Home వార్తలు జలకింకిణుల జనజీవనది పుష్కర కృష్ణ పుష్కల కృష్ణ

జలకింకిణుల జనజీవనది పుష్కర కృష్ణ పుష్కల కృష్ణ

రచయిత : డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

సెల్‌ః 9032844017

కృష్ణవేణి పుష్కర మహత్మం
krishna-puskaraluపూర్వం సౌవీర దేశాన్ని సుమతియను మహారాజు పాలిస్తుండేవాడు. ఆయనకు శివ వరప్రసాదమున సర్వ లక్షణ లక్షితుడు అయిన కుమారుడు కలిగాడు. అతనికి చిత్రరథుడని నామకరణం చేశారు. అతనికి యవ్వనం రాగానే పట్టాభిషిక్తుడిని చేయాలని మహారాజు సంకల్పించి అభిషిక్తుణ్ణి చేశాడు.
“మహారాజా! చోళ దేశమున “సుధర్ముడు’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ పారంగతుడు. ఆయనకు సుశర్మ అను కుమారుడు గలడు. కొంత కాలమునకు సుధర్ముడు తన భార్యకు కుమారుడిని అప్పగించి తాను తామ్రపర్ణి నదీతీరమునకేగి యోగ నిష్టుడై తపమాచరించి ముక్తిని పొందాడు. తండ్రిఆనతిపై మాతృభక్తి పరాయణుడగు సుశర్మ గయ్యాళి అయిన భార్యకు, తల్లికి మధ్య గల వైరమును తీర్పజాలకపోయాడు. సుశర్మ విధిలేక తల్లిని ఇంటి నుండి వెడలగొట్టాడు. వృద్ధురాలైన తల్లి నానా బాధలు పడి చనిపోయింది. మాతృ పీడా పాపముచే సుశర్మ అకాల మృత్యువు పాయ్యాడు”.
“ఆ సుశర్మయే నీ తనయుడుగా జన్మించాడు. అతను గత జన్మలో చేసిన పుణ్య వశమున మహారాజువైన నీ కడుపున పుట్టి, భోగమును అనుభవించుచున్నాడు. కాని పూర్వ జన్మమున అరువది సంవత్సరములు బతికిన ఆ జీవి నీ పుత్రుడుగా పుట్టి నలుబది సంవత్సరములు ఆయుర్దాయము కలిగియున్నాడు. ఇక నీ కుమారుని ఆయుర్దాయము మూడు ఘడియలు మాత్రమే యున్నది” అని మహర్షి చెప్పగా విన్న మహారాజు దుఃఖిత హృదయుడయ్యాడు. మహర్షి కాళ్ళపై పడి పుత్రభిక్ష పెట్టమని వేడుకున్నాడు.
దయామయుడైన మహర్షి ‘మహారాజా! దుఃఖపడకు. లెమ్ము. నీ పుత్రునకు దీర్ఘాయువు కల్గుటకు యిది మంచి సమయము. నీవు నీ కుమారునితో కలిసి కృష్ణవేణీ నదిలో స్నానమాచరించుము. నేను ఒక వ్రతము చెప్పెదను. పుష్కర స్నానము చేసి, అపమృత్యు పరిహార పూర్వక దీర్ఘాయువుకై సంకల్పించి వ్రతము కొనసాగింపుము. పన్నెండు రోజుల వ్రతమును ఒకే రోజులో కల్పప్రకారము శ్రద్ధతో ఆచరించుము. దానివలన నీ పుత్రునకు దీర్ఘాయువు కలుగును’ అని చెప్పిన మహర్షి వాక్యము విని, రాజు వెంటనే సపరివార సహితముగా కృష్ణవేణీ నదీతీరమునకేగి అపమృత్యు నివారణ పూర్వక దీర్ఘాయువు కొరకు సంకల్పించి వ్రతదీక్ష పూర్తిచేశాడు. వెంటనే రాజకుమారుడైన చిత్రరథుడు దీర్ఘాయువయ్యాడు. సంతోషముగా చిరకాలము రాజ్యపాలనము చేసి ధన్యతనొందాడు. ఆస్తిక జనులందరూ యీ వ్రత విధానమును ఆచరించి, సద్గతులనొంది దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యములతో తుల తూగెదరు గాక! అపమృత్యు దోష విముక్తులై ఇష్ట కామ్యార్థములు పొందెదరుగాక! ఇది శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పిన కథ.

తెలుగు జనుల మదిలో పులకరింతలు చిలకరిస్తూ తన సోయగాలతో మైమరపిస్తూ ఒక్కోసారి ప్రళయాన్ని చూపి భయపెడుతూ సారవంతమైన ఒండ్రుమట్టిని తరలించుకొస్తున్న కృష్ణవేణి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదాన్ని మోపి ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా మార్చేసింది. అంతకుముందే కర్ణాటక భూములను తడిపి వచ్చిన (భీమా) నది కృష్ణవేణిలో కలిసింది. ప్రస్తుతం మన రాష్ట్ర సరిహద్దుకు మూడు కిలోమీటర్ల ఎగువన ఈ నది కృష్ణలో కలిసింది. ఆ తర్వాత కొంత దూరం వచ్చాక చింతలు తీర్చే చింతరేవుల ఆంజనేయస్వామిని దర్శించుకుంటూ పోతుంది. ఈ నదికి ఎడమవైపున దుర్భిక్ష ప్రాంతంగా పేరు మోసిన మక్తల్, ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ తాలుకాలను, కుడివైపున గద్వాల డివిజన్‌లోని శివారు భూములను సస్యశ్యామలం చేసేందుకు చింతరేవుల గ్రామం వద్ద జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టును కోట్లాది రూపాయలతో నిర్మించారు. అలాగే ప్రస్తుతం జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు కృష్ణా నీటిని నేరుగా అందించే పథకం ఇదొక్కటే. ఇక్కడ నదీ ప్రవాహం చాలా వేగంగా ఉండి అల్లంత దూరంలోనే అలంపురంలోని ఆలయాలను స్పృశిస్తుంది. అలంపూర్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కృష్ణా ఉప నది అయిన తుంగభద్రా నది ఎడమ గట్టుపై చాళుక్యుల కాలంనాటి దేవాలయ సముదాయం ఉంది. అలంపురం పవిత్ర వాతావరణాన్ని ఒకనాటి ప్రాభవ వైభవాలను మననం చేసుకొంటూ అలంపూర్ తాలూకాలోని కూడవల్లి వద్ద తుంగభద్రను కృష్ణవేణి తనలో ఇముడ్చుకుంది. ఇక్కడ తుంగభద్ర, కృష్ణవేణిల సంగమం అత్యంత మనోహర దృశ్యం. కూడవల్లిలో కృష్ణానదీ తీరాన చాళుక్యుల కాలం నాటి సంగమేశ్వర దేవాలయం ఉంది.
దిగువ కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్ట వల్ల ఈ సంగమేశ్వర దేవాలయం, జటప్రోలులోని వేణుగోపాలస్వామి దేవాలయం, మరికొన్ని దేవాలయాలు. జలాశయంలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ చారిత్రక ఆలయాలు జలసమాధి కాకుండా వీటిని ఎక్కడికక్కడ విడగొట్టి కొత్త జటప్రోలులో ఎత్తయిన సురక్షిత ప్రాంతంలో యథాతథంగా పునర్నిర్మించారు. కూడవల్లి దేవాలయాన్ని అలంపురాననికి మార్చారు. తన ఉరవడికి ఆ చారిత్రక కట్టడాలు శాశ్వతంగా కనుమరుగైపోకుండా కాపాడినందుకు మెచ్చుకోలుగా అభినందన పరంపరను కురిపిస్తూ తేలికపడ్డ హృదయంతో కృష్ణమ్మ ముందుకు కదలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడో సుదూర ప్రాంతంలోని చిక్కని అడవుల చిటారు కొమ్మల మీది నుంచి ఎగిరొచ్చిన గాలితెరలు మోసుకొస్తున్న శ్రీశైలం ఆలయ ధ్వజస్తంభపు చిరుమువ్వల నాదాలు హృదయాన్ని స్పృశించగా రంజిల్లిన మనసుతో దారి వెతుక్కుంటూ మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లాల మధ్యనున్న నల్లమల కొండల్లోంచి అడవిదారి వైపు పరుగులు తీస్తుంది కృష్ణ. టైగర్ ప్రాజెక్టు వన్యమృగాలకు దప్పిక తీర్చడంతో పాటు వీటికి మనుషుల భయాన్ని కూడా దూరం చేసింది.
కమనీయ దృశ్యం పాతాళగంగ ప్రవాహం
కొండల మధ్య సన్నటి దారుల నుండి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం మల్లికార్జునస్వామికి పాదాభివందనం చేసి భక్తి పూరిత ఆవేశంతో శివతాండవమే చేసింది.ఇక్కడ కృష్ణ సన్నని మార్గం ద్వారా వేగంగా పైనుంచి కిందికి పడుతూ చూపరులకు భయం కొల్పుతుంది. కొండల్లో, అడవుల్లో ప్రతిధ్వనించే భక్తజనుల హరహర శంభో మహాదేవ నామోచ్ఛారణలతో ఆర్భాటంగా వెల్లివిరిసే భక్తిపూరిత వాతావరణంలోకి అడుగుపెట్టి నిలువుగా పులకించిపోయింది. కొండల పాదాల వద్ద పాతాళ గంగగా కదలివెళ్ళి కృష్ణవేణమ్మ ఆధునిక దేవాలయం అని ప్రస్తుతించే శ్రీశైలం ఆనకట్ట నిర్మాణంతో కొండ అంచు వరకూ ఉబికి వచ్చింది. కనులకు విందు గొలిపే అక్కడి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. శ్రీశైల శిఖర దర్శనమాత్రాన పునర్జన్మ ఉండదనేది భక్తుల విశ్వాసం. కైలాసాన్ని మరపించే భూలోక కైలాసం శ్రీశైలం. ఆలయ శిఖరాన్ని తనివితీరా అవలోకిస్తూ భక్తిభావంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది కృష్ణమ్మ.
అతి పురాతనం శ్రీశైల క్షేత్రం
పరవళ్లు తొక్కుతూ బిరబిరా పారే కృష్ణమ్మ వేగానికి అడ్డుకట్టవేసి ఆ మహా జలశక్తిని విద్యుత్తుగా మార్చి రాష్ట్రంలో చీకటిని పారద్రోలడానికి శ్రీశైలం కొండల మధ్య డ్యావ్‌ును నిర్మించి జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో జనరేటరూ 107 మెగావాట్ల విద్యుత్తును తయారుచేసే విధంగా ఏడు జనరేటర్లను ఏర్పాటు చేశారు. డ్యావ్‌ులో 12 గేట్లను నిర్మించారు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం రిజర్వాయరు జలాలను ఆధునిక దేవాలయంగా భావించే నాగార్జున సాగర్ జలాశయానికి వదులుతారు. అక్కడ జలాశయం నీటిని లక్షలాది ఎకరాల సాగుకు విద్యుచ్ఛక్తికి వినియోగిస్తున్నారు. భక్తుల పాపాలను ప్రక్షాళనం చేసే ఆ పుణ్య జలాలే నేలతల్లి దప్పిక తీర్చి బంగారు పంటలు పండిస్తున్నాయి. ఆ జలాలే విద్యుచ్ఛక్తిని పుట్టించి వెలుగు వెల్లువలో చీకటిని పారద్రోలుతున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ప్రాజెక్టుల ద్వారా కృష్ణవేణమ్మ ఆంధ్ర రాష్ట్ర ఆర్థి, పారిశ్రామిక ప్రగతికి ఇతోధికంగా దోహదపడుతూ మానవాళికి జీవాన్ని ప్రసాదిస్తూ కడలి గర్భంలో కలిసిపోతోంది కృష్ణవేణి.
ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం.
భారత దేశాన్ని మొగల్, బ్రిటీష్ తెల్లదొరల నుండి రక్షించడానికి ఎందరో రాజులు, చక్రవర్తులు, స్వాతంత్య్ర సమర యోధులు ప్రాణ త్యాగాలు చేశారు. అటువంటి వారిలో ఒకరైన ఛత్రపతి శివాజీని పునరావలోకనం చేసుకోవడానికే కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1982లో సుమారు ఒక కోటి యాభైలక్షల వ్యయంతో ఈ స్ఫూర్తి కేంద్రాన్ని నెలకొల్పారు.
మోక్షకారిణి కృష్ణవేణి
చక్కని కన్నులు కలదియు, శ్యామల వరాంచిత దేహము కలదియు, శంఖుచక్రాది విష్ణు చిహ్నములు కలదియు, చతుర్బాహువులు కలదియు, పీతాంబరము కలదియు, ప్రసన్న రూపము కలదియు అంటూ స్కంధ పురాణములో కృష్ణానది అవతార స్వరూప అభివర్ణన జరిగింది.
పడమటి కనుమల్లో సహ్యాద్రి, పర్వతశ్రేణుల్లో ఆవిర్భవించినప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో సముద్రంలో కలిసే వరకు కృష్ణానది మహారాష్ట్రలో 306 కిలోమీటర్లు, కర్నాటకలో 484 కిలోమీటర్లు, తెలంగాణలో 166, ఆంధ్రప్రదేశ్‌లో 447 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మహారాష్ట్రలో సతారా జిల్లాలో కరాడ వద్ద 4714 అడుగుల నుండి 1900 అడుగుల ఎత్తుకు తగ్గిపోయింది. తర్వాత 300 మైళ్లు శరవేగంతో ముందుకు కదిలి కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోకి ప్రవేశించింది. మరో మూడు మైళ్లు ప్రవహించిన తర్వాత దీని ఎత్తు 408 అడుగులకు తగ్గిపోవడంతో అక్కడొక జలపాతం ఏర్పడింది. దీనినే ‘జలదుర్గ’ అంటారు.
తెలంగాణలో అడుగు పెట్టడానికి ముందు 315 అడుగుల ఎత్తున మైదానం ద్వారా ప్రవహించింది.
పురాణాలలో కృష్ణానది
విశేష చరిత్ర ఉన్న కృష్ణవేణి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర జాతుల జీవన సరళి నుంచి వికసించిన సంస్కృతికి మాతృమూర్తిగా విశిష్టస్థానం సంతరించుకుంది.
పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో పుట్టి హంసలదీవి వద్ద సాగరునితో సంగమించిన మనకు తెలిసిన కృష్ణానదికి ఎంతో పురాణ చరిత్ర ఉంది.
ద్వాపరయుగంలో మహా జలప్రళయం సంభవించి నదీనదాలు, పర్వతారణ్యాలు ఏకమై సముద్రునిలో లీనమయ్యాయి.
కృష్ణావతారం చాలించిన శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో కొలువుదీరాడు. భూలోకంలో సృష్టి నశించడంతో చతుర్ముఖ ప్రజాపతి బ్రహ్మ పునః సృష్టి ప్రారంభించాడు.
కలియుగంలో సంభవించే పాపాలు, వైపరీత్యాలను ముందే పసిగట్టిన ప్రజాపతి, శ్రీహరికి విన్నవించుకున్నాడు. విష్ణువు తన అంశగా కృష్ణను సృష్టించి త్రికాలజ్ఞాని అయిన బ్రహ్మకి అందించాడు.
నిష్టాగరిష్టుడై తపస్సు చేస్తున్న సహ్యముని శ్రీహరి అభీష్టం మేరకు పశ్చిమ కనుమలలో అద్రిగా అవతరించాడు. ‘బ్రహ్మగిరి’ మీది శ్వేతాశ్వత్థ వృక్షమూలం నుంచి పవిత్ర కృష్ణానది అవతరించింది. బ్రహ్మగిరిలో గోముఖాకృతిలో ఉన్న గండశిల నుండి వెలువడింది.
సహ్యాద్రి ఉత్తర శిఖరానికి ‘బ్రహ్మగిరి’ అనీ, దక్షిణ శిఖరానికి ‘వేదగిరి’ అని పేర్లు, బ్రహ్మదేవుడు తపస్సు చేసి బ్రహ్మలోకం పొందిన పర్వతం కాబట్టి ‘బ్రహ్మగిరి’ అనీ, వేదాలు శరీర ధారలై నడుమ బ్రహ్మోపాసన చేసిన పర్వతం కాబట్టి ‘వేదగిరి’ అని పేరు వచ్చిందని చెబుతారు.
బ్రహ్మగిరిలో ప్రభవించిన కృష్ణ కొంత దూరం సాగి ‘వేదగిరి’లో శివ అంశ అయిన ‘వేణి’ని తనలో కలుపుకుంది. అక్కడి నుండి కృష్ణవేణిగా మారి తూర్పు కనుమల వైపుగా ప్రియ సాగరుడిలో సమైక్యం కావడానికి హొయలొలుకుతూ సాగిపోయింది.
పడమటి కనుమలలో పుట్టి మార్గమధ్యంలో వేణి, తుంగభద్రలను కలుపుకొని శ్రీశైలాన పాతాళ గంగయై, ఆగ్నేయ దిశగా ప్రవహించి తూర్పు దిక్కున సముద్రంలో అంతర్లీనమైంది.
ఆధునిక దేవాలయాలు
కృష్ణానది ప్రవహించే మార్గమధ్యంలో లింగమతీర్థం, భైరవతీర్థం, మార్కండేయ తీర్థం, కుమార తీర్థం, జంబూ తీర్థం, వాల్మీకి తీర్థం, శుక్లతీర్థం మొదలైన పవిత్ర క్షేత్రాలు వెలిసాయి.
పుష్కర పులకింత
ప్రపంచమంతా భగవన్మయం, పంచభూతాలూ భగవత్స్వరూపాలే. ఈ మహాభూతాలలో దేని ప్రత్యేకత దానిదే, అయినా జలానికి ఒక్క ప్రత్యేక స్థానముంది. ఒక్కో ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి జలప్రభావం పెరుగుతూ ఉంటుంది. మూడింట రెండు వంతులు నీళ్లున్న మనిషి దేహాన్ని, మనసును ప్రభావితం చేసేవి జలాలే. శుభత్వాన్ని, పవిత్రతను సమకూర్చేవి నీళ్లే. అసలు ప్రపంచాన్ని పవిత్రీకరించేవి రెండే రెండు. ఒకటి తీర్థం, మరోటి అగ్ని, సృష్టికి, అభ్యుదయానికి మూలం జలం అలాంటి జలం కొన్ని పర్వాల్లో అత్యంత పవిత్రమౌతుంది.
పన్నెండేళ్లకు ఓసారి 12 రోజులపాటు వచ్చే పవిత్ర పుష్కరాలు కృష్ణానదికి ఈసారి ఆగస్టు 12న వస్తున్నాయి. పుష్కరునితో కలిసి బృహస్పతి మేషాదిరాశుల్లో ప్రవేశించినపుడు క్రమంగా ప్రసిద్ధమైన 12 నదులకు పుష్కరం ఏర్పడుతుంది. దేవ గురుడు బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో నివసిస్తుంటాడు.
పాలమూరు పల్లెసీమల నుంచి ప్రవేశం:
మహారాష్ట్రలో పుట్టి 306 కిలోమీటర్ల దూరం పయనించి కర్నాటకలో ప్రవేశించి 482 కిలో మీటర్లు పరుగులు తీసి పాలమూరు జిల్లాలోని తంగిడి వద్ద తెలంగాణను తాకుతుంది. తెలుగు జనుల హృదయాలలో పులకరింతలు చిలకరిస్తూ సారవంతమైన ఒండ్రుమట్టిని తన గర్భంలో దాచుకుని తెస్తూ మధురజలాలతో తెలుగుసీమను పునీతం చేయడానికి తెలుగు గడ్డన ప్రవేశిస్తుంది. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆంధ్రదేశంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా ప్రవహించి దివిసీమలో హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. 315 అడుగుల ఎత్తున మైదానం ద్వారా ప్రవహిస్తుంది. కృష్ణవేణి పరీవాహక ప్రాంతం రెండు లక్షల 51వేల చదరపు కిలోమీటర్లు.
ఆదినది:
కృష్ణవేణిని ఆదినదిగా పిలుస్తారు. మిగిలిన నదులన్నింటి కంటే ముందు కృష్ణానది ఆవిర్భవించిందని స్కంద పురాణంలో పేర్కొనబడింది. మన పురాణాల ప్రకారం మహావిష్ణువు ప్రేరణతో బ్రహ్మదేవుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల ధర్మాలను నిర్దేశించినా కలియుగ ధర్మాన్ని నిర్దేశించలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మొదట కృష్ణానదిని ఆవిర్భవింపజేసి నాగరికత, ధర్మం, ఆధ్యాత్మికత తదితర ఉత్కృష్ణ గుణాలు నదీతీరంలో విలసిల్లుతాయని చెప్పినట్లు స్కంద పురాణ ప్రవచనం. మహారాష్ట్రలోని సతారా పట్టణం

దాటిన తర్వాత ‘వేణ’ అనే ఉపనది ఒకటి కృష్ణతో సంగమిస్తుంది. కనుకే దీనికి కృష్ణవేణి పేరు వచ్చిందని కూడా చెబుతారు. కర్ణాటకలో ఘట ప్రభ, మలప్రభ నదులను తన అక్కున చేర్చుకుని ముందుకు తెస్తూ తెలుగు నేలలో అడుగిడుతోంది కృష్ణమ్మ తల్లి. తెలంగాణలో భీమా, తుంగభద్ర, మూసీ, మానేరు ఉపనదులతో సంగమించి ముందుకు సాగుతుంది.
చల్లని తల్లి కృష్ణమ్మ:
కృష్ణవేణమ్మకు ఎప్పుడూ కోపం రాదు. కుండపోతగా వర్షం కురిసి వాగులు, వంకలూ ఏకమైనా వాటన్నింటినీ తనలో ఇముడ్చుకుని నిండుగా ప్రవహిస్తుందే తప్ప ఎప్పుడూ తనను నమ్ముకున్న జనావళిని నష్టపరచదు. కష్టపెట్టదు. పుట్టి మునిగి ప్రాణాలు పోగొట్టుకున్న వార్తలు తరచూ గోదావరి తల్లిపైనో, తుంగభద్రపైనో వినవస్తాయి. కాని కృష్ణమ్మ అలా కాదు. అందుకే కృష్ణవేణమ్మ చల్లని తల్లి, శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునకొండ, అమరావతి, కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాలస్వామి వంటి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలను తన తీరంగా చేసుకుంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే ఆధునిక దేవాలయాలైన ఎన్నో ప్రాజెక్టుల ద్వారా ప్రజావళిని రక్షిస్తుందే కాని ఆగ్రహించదు. కృష్ణాతీరం, సంస్కృతి విలువలకు, నాగరికతకు ఆలవాలం. ఇన్ని సొబగులతో, ఎన్నో పరవళ్లతో, మరెన్నో సోయగాలు పోతూ కృష్ణవేణమ్మ హంసలదీవి సాగరునిలో ఐక్యమైపోతుంది.

 ఉపనదుల సంగమం కృష్ణమ్మ
మన దేశంలో ఎన్నో జీవనదులు, ఉపనదులు ప్రవహిస్తూ పుడమిని పులకరింపజేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోగల నదులలో ముఖ్యమైనది కృష్ణానది. ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 800 మైళ్లు దూరం ప్రయాణించి కృష్ణాజిల్లా హంసలదీవి నాగాయలంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో మహాబలేశ్వరానికి ఉత్తరాన పుట్టిన కృష్ణానది తూర్పు దిక్కుగా ప్రవహిస్తోంది. జన్మస్థానానికి సమీపాన ఆదిమహాదేవుని దేవాలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అక్కడగల గోముఖం నుండి నదీజలం కిందకు పడుతుంది. ఆ స్థలాన్ని గోముఖ క్షేత్రంగా పిలుస్తారు ఈ ప్రాంతంలో కృష్ణా, వేణి నదులు కలసినచోట ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చైత్ర, ఆషాఢ, శ్రావణ, కార్తీక మాసాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. పశ్చిమ కనుమలను వీడి మైదాన దిశగా సతారా జిల్లా, సాంఘ్లి, కుందుండవాడ మీదుగా బీజాపూర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నది రాయచూర్ వద్ద దక్కన్ పీఠభూమిలో ప్రవేశిస్తుంది. అక్కడినుండి అహ్మద్‌నగర్, పూణే, షోలాపూర్ ప్రాంతాలగుండా వజీరాబాద్ చేరుకొని తూర్పు కనుమలలో ప్రవేశించి తెలంగాణలో ప్రవహించి రెండు పాయలై బంగాళాఖాతంలో చేరుతుంది. కృష్ణానదికి మార్గమధ్యంలో అనేక ఉపనదులు సంగమించి ఇది ఒక మహాజీవనదిగా రూపొందుతుంది. సతారా మండలం కాదర్‌వద్ద కోయానది, సాంఘ్లీ వద్ద వారణానది, కుందుండవాడ వద్ద పంచగంగ కృష్ణానదిలో విలీనమవుతు న్నాయి. కృష్ణానది బీజాపూర్ జిల్లాలో ప్రవహించేటప్పుడు ఘటప్రభ, మలప్రభ అనే రెండు చిన్న నదులు వచ్చి చేరుతున్నాయి. రాయచూర్ ప్రాంతం దాటిన తరువాత కృష్ణానది యొక్క ముఖ్యనది అయిన భీమానది, తుంగభద్రా నదులు కృష్ణానదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండు ముఖ్య ఉపనదులు తనలో ఐక్యం చేసుకున్న కృష్ణమ్మ వజీరాబాద్ వద్ద మూసీనదిని తనతో కలుపుకని మరికొంత దూరం ప్రవహిస్తుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో పలు ప్రాచీన దేవాలయాలు, శక్తిపీఠాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ తీరప్రాంతంలో క్షీరలింగేశ్వర ఆలయం, మక్తల్ మండలంలో పసుపుల గ్రామం వద్ద దత్తపీఠం, పెద్దచింతరేవుల, నదీ అగ్రహారం వద్ద రామాలయం, కృష్ణాలయం, బీచుపల్లిలో ఆంజనేయాలయం, రంగాపురంలో శ్రీరంగనాథాలయం, అలంపూర్‌లో జోగులాంబ ఆలయాలు ఉన్నాయి.

పుష్కరం అంటే…

puskaram2జ్యోతిశ్శాస్త్రం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి మేషం ప్రారంభమయిన 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆ రాశి నుంచి నిష్ర్కమించేటప్పుడు 12 రోజులు, ఏడాదిలో మిగతా అన్ని దినాలలో మధ్యాహ్న సమయంలో పుష్కరుడు బృహస్పతితో కలిసి ఉండేటట్లు బ్రహ్మ ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిలో ప్రవేశించేటప్పుడు గంగకు, వృషభరాశిలో నర్మదకు,మిధునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. తులలో కావేరికి, వృశ్చికంలో భీమానదికి, ధనస్సులో వాహిని (బ్రహ్మపుత్ర)కి, మకరంలో తుంగభద్రుడు, కుంభంలో సింధుకు, మీనంలో ప్రదాతనదికి పుష్కరాలు సంభవిస్తాయి.ఇలా ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. పన్నెండేళ్ళకు ఒకసారి సంభవించే పుష్కర సమయంలో ఆ నదిలో స్నానం చేసి నదీతీరంలో దానం, జపం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం పుణ్య ప్రదం. భాద్రపద మాసంలో గురువు కన్యారాశిలో ప్రవేశించడంతో కృష్ణపుష్కరాలు ప్రారంభమవుతాయి. కృష్ణా పుష్కర సమయంలో నదీ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పుష్కర వ్రతం చేయడం వల్ల అపమృత్యువుతొలిగి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పుష్కర సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాదిదేవతలు, రుషులు, పితృదేవతలు కృష్ణానదిలో నివసిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్ల ఆ సమయంలో నది వద్ద చేసిన పుణ్య కార్యానికి గంగానది వద్ద చేసిన దానికంటే కోటి రెట్లు సత్ఫలితం కలుగుతుందని విశ్వాసం.

పుష్కరాల  విశిష్టత

 ఏ పుణ్య నదిని చూసినంత మాత్రానే కోటి జన్మలలో చేసిన పాపాలు పోతాయో, అటువంటి కృష్ణవేణి నదీమ తల్లికి నమస్కరిస్తున్నామని ఎందరో మహర్షులు స్తుతించిన పవిత్రనది కృష్ణవేణి. కృష్ణానది ప్రశస్తిని, వివిధ పురాణాల్లోనూ, గ్రంథాల్లోనూ కొనియాడారు. వాటి ప్రకారం జీవనదులన్నింటిలోకి కృష్ణవేణికి విశిష్టమైన స్థానం వుంది. కృష్ణానదిలో స్నానం చేయడం గంగానదిలో స్నానం చేసినంతగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతం మీద కృష్ణానది పుట్టి, తూర్పున బంగాళఖాతంలో కలిసే వరకూ 1300 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. కొండకోనల్లో పుట్టి వంకలు తిరుగుతూ ఎత్తు నుంచి కిందికి వేగంగా ప్రవహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలలో ప్రవహిస్తున్న వందమైళ్ళ తీరంలో చింతరేవుల, బీచుపల్లి, సోమశిల, శ్రీశైలం, నాగార్జునకొండ, అమరావతి, విజయవాడలలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ నదిని పుణ్యప్రధాన నదిగా భక్తులు పరిగణిస్తున్నారు. నదులన్నింటికంటే ముందుగా కృష్ణానదిని శ్రీ మహావిష్ణువు ఆవిర్భవింపజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానది సన్నిధి వల్ల పాపాలు హరిస్తాయని బ్రహ్మదేవుడికి నారాయణుడు చెప్పినట్లు స్కందపురాణంలో ఉంది. కలియుగం ప్రవేశించి భూలోకం పాపులతో నిండిపోయింది. పాపాలను తొలగించేందుకు తమకు సాయం అవసరమని ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా, ఈ సమస్యను పరిష్కరించమని ఆయన విష్ణుమూర్తిని కోరాడట. విష్ణువు కోసం తీవ్రంగా తపస్సు చేస్తున్న సహ్యముని భుజాల మీద కృష్ణానదిని ఆవిర్భవింపజేయమని బ్రహ్మను విష్ణువు ఆదేశించాడు. అది తన పూర్వజన్మ పుణ్య విశేషమని సహ్యముని వెంటనే అంగీకరించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి స్వేత అశ్వత్థ వృక్షంగా సహ్యాద్రి మీద అవతరించాడు. కృష్ణానది ఆ దివ్యవృక్షం నుంచి ధవళ కాంతులీనుతూ ప్రవహించిందని స్కంద పురాణం విశదీకరిస్తోంది. సహ్య పర్వతం మీద పుట్టిన నది మిగిలిన నదులకంటే పవిత్రమైనదనీ, ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు హరించిపోయి, ముక్తి కలుగుతుందని పరాశర మహాముని ప్రస్తుతించాడు. సరస్వతీ నదిలో మూడు రోజులు, యమునలో అయిదు రోజులు స్నానం చేస్తే పవిత్రులవుతారు. గంగలో మునిగితే చాలు పవిత్రులవుతారు. నర్మదానదిని చూస్తేచాలు ముక్తి కలుగుతుంది. గోదావరి, కృష్ణానదులను తలుచుకున్నంతనే ముక్తిలభిస్తుందని కృష్ణ
మహత్మ్యం తెలియజేస్తోంది.

ఏ రోజు ఏ దేవుడు
పుష్కరాలు ప్రారంభమ్యే శుక్రవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. గురుజపం మంత్రం ఉత్తమం. రెండవరోజు సూర్యుని పూజించాలి. పుష్కర మంత్రాన్ని జపించాలి మూడవ రోజు కృష్ణానదీ జపమంత్రోచ్చారణ లక్ష్మీపూజ చేస్తారు. నాలుగవ రోజు గణపతి పూజ చేయాలి. నారాయణ జపమంత్రం, విప్రపూజ సత్ఫలితాన్నిస్తాయి. అయిదవ రోజు సూర్యమంత్ర జపం చేయాలి. శ్రీకృష్ణుని పూజించాలి. స్వయం పాకం విశేష పుణ్యాన్నిస్తుంది. ఆరవ రోజు సరస్వతీ పూజ చేయాలి. లక్ష్మీ మంత్రజపం చేయాలి. ఏడవ రోజున గౌరీ పూజ చేయాలి. గణేశమంత్ర జపం చేసి ఆరోజు కనీసం ఒకరికైనా భోజనం పెట్టాలి. ఎనిమిదవ రోజున సర్వేశ్వరుని పూజించాలి. కృష్ణ మంత్ర జపం చేయాలి. తొమ్మిదవ రోజు అనంతుని పూజించాలి. సరస్వతీ మంత్ర జపం చేస్తారు. పదవరోజు నదీపూజలక్ష్మి, హరిహరపూజ, గౌరీపూజ పితృదేవతలకు పిండప్రధానం చేయడం కోసం ఇది విశేష పవ్రదినం. పదకొండవ రోజు శివమంత్ర జపం చేయాలి. వామనుని పూజించాలి. పంక్తి భోజనం పెట్టాలి. చివరి రోజున శ్రీరామచంద్రుడిని పూజించాలి. రామమంత్రం జపం చేయాలి.
వంద అశ్వమేధ యాగాల ఫలం
రాశులన్నింటిలో సర్వశుభ గ్రహమగు బృహస్పతి సంచరించు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కర కాలంగా నిర్ణయించబడింది. ఈ సంవత్సరం బృహస్పతి కన్యారాశిలో ప్రకాశిస్తుండడం వల్ల కృష్ణానదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కర సమయంలో నదీజలాలు అది దైవిక తేజస్సును పొంది ఉంటాయి. కాబట్టి ఆ సమయాలలో అంటే 12 రోజులలో భక్తులు స్నానమాచరిస్తే అనంతకోటి పుణ్యఫలం, వంద అశ్వమేధయాగాల ఫలం దక్కుతుందని మహర్షులు సెలవిచ్చారు. సంవత్సరమంతా పుణ్యతీర్థంలో స్నాన, దాన, జపములు ఆచరించిన లభించే ఫలం ఒక్కరోజున కృష్ణానదిలో స్నానమాచరిస్తే కలుగుతుందని వ్యాస, వాశిష్టాది మహామునులు ఉద్ఘాటించారు. స్నానం ఆరోగ్యప్రదాయని, నిత్యం మనుషులు తేజోవంతంగా ఉండటానికి, చురుకుగా పని చేయడానికి స్నానం ఒక సంజీవని లాంటిది. ఈ స్నానం వల్ల మనస్సు ప్రశాంతతనొందుతుంది. అంతరంగం ఆనందంలో తేలియాడుతుంది. అయితే రోజూజ స్నానం చేయడం వేరు, ప్రత్యేక కాలంలో విశిష్టమైన సందర్భాలలో స్నానమాచరించడం వేరు. ఈ పుష్కరాల సందర్భంగానే పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగుతాయని, శుభాలు కలుగుతాయని చెబుతారు. ఒక్కసారి పుష్కర స్నానం చేస్తే అనేక జన్మలలో చేసిన పాపాలన్నీ పటా పంచలవుతాయని అంటారు. వెయ్యి తులాల పురుషదానాలు వంద కన్యాదానాలు చేస్తే కలిగే పుణ్యం స్నానం వల్ల కలుగుతుందంటారు. కృష్ణా పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానమాచరిస్తే మోక్షం పొందుతారంటారు.
ఇన్ని మహాత్మ్యాలు కలిగిన కృష్ణానదిలో పుష్కర స్నానం చేస్తే జన్మతరిస్తుందని మహర్షులు చెబుతారు. పుష్కరాల సందర్భంగా స్నానం చేసేటప్పుడు “స్వార్థత్రికోటి తీర్థ సహిత పుష్కర దేవతా ప్రీత్యర్థమై తదను గ్రహసిధ్యర్థం నదీ స్నాన మహం కరిష్యే” అని ప్రార్థించాలి. ఆ తర్వాత స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల పుణ్యం కలుగుతుందని ప్రతీతి. పుష్కర స్నానం చేయడం గత జన్మపుణ్యఫలం.
ఆరోగ్య ప్రయోజనం
కృష్ణానదిలో స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కృష్ణవేణీ అనే ఈ రెండు నదులు కృష్ణానది రావి చెట్టు వేళ్ళ ద్వారాను, వేణీనది ఉసిరికచెట్టు వ్రేళ్ళద్వారానూ రెండు చిన్నపాయలుగా ఆవిర్భవించిన అనంతరం ఒకే మహానదిగా అవతరించాయి.
రావి, ఉసిరిక ఈ రెండు వృక్షాలు మూలం మొదలుకొని కుశాగ్రం వరకు ఈ చెట్ల వేళ్ళు, కాండము, పత్రాలు, కాయలు, పండ్లు, సమిధలు, ఆ సమిధలను కాల్చి చేసిన బూడిదతో సహా ఇవి అన్నీ అమోఘమైన ఔషధీయుక్త విలువలు గలవి.
నాలుగు వేదాలతో సమాన ప్రాముఖ్యత కలిగిన ఆయుర్వేదంలో ఈ రెండు వృక్షాల అనిర్వచనీయమైన మహిమాన్విత శక్తి గురించి పేర్కొనబడింది. ఈ రెండు వృక్షాలు తను ఔషధీయుక్త శక్తులద్వారా అనేక దీర్ఘ, కఠినరోగాలను సమూలంగా నిర్మూలింపజేస్తాయి.  ఆరోగ్యాన్ని పెంపొందించి, ఆయుర్‌వృద్ధినీ కలిగిస్తాయి. అజ్ఞానాన్ని పారద్రోలి, విజ్ఞానాన్ని సంతరింపజేస్తాయి. చిత్త చాంచల్యాన్ని, మానసిక వ్యాధులను, అనేక చర్మ రోగాలను సమర్థవంతంగా అరికడ్తాయి. ఏకాగ్రతను పెంపొందించి సుఖసంతోషాలను కలిగిస్తాయి. అంతటి మహత్తర శక్తి కలిగిన ఈ రెండు వృక్షాల వేళ్ళద్వారా ఆవిర్భవించిన కృష్ణవేణీ నదుల జీవ జలాలు ఎంత శక్తివంతమైనవో, శారీరక, మానసిక, ఆరోగ్యదాయునులో మానవజాతికి ఎంతటి శ్రేయోదాయకమో అర్థం అవుతున్నది కదా!