Home తాజా వార్తలు జవాన్ల త్యాగాలు సాటిలేనివి

జవాన్ల త్యాగాలు సాటిలేనివి

KTR donates 50 lakhs to the Martyrs families

 

ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాల సంక్షేమానికి కెటిఆర్
రూ. 25 లక్షలు, ఆయన స్నేహితులు
రూ. 25 లక్షలు విరాళం

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ భద్రత కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న జవాన్ల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సైనికులు అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిరంతరం దేశాన్ని కాపాడుతూ ఉన్నారని, వారి కృషి కారణంగానే ప్రజలు సంతోషంగా జీవించగలుగుతున్నారని అన్నారు. ఉగ్రదాడిలో పుల్వామాలో మృతిచెందిన జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం భారత పౌరుడిగా తాను రూ. 25 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించి నగరంలోని సిఆర్‌పిఎఫ్ ఐజిగా ఉన్న జెబి రాజుకు చెక్కు రూపంలో అందజేశారు. తాను విరాళం ఇస్తున్నట్లుగా స్నేహితులకు చెప్పడంతోనే ముగ్గురు సిద్ధమై తలా కొంత చొప్పున మరో రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల స్మారకార్థం హైదరాబాద్‌లోని దక్షిణ సెక్టార్ సిఆర్‌పిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాల వేసిన కెటిఆర్ నివాళులు అర్పించారు.

తాను ఒక ప్రజా ప్రతినిధిగానో లేక రాజకీయ నాయకుడిగానో కాకుండా ఒక భారతదేశ పౌరుడిగా సిఆర్‌పిఎఫ్ కుటుంబాల సంక్షేమం కోసం రూ. 25లక్షలు, స్నేహితుల ద్వారా మరో రూ. 25 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్ ఐజికి చెక్కును అందజేసిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ వీరుల త్యాగాలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. భద్రతా బలగాల సేవలతోనే దేశంలో పౌరులందరూ సురక్షితంగా జీవించగలుగుతున్నారని అన్నారు. అమర జవాన్ల త్యాగం తన గుండెల్లో నిలిచిపోయిందని అన్నారు. మృతి చెందిన వీర జవాన్ల ఆత్మశాంతికి మౌనం పాటించి నివాళులర్పించి, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం ప్రజలంతా స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. త్యాగాలు చేసిన జవాన్ల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉండకుండా వారి సంక్షేమానికి దేశ పౌరుడిగానే స్పందించి తన సొంత డబ్బులను విరాళంగా ఇచ్చినట్లు కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన స్థానిక సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో సమావేశమై వారి విధులు, భద్రతాచర్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

KTR donates 50 lakhs to the Martyrs families