Home తాజా వార్తలు తోడుదొంగలు ఒక్కటయ్యారు

తోడుదొంగలు ఒక్కటయ్యారు

కామారెడ్డి నేతల చేరిక సందర్భంగా కెటిఆర్ ఫైర్
గత పాలనలో నిలువునా దోచుకున్నారు
కాంగ్రెస్, టిడిపిలకు ప్రజలే బుద్ధి చెబుతారు

KTR

హైదరాబాద్ : కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ధ్యేయంతో సిఎం కెసిఆర్ కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం దానిని అడ్డుకుంటోందని ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కామారెడ్డికి నియోజకవర్గానికి చెందిన నలుగురు బిజెపి కౌన్సిలర్లు, 350 మంది బిజెపి కార్యకర్తలు మంత్రి కెటిఆర్ సమక్షంలో బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫ లం అయిన కాంగ్రెస్, రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపును ఆపలేదని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీళ్లతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కరువును పారదోలడానికి సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారని దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 186 రకాల వివిధ రకాల కేసులను వేసిందన్నారు. దీంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా తెలంగాణ ప్రగతిని ఆపుతున్న ప్రతిపక్షాలు కావాలో, అన్ని విధాలుగా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సిఎం నాయకత్వం కావాలో రానున్న ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉద్యమం చేస్తుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు పదవులు అనుభవిస్తూ కాలం గడిపారన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఆగకూడదని ఎన్నికలకు వెళుతున్నామని ఎవరూ అధికారం వదులుకొని ముందుకు వెళ్లరని…అయినా తాము వెళ్లామన్నారు. తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందన్నా రు. కాంగ్రెస్ పార్టీకి కాసులు, కమీషన్లు తప్పించి తెలంగాణ ప్రజల ఉద్యమం ఏనాడు వారికి పట్టలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆపుతున్నందుకే ప్రజల తీర్పును కోరుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రైతుబంధు సిఎం కెసిఆర్ ఒకవైపు ఉన్నారని, మరోవైపు బషీరాబాగ్, ముదిగొండ కాల్పుల్లో రైతులను చంపిన రాబందు లాంటి ప్రతిపక్షాలు మరో దిక్కున ఉన్నాయన్నారు. కరెంట్ కోతల కాంగ్రెస్ ఒకవైపు 24 గంటల టిఆర్‌ఎస్ మరోవైపు ఉందన్నారు. కచ్చితంగా ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ వణుకుతుందన్నారు. గత పాలనలో ప్రజలను దోచుకున్న తోడుదొంగలు ఇప్పుడు ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిపక్ష పార్టీలకు సైతం నిధులు సమంగా ఇచ్చామని కానీ కాంగ్రెస్ హాయాంలో తమకు నిధులు ఇవ్వలేదన్నారు. ఇందుకోసం లేని పేర్లతో చివరకు చనిపోయిన వ్యక్తుల పేరుతోనే కేసులు వేసి తెలంగాణ ప్రజల జీవ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందన్నారు.
దొంగ పనులు చేయడంలో కాంగ్రెస్ నెం1
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు పడితే ప్రతిపక్షాల కిందకు నీళ్లు వస్తాయని తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని ఆయన విమర్శించారు. నీతి కలిగిన ప్రతిపక్షం అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఒక్కసారైనా మద్ధతు పలికితే బాగుండేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. దొంగ పనులు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన వారు లేరన్నారు. గత ఎన్నికల్లో సొంత కారులోనే రెండున్నర కోట్లు తగులబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని, ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆయన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
సంగారెడ్డిలో నీచమైన పనులు చేసి భార్యా, పిల్లల అక్రమ రవాణా చేసిన వారిని సైతం సమర్థిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీదన్నారు. చేయాల్సిన దొంగ పనులు చేసి ఈరోజు గురువింద సామెతను తలపిస్తూ నీతులు చెబుతున్నారన్నారు. ఎలాంటి కార్యకలాపాలు చేసినా అరెస్టు చేయరాదని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ కనీసం తమ పార్టీ సభ్యుడు తప్పు చేయలేదు అనే విషయాన్ని ప్రజలకు ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉందన్నారు. గంప గోవర్థన్‌ను తిరిగి గెలిపించుకుంటే సిరిసిల్లలో అభివృద్ధి చేసిన తీరును కామారెడ్డి నియోజకవర్గంలో చేసి తీరుతామని మంత్రి హామినిచ్చారు. టిఆర్‌ఎస్ పార్టీలో పలువురు చేరడం వలన బిజెపి కామారెడ్డిలో బలహీనం అయ్యిందన్నారు. సిఎం తిరిగి అధికారంలోకి వస్తే కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయని, కామారెడ్డి నియోజకవర్గంతో సిఎం కెసిఆర్‌కు వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు.