Friday, March 29, 2024

నెలాఖరులోగా సభ్యత్వ నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే సభ్యత్వ నమోదులో వెనుకబడ్డ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కెటిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లోని క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం, హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు తదితర అంశాలపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో పలు అంశాలను కెటిఆర్ చర్చించినట్టుగా తెలిసింది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాలపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కెటిఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. అయితే ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కొన్ని జిల్లాలో వెనుకబడిన నేపథ్యంలో గతంలో వారికి అవకాశం ఇచ్చినా సరిగ్గా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించలేదని కెటిఆర్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వారిపై టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సీరియస్ అయినట్టుగా సమాచారం. అందులో భాగంగా ఈనెల 31వ తేదీలోగా టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని మంత్రి కెటిఆర్ వారికి సూచించినట్టుగా తెలిసింది.
నియోజకవర్గాల వారీగా సమీక్ష
ఈ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వ నమోదుపై కెటిఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షించినట్టుగా తెలిసింది. టిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి అధిక సంఖ్యలో యువత రావడంపై కెటిఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. హైదరాబాద్ పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం కష్టపడితే మరింతగా పార్టీ సభ్యత్వం పెరిగే అవకాశం ఉందని స్థానిక ఇన్‌చార్జీలతో కెటిఆర్ పేర్కొన్నట్టుగా తెలిసింది. కార్యకర్తల ప్రమాద బీమా ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఆగస్టు 1 నుంచి కొత్త సభ్యత్వాల ప్రకారం బీమా కల్పించాలని సమావేశంలో కెటిఆర్ నిర్ణయించినట్టుగా సమాచారం. ఆగస్టు 1న బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించేలా కార్యచరణ రూపొందించాలని, ఇప్పటి వరకు సమారు 50వేల సభ్యత్వాల డిజిటలీకరణ పూర్తయిందని ఈనెలాఖరు లోపు మిగతావి పూర్తి చేయాలని కెటిఆర్ స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఆగస్టు 1న మరోసారి సమావేశం నిర్వహించు కుందామని, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు, జిల్లా కార్యాలయాల నిర్మాణంపై తదితర అంశాలపై ఆరోజున సమగ్రంగా చర్చించుకోవచ్చునని ప్రధాన కార్యదర్శులకు కెటిఆర్ సూచించినట్టుగా సమాచారం.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కార్యదర్శుల నుంచి సంజాయిషీ
హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా జూరాబాద్ ఉపఎన్నికపై వ్యూహారచన, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు కెటిఆర్ సూచించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలు, నియోజకవర్గంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, స్థానికులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తుండగా ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులకు ఉపఎన్నిక బాధ్యతలు అప్పగింతపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కార్యదర్శుల నుంచి కెటిఆర్ సంజాయిషీ కోరనున్నట్లు సమాచారం.

KTR meeting with TRS State General Secretaries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News