత్రమే పెరిగాయని, అంటే 45రోజుల్లో రూ.153 కోట్లు మాత్రమే డిపాజిట్ అయినట్లు తెలిపారు.