Home గాసిప్స్ తల్లిదండ్రుల మాట వినే మంచి కూతురిని

తల్లిదండ్రుల మాట వినే మంచి కూతురిని

Kriti-Sanon

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కృతిసనన్. ఆతర్వాత తెలుగులో దోచెయ్ సినిమా చేసిన ఈ బ్యూటీ హిందీలో తన తొలి చిత్రం ‘హీరోపంతి’తో మంచి హిట్ కొట్టింది. ఆతర్వాత షారుఖ్‌తో ‘దిల్‌వాలే’ చిత్రంలో నటించిన ఈ భామ బాలీవుడ్‌లో వరుసగా మంచి అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాబ్తా, బరేలీకీ బర్ఫీ చిత్రాల్లో నటిస్తోంది. అందాల తారగా దూసుకుపోతున్న కృతిసనన్ తన జీవితం, కెరీర్ విశేషాలను తెలియజేస్తూ…

మోడలింగ్‌తో గ్లామర్ రంగంలోకి…
కాలేజీలో చదువుకునేటప్పుడు చాలామంది నన్ను మోడలింగ్ చేయమని చెప్పారు. దాంతో మోడలింగ్ చేస్తూ దాన్ని హాబీగా మార్చుకున్నాను. చదువుతూనే మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. టివి కమర్షియల్స్‌లో చేసే అవకాశాలు బోలెడు వచ్చేవి. మోడలింగ్ హాబీ అయినప్పటికీ ఆ రంగానికి సంబంధించిన కెరీర్ కోసం ఎవర్ని సంప్రదించాలో, పోర్ట్‌ఫోలియో ఫొటోలు ఎలా ఉండాలో తెలిసేది కాదు.

దబు రత్నాని పోటీలో విజయం సాధించా…
పోర్ట్‌ఫోలియో ఫొటోలను ప్రముఖ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ దబురత్నాని బాగా తీస్తారని తెలిసింది. ఒక పోటీలో పాల్గొంటే దబురత్నాని పోర్ట్‌ఫోలియోలు ఉచితంగా తీస్తారు. ఆ పోటీలో పాల్గొని విజయం సాధిస్తే మాత్రం చాలా ఎక్కువ మొత్తాన్ని బహుమతిగా ఇస్తారు. దాంతో పాటు రెండేళ్ల మోడలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది. నేను మాత్రం ఇంట్లోనే ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసి ఆ పోటీలో విజయం సాధించాను. అలా నా మోడలింగ్ కెరీర్‌కు అడుగుపడింది. ఒకవేళ ఇది వర్కవుట్ కాకపోయి ఉంటే టివి కమర్షియల్స్‌కు ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. ఇక టివి ప్రకటనల అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చాయి. వాటిల్లో చేసే వరకు ‘నేను నటించగలను’ అనే విషయం నాకు తెలియలేదు.

ఆత్మవిశ్వాసం గల యువతిగా…
మొదటి నుంచి బాగా చదువుకునేదాన్ని. తల్లిదండ్రుల మాటవినే మంచి కూతుర్ని నేను. చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే మా అమ్మ దుపట్టాలో ముఖాన్ని దాచుకునేంత సిగ్గరిని. ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. పనిచేయడం మొదలుపెట్టాక నాలో చాలా రకాలుగా మార్పు వచ్చింది. ఆత్మవిశ్వాసం గల యువతిగా తయారయ్యాను. ఇంతకుముందులాగా ఇప్పుడు అంతర్ముఖురాలిగా ఉండడం లేదు.