Home తీర్పు-2018 గడ్డం పెంచుకుంటే గబ్బర్‌సింగ్ కాదు

గడ్డం పెంచుకుంటే గబ్బర్‌సింగ్ కాదు

KTR Election Campaignముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం: రోడ్ షోలో మంత్రి కెటిఆర్

ముషీరాబాద్: గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్‌లు కారని, సింహం సింగల్‌గానే వస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం పెంచుకుంటే మనకేమి, తీసుకుంటే మనకేమని ఆయన ఎద్దెవా చేశారు. మంగళవారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, భోలక్‌పూర్, కవాడిగూడ ఎల్‌ఐసి బ్రిడ్జి తదితర చౌరస్తాల్లో మంత్రి కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ముషీరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌తో కలిసి కెటిఆర్ ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలిపిస్తే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.

నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య ఉన్నందున ఇందిరాపార్కు చౌరస్తా నుంచి వీఎస్టీ వరకు రూ. 470 కోట్ల సీట్లు వంతెనలు, ప్లైఓవర్‌ల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. సర్వే నెంబర్ 180లో నివాస స్థలాలను క్రమబద్దీకరిస్తామన్నారు. ముషీరాబాద్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన లక్ష్మణ్ అభివృద్ధి, ప్రజా సమస్యలను విస్మరించారని ఆరోపించారు. ముషీరాబాద్ అభివృద్ధి కోసం లక్ష్మణ్ ఏం చేశారంటే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బిజెపి వాళ్లంటేనే అబద్దాలని, రాజకీయ స్వార్థం కోసం బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ ప్రధానిచే అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా గెలిచే పరిస్థితి లేక నాలుగు పార్టీల కండువాలు వేసుకుని తిరుగుతున్నారని కెటిఆర్ విమర్శించారు.

అభివృద్ధి నిరోధకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పి టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌ను అసెంబ్లీ పంపిస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలవడం ఖాయమన్నారు. బిజెపి లక్ష్మణ్‌ను ఢిల్లీకి పంపిద్దామన్నారు. కాంగ్రెస్ పరిస్థితి సరిగ్గాలేదని విమర్శించారు. ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్, బిజెపి మధ్యే పోటి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ముఠా జయసింహా, హరిబాబుతో పాటు తదితర నేతలు పాల్గొన్నారు.

భారీ సంఖ్యలో తరలివచ్చిన గులాబి శ్రేణులు…
ముషీరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా మంత్రి కెటిఆర్ మంగళవారం రాత్రి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోతో గులాబి శ్రేణుల్లో జోష్ వచ్చింది. రాంనగర్ చౌరస్తా, భోలక్‌పూర్, కవాడిగూడ డివిజన్లలో జరిగిన రోడ్ షోలకు నియోజకవర్గంలోని గులాబి శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాంనగర్ చౌరస్తాలో అయితే మూడు దారులు పూర్తిగా కార్యకర్తలతో నిండిపోయాయి. ఆ ప్రాంతమంతా గులాబి గళం మారుమ్రోగింది.

KTR Election Campaign in Musheerabad Constituency