Home తాజా వార్తలు చంద్రబాబుకు ఓటమి వణుకు

చంద్రబాబుకు ఓటమి వణుకు

KTR And CBN2014లో ఇవిఎంలతో గెలిచి ఇప్పుడు వాటిని ప్రశ్నించడమేమిటి?
బాబు పనైపోయిందని టిడిపి కార్యకర్తలే అంటున్నారు
ఢిల్లీలో వీధినాటకాలాడుతున్నాడు
అవినీతికి ఆస్కారం లేకుండా సంస్కరణలు తీసుకువస్తాం
లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం 16 సీట్లు గెలుస్తాం
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే, ఎన్నికల విధానంలో మార్పు రావాలి
విలేఖరులతో ఇష్టాగోష్టిలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవిఎంల పని తీరును ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రవర్తనలో ఓటమి స్పష్ట ంగా కనిపిస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఇవిఎంలతో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం వాటిని ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీకి ప్రజాతీర్పు ఏ రూపంలో ఉంటే ఏం టని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తానే భారతదేశానికి తెచ్చిన అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వాళ్లు గెలిస్తేనేమో సాంకేతిక పరిజ్ఞానం బాగుంది, ఓడిపోతనేమో బాగలేదు అని చెప్పడం ఏం పద్దతి అని పేర్కొన్నారు.

వంగి వంగి దండా లు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని అందరికీ అర్థమైందని అన్నారు. చంద్రబాబు పనైపోయిందని టిడిపి కార్యకర్తలే అనుకుంటున్నారని చె ప్పారు. ఒకవైపు అన్నీ అనుకూలంగా ఉన్నా యి తామే గెలుస్తామంటున్న చంద్రబాబు, ఢిల్లీ వీధుల్లో వీధి నాటకాలు ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. అధికారులను మారిస్తే చంద్రబాబుకు వచ్చే ఇబ్బంది ఏంటని అడిగారు. కెసిఆర్, జగన్ ఇద్దరూ మోడీ పెంపుడు కుక్కలు అంటూ చంద్రబాబు తిట్టడం ఎంతవరకు సమంజసమని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా చంద్రబాబును తిట్టాలంటే తిట్టగలుగుతామని, అలా తిట్టడం సంస్కారం కాదని భావించామని చెప్పారు. మోడీతో నాలుగేళ్లు కలిసి ఉన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటే మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలిస్తే, తెలంగాణలో టిఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు. ఇవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉంటే నాలుగు రాష్ట్రాలలో ఫలితాలు అలా ఎలా వస్తాయని ప్రశ్నించారు.

నిజంగా చంద్రబాబు నాయుడు వాదనలో విశ్వసనీయత ఉంటే ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుందని అన్నారు. రాజకీయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ పార్టీలు ప్రజల తిరస్కారానికి కూడా సిద్దమై ఉండాలని పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దని, ప్రజాస్వామ్యంలో ఆ హుందాతనం ఉండాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికలు తెలంగాణ, ఎపి రాష్ట్రాలలో పరిస్థితికి అద్దం పట్టాయన్నారు. మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే చార్మినార్ దగ్గర పిల్లలు ప్రశాంతంగా క్రికెట్ ఆడుకున్నారని చెప్పారు. అదే ఎపి ఎన్నికలు హత్యలు, ఆందోళనలతో అట్టుడికాయని చెప్పారు.

మెజారిటీలో మెదక్‌కే మొదటిస్థానం

లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం టిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో 16 ఎంపీ సీట్లను గెలుస్తోందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు సిఎం కెసిఆర్‌కు పట్టం గట్టారో పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ పెద్దగా మార్పు జరగకపోగా, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఆచరణ కూడా ప్రారంభమైందని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. వంద శాతం తాము అనుకున్నట్టుగానే ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మెజారిటీలో మెదక్ మొదటి స్థానంలో గెలిస్తే, వరంగల్ రెండవ స్థానంలో, కరీంనగర్ మూడు లేదా నాలుగవ స్థానంలో నిలుస్తాయన్నారు. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజపరచడానికే మెదక్ కంటే కరీంనగర్‌లో మెజారిటీ సాధిస్తామని తాను సరదాగా ఛాలెంజ్ విసిరానని చెప్పారు.

మెదక్‌లో ప్రతిపక్ష నేత అసలు ప్రచారం నిర్వహించలేదని, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ మెజారిటీ వస్తుందని తెలిపారు. ఎన్నికలు జరిగిన రోజు ప్రాథమికమైన పోలింగ్ శాతాన్ని మాత్రమే వెల్లడిస్తుందని ఆ తర్వాత రోజే ఖచ్చితమైన పోలింగ్ శాత వివరాలు తెలుస్తాయని ఎన్నికల కమిషన్ వెల్లడిస్తుందని తెలిపారు.

రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత

జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలు విముఖత చెందారని అన్నారు.ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. మరో ఐదు స్థానాల్లో హస్తం పార్టీ మూడవ స్థానానికే పరిమితం అవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలలో కాంగ్రెస్ నేతలే బిజెపికి ఓట్లు వేయించారని చెప్పారు. మెదక్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా డిపాజిట్ కోల్పోతుందన్నారు. బిజెపి సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను కూడా ఆ పార్టీ కోల్పోక తప్పదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ఈ సారి ఒక్క సీటు కూడా రాదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బిజెపి పార్టీ నాయకులు తమ పార్టీని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం బిజెపి ఆదరించే అవకాశం లేదని చెప్పారు. ఇక్కడ తిరుగుబాటు ఉంటుందని, ఛాందసవాదానికి అవకాశం ఉంటుందని ఉండదని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఖాయం

కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ 16 సీట్లు గెలిచి, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తమకు నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారరు. మే 23 తర్వాత కేంద్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి..? రాష్ట్రాల పట్ల ఆ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటాయో గమనించిన తర్వాత రాష్ట్రంలో ఏమైనా సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటే సవరించుకుంటామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులకు మన ప్రాధాన్యత రంగాలకు ఎలా జోడించుకోవాలో ఆలోచిస్తామని చెప్పారు.అందుకే తమ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు.

ఉన్నతమైన విధానాలు తీసుకువస్తాం

మంచి పథకాలను తీసుకురావటం కంటే, ఉన్నతమైన విధానాలకు రూపకల్పన చేసినప్పుడే అభివృద్ధి వేగంగా సాగుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అవినీతి లేని సమాజం కోసం త్వరలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా చర్యలు సాగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నాటికి కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానంగా లంచాలు, అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. మార్పు అనేది చాలా సహజమైన విషయమని, కాలానుగుణంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే కొత్త రెవిన్యూ చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పారు.

రెవిన్యూ శాఖలో సింహభాగం ఉద్యోగులు మంచివారేనని, కొంతమంది వల్లనే ఆ శాఖ ఉద్యోగులు అపవాదులు ఎదుర్కోవాల్సిన వస్తుందని చెప్పారు. కొంతమంది ఉద్యోగుల వల్ల అందరూ అపవాదులు ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వంగా తాము కూడా ఎందుకు అపవాదులు ఎదుర్కోవాలని, అందుకే ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందని అన్నారు. రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయడం కోసమే కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. అవినీతి, లంచాలకు తావు లేకుండా సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు. పారదర్శక పాలనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తాయని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాహుల్‌గాంధీ దక్షిణాదిన పోటీ చేసినా ప్రభావం ఉండదు

దక్షిణాదిన రాహుల్ గాంధీ పోటీ చేసినా పెద్దగా ప్రభావం ఉండదని కెటిఆర్ చెప్పారు. ప్రజల్లో విశ్వసనీయత ఉండి, నాయకత్వం పట్ల విశ్వాసం ఉంటే ఎక్కడి నుంచి పోటీ చేసినా నాయకులు గెలుస్తారని అన్నారు. తమ నాయకుడు కెసిఆర్ గతంలో చాలా ప్రాంతాల నుంచి పోటీ చేసినా గెలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడూ కుప్పం దాటలేదని, అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఎప్పుడూ పులివెందుల దాటి పోటీ చేయలేదని వ్యాఖ్యానించారు.

బిజెపి నేతలకు ఒకేసారి రూ.8 కోట్లు ఎలా ఇస్తారు..?

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో బిజెపి నేతలు తరలిస్తున్న రూ.8 కోట్లకు క్లీన్ చిట్ ఇవ్వటంపై కెటిఆర్ స్పందించారు. సెల్ఫ్ చెక్ మీద ఇంత పెద్ద మొత్తం బ్యాంకులు ఎలా మంజూరు చేశాయని ప్రశ్నించారు. బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా, ఎన్నికల నియమాళికి విరుద్దంగా బిజెపి నేతలు బ్యాంకు నుంచి ఒకే సారి రూ.8 కోట్లు డ్రా చేశారని అన్నారు. ఒక్క రోజులోనే ఆ సంఘటనపై ఎన్నికల కమిషన్ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు హైకోర్టులో కేసు వేశారని తెలిపారు.

ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరం

మనదేశంలో ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికి కచ్చితంగా ఓటు హక్కు ఉండాలని అన్నారు. పౌరుల ఓట్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది ఓట్లు గల్లంతు అవుతుండగా, మరికొందరు మూడు, నాలుగు చోట్ల ఓట్లు ఉంటున్నాయని అన్నారు. ఆధార్ కార్డుతో లేదా పాస్‌పోర్టుతో అనుసంధానం చేసి ఒకరికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓట్లు తొలగించడం వల్ల తమ అభ్యర్థుల మెజారిటీలు తగ్గాయని అన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేలా రాజకీయ పార్టీలు కూడా కృషి చేయాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని గుర్తు చేశారు. ఓట్ల తొలగింపు పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని, పౌరుల ఓట్లు గల్లంతు కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.

మే 23 తర్వాత పాలనపై దృష్టి

మే 23 లోపల పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే ఒక్క జిహెచ్‌ఎంసి మినహా రాష్ట్రంలో దాదాపు రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికల పూర్తయినట్లే అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. మరో నాలుగున్న సంవత్సరాల పాటు అవరోధం లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పై దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ పరంగా తాము అన్ని స్థాయిలలో కమటీలను నియమిస్తూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.

పార్టీని బలోపేతం చేయడం, జిల్లాల్లో పార్టీ కార్యలయాల నిర్మాణంపై దృష్టి పెడతామని కెటిఆర్ అన్నారు. పరిషత్ ఎన్నికల దృష్టా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో బిజిగా ఉంటారు కాబట్టి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నిర్వహిస్తామని కెటిఆర్ చెప్పారు.

KTR Criticises Chandrababu Over EVM Issues