Home లైఫ్ స్టైల్ కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం

  • నేడు శ్రీకృష్ణాష్టమి

Shyam-Baba-Temple

ఎన్ని ఒడిదుడికులెదురైనా జీవితాన్ని ఒకే విధంగా తీసుకోవాలని చెప్పేది కృష్ణతత్వం. బాలగోపాలుడిగా వెన్న దొంగిలించినా, నా అనుకున్నవారిని తన చిటికెనవేలు ఆసరాగా గోవర్ధనగిరి ఎత్తి ఆదుకున్నాడు బాలకృష్ణుడు. బృందావనమాలిగా మురళీగానలోలునిగా పదహారువేలమంది గోపికలను ఆకర్షించి, రాసకేళితో మురిపించడం ఆ చిలిపి కృష్ణునికే చెల్లింది. నరునికి రథసారథ్యం వహించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన వాడు కృష్ణుడు. చేయాల్సిన పనిని చేసి ఫలితాన్ని నాకు వదలమని ధీమాగా చెప్పిన కృష్ణుని చేయూతను ఆలంబనగా అందుకోనిదెవరు? మానవజాతికి గుణపాఠాలు నేర్పినందుకే దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు భక్తిపూర్వకంగా ‘కృష్ణం వందే జగద్గురుం’ అని ఆరాధిస్తున్నారు. ఆ పరమాత్మునికి వాడవాడలా గుళ్ళుకట్టి ఆరాధించే మహాభాగ్యం మన భాగ్యనగరానికి అబ్బింది. ఈ కృష్ణాలయాల్లో మనకు తెలిసినవి కొన్నైతే తెలియనివి మరెన్నో..! కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాజధాని నగరంలో వెలిసిన కృష్ణమందిరాల గురించి తెలుసుకుందాం.
శ్యాం బాబా మందిరం, కాచిగూడ :
కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, అనంత సరస్వతి స్వాములు 1996 ఏప్రిల్ 22న ఈ మందిరాన్ని ప్రారంభించారు. కాచీగూడా రైల్వే స్టేషన్ దగ్గర కొండపై 30,000 చదరపు అడుగుల స్థలంలో మూడు అంతస్థులుగా ఈ సువిశాల మందిరాన్ని నిర్మించారు. ప్రఖ్యాత గణపతి స్థపతి ఈ మందిరానికి బ్లూప్రింట్ అందించారు. భీమునికు మనుమడు, ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు ఈ ఆలయంలో విగ్రహరూపంలో పూజలందు కుంటున్నాడు. బర్బరీకునికి ఇంకెక్కడా ఆలయం లేకపోవడంతో ఇది అరుదైన ఆలయంగా చరిత్రకెక్కింది. భవానీ మాత దయతో మూడు దివ్య అస్త్రాలను అందుకున్న బరరీకుడు బలహీన పక్షాన నిలబడి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తన మనసులో మాట కృష్ణుడికి చెబితే నీ కన్నా బలవంతుడైన వీరుని సంహరించమని సలహా ఇస్తాడు. ఎంత ఆలోచించినా ఇంకెవ్వరూ కనిపించకపోవడంతో బర్బరీకుడు తన తలను నరికి కృష్ణునికి అందిస్తాడు. అలా అంతమయిన బర్బరీకుడు కలియుగంలో శ్యాం బాబాగా అవతరించాడు. శ్యాం బాబా మందిర్ రాజస్తాన్‌లోని ఖాతు ఖాతాంక్‌లో ఉంది. ఆ తర్వాత ఒక్క మన హైదరాబాద్‌లోని కాచిగూడాలోనే కనబడుతుంది. ఈ విధంగా శ్యాంబాబా ఆలయం అరుదైన ఆలయంగా ఖ్యాతి గడించింది.
జగన్నాథ మందిరం -బంజారాహిల్స్:
ఒరిస్సాలోని జగన్నాథ ఆలయానికి నమూనాగా బంజారాహిల్స్‌లో వెలసిన మందిరం జగన్నాథ మందిరం. పూరి జగన్నాథునికి రథోతవమైన రోజునే ఇక్కడా స్వామివారికి భారీ రథోత్సవం జరుగుతుంది. అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్, సికింద్రాబాద్ ఇస్కాన్ మందిరం, అంబర్‌పేట గురువాయూర్ అప్ప మందిరం, బోల్లారంలో సంతాన గోపాలస్వామి మందిరం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి.
ఇవిగాక..
బంజారాహిల్స్ ఎన్‌బిటి నగర్‌లోని పురాతన కృష్ణమందిరం సికింద్రాబాద్ పాన్ బజార్‌లో గల కృష్ణమందిరం-, లాల్ బజార్ కృష్ణమందిరం, జియాగూడలోని రంగనాథ మందిరం, మణికొండలోని వేణుగోపాల ఆలయం, నానక్‌రాంగూడలోని రంగనాథ ఆలయం, కొండాపూర్‌లోని భాగ్యనగర్ శ్రీ కృష్ణ మందిరం, మెహదీపట్నం మిలిటరీ ఏరియాలో కొలువుదీరిన వేణుగోపాల స్వామి మందిరం, ఆసిఫ్ నగర్‌లోని ఆళ్లబండ నారాయణ్ టెంపుల్, రెడ్ హిల్స్ కృష్ణ మందిరం, బేగంపేట స్ట్రీట్ నెంబర్ ౩లోని రాధాకృష్ణ మందిరం పండుగ దినాలలో కన్నుల పండుగగా అమిత కోలాహలంగా ఉండి భక్తులు సందడి చేస్తుంటారు. నగరానికి చేరువలో ఏదులాబాద్‌లో ఆండాళమ్మ సన్నిధి పక్కనే ఒక కృష్ణమందిరం ఉంది. ఉప్పల్‌లోనూ ఒక కృష్ణభగవానుని మందిరం ఉంది. ఇలా నగరం ఏ మూలకు వెళ్ళినా కృష్ణమందిరాలు దర్శనమిస్తుంటాయి.