Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

యూనిట్ గా బేసిన్

Krishna Water Dispute Tribunal

నదీలోయ ప్రాతిపదికగా కృష్ణా జలాల పంపిణీ జరగాలి 

4 పరీవాహక రాష్ట్రాల మధ్య వాటాల నిర్ణయం తీసుకోవాలి
రెండవ ్రట్రిబ్యునల్‌కు అప్పగించాలి
సీతారామ ప్రాజెక్టు కొత్తది కాదు
పాత ప్రాజెక్టుగానే గుర్తించి జలసంఘానికి ఆదేశాలివ్వాలి
చౌటుప్పల్ – కంది రోడ్డును నోటిఫై చేయాలి, జడ్చర్ల – మహబూబ్‌నగర్ మధ్య నాలుగులేన్ల రోడ్డు వేయాలి
రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్వహణకు రూ. 3 వేల కోట్లివ్వాలి
కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి 

మన తెలంగాణ / న్యూఢిల్లీ : కృష్ణా నదీజలాల వినియోగానికి సంబంధించిన వివాదంలో సరైన న్యాయం జరగాలంటే ఈ అంశాన్ని ‘కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -2కు (కెడబ్లుఆర్‌టి -2)’ అప్పగించాలని కేంద్ర జలవనరులు, ఉపరిత ల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికే పరిమితమైందని, కృష్ణా నదీ బేసిన్‌ను యూనిట్‌గా తీసుకుని నాలుగు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ జరగాలని నొక్కిచెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి సం బంధించిన పలు అంశాలపై చర్చించడంతోపాటు లిఖితపూర్వకంగా పలు వినతి పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలపై మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం (ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఆక్ట్) (ఐఎస్‌డబ్లుఆర్) సెక్షన్ 3 ప్రకారం మొత్తం కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ జరగాలని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని, ఈ ట్రిబ్యునల్ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికే పరిమితమైందని, దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికి సరైన న్యాయం జరగద ని, కృష్ణా నదీజలాల కేటాయింపులో తెలంగాణ కు బచావత్ ట్రిబ్యునల్‌లోనే అన్యాయం జరిగినందున, మొత్తం కృష్ణా జలాల విషయంలో మళ్లీ పంపకం జరపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు పరిమితం చేయకుండా, నదీ జలాల వివాదాల చట్టంలోని 3వ సెక్షన్ ప్రకారం విచారించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనూ (2014 జూలై 17న) ఇదే విజ్ఞప్తిని యూనిట్‌గా బేసిన్ చేశామని, ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో తాము ఈ డిమాండ్ చేస్తూ వచ్చామని కేంద్ర మంత్రి దృష్టికి కెసిఆర్ తీసుకొచ్చారు.

సీతారామ ప్రాజెక్టు కొత్తది కాదు – సిఎం : తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, దీన్ని పాత ప్రాజెక్టుగానే గుర్తించాలని, ఈ మేరకు కేంద్ర జల సంఘానికి ఆదేశాలు జారీచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. సమైక్య రాష్ట్రంలో 2005లోనే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇందిరాసాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ పేర్లతో గోదావరి నదిపై ప్రాజెక్టులు మంజూరయ్యాయని గడ్కరీకి గుర్తుచేశారు. 2007లోనే ఈ రెండు ప్రాజెక్టుల పని ప్రారంభమయిందన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికే ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ. 1,771.16 కోట్ల మేరకు ప్రభుత్వాలు ఖర్చు చేశాయన్నారు. ఇందిరాసాగర్ హెడ్ వర్క్ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో పాటు, వణ్యప్రాణుల అభయారణ్యానికి ఆటంకం కలుగకుండా తాము ప్రాజెక్టును రీడిజైన్ చేశామని సిఎం వివరించారు. అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా ఉండడం కోసం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను తెలంగాణ భూభాగానికి మార్చామని, వన్య ప్రాణులకు హాని కలుగకుండా అలైన్‌మెంట్ మార్చామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులను కలిపి, ఒకే ప్రాజెక్టుగా నిర్మిస్తున్నామని, దీనికి ‘సీతారామ’ అనే పేరు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు డిపిఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కూడా కేంద్ర జలసంఘానికి పంపామని, అనుమతుల కోసం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు పంపినట్లు తెలిసిందన్నారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఉంటుందని, సీతారామ ప్రాజెక్టు దాని పరిధిలోకి రాదని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్లే, పాత ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా మార్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పాత ప్రాజెక్టుగా పరిగణించినట్లే, సీతారామను కూడా పాత ప్రాజెక్టుగానే పరిగణించాలని సిఎం కోరారు.

చౌటుప్పల్ కంది రోడ్డును నోటిఫై చేయాలి : సంగారెడ్డినర్సాపూర్‌తూప్రాన్‌గజ్వేల్‌జగదేవ్‌పూర్‌భువనగిరిచౌటుప్పల్ మీదుగా వెళ్లే 154 కిలోమీటర్ల రహదారిని, చౌటుప్పల్‌యాచారంషాద్‌నగర్-చేవెళ్ల-శంకర్ పల్లి-కంది మీదుగా వెళ్లే 180 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు అంగీకరించినందుకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రహదారులు హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగు రోడ్డుగా మారుతున్నాయని వివరించారు. సంగారెడ్డిచౌటుప్పల్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరణ పనుల కోసం జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించారని, చౌటుప్పల్ కంది రోడ్డును ఇంకా నోటిఫై చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. 150 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డు నిర్మించడానికి రూ.11 వేల కోట్ల అంచనాతో తాము ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానికి అనుగుణంగానే నిధులు కేటాయించాలని సిఎం కోరారు.

జడ్చర్ల, మహబూబ్‌నగర్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు : జడ్చర్ల-మహబూబ్ నగర్ మధ్య ఉన్న167 నంబరు జాతీయ రహదారిలో 15 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డును నిర్మించాలని సిఎం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 2 వేల కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్ల రోడ్లుగా మార్చేందుకు ఎన్.హెచ్.ఎ.ఐకి అప్పగించారని, ఇందులో 1000 కిలోమీటర్లలో విస్తరణ జరిగిందని సిఎం వివరించారు. మరో 400 కిలోమీటర్లలో పని పురోగతిలో ఉందని, మిగిలిన 600 కిలోమీటర్ల పనులు టెండర్ దశలోనే ఉన్నాయని, ఈ రహదారులు బాగా పాడై పోయినందున మరమ్మత్తుల కోసం నిధులు ఇవ్వాలని సిఎం కోరారు. తెలంగాణ రాష్ట్ర పిడబ్ల్యుడి ద్వారా నిర్వహిస్తున్న జాతీయ రహదారుల అభివృద్ధికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.2,635 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,030 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కెసిఆర్ 2018-19ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 353 కోట్లకే అనుమతులకు పరిధి విధించారని పేర్కొన్నారు.

గెజిట్ నోటిఫికేషన్లలో జాప్యం : రాష్ట్రంలో పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కేంద్ర మంత్రికి సిఎం కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్, గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కావడంలో ఆలస్యం జరుగుతోందని కేంద్ర మంత్రికి వివరించారు. చౌటుప్పల్‌కందికి అలైన్మెంట్, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. మెదక్‌సిద్దిపేటఎల్కతుర్తి రోడ్డును నోటిఫై చేయాలన్నారు. కరీంనగర్-సిరిసిల్లపిట్ల రహదారికి అలైన్మెంట్, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందన్నారు. గౌరెల్లి-వలిగొండ-మహబూబాబాద్‌కొత్తగూడెం రహదారికి నోటిఫికేషన్ ఇవ్వాలని, మెదక్-రుద్రూర్ రహదారికి నోటిఫికేషన్ ఇవ్వాలని, బోదన్-బాసర-భైంసా రహదారికి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, దుద్దెడసిద్దిపేటసిరిసిల్ల రహదారికి అలైన్మెంట్ అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులను ‘గ్రీన్ హైవే’లుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. జాతీయ రహదారుల పక్కన మొక్కలు పెంచే బాధ్యత వర్క్ ఏజన్సీలు, నిర్వహణ సంస్థలదే అయినా, వారు సరిగా నిర్వహించడం లేదని సిఎం చెప్పారు.

Comments

comments