Home తాజా వార్తలు ఎన్‌టిఆర్ పేరు నిలబెడతాను.. చెడగొట్టను

ఎన్‌టిఆర్ పేరు నిలబెడతాను.. చెడగొట్టను

ktr

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బిఎంటి యూనిట్‌ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
ప్రపంచస్థాయి ప్రమాణాలతో చికిత్స : బాలకృష్ణ

మన తెలంగాణ/ సిటీబ్యూరో : ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి క్యాన్సర్‌పై పోరా టం చేయాలని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బోన్ మ్యారో
ట్రాన్స్‌ప్లాంట్ (బిఎంటి) యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎపి ఎమ్మెల్యే, సినీనటుడు, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణతో కలిసి బిఎంటి యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు తారకరామారావు పెట్టడం సంతోషంగా ఉందని, ఆ పేరు నిలబెట్టే పని చేస్తాననీ.. చెడగొట్టే పని మాత్రం చేయనని మంత్రి తెలిపారు. బసవతారకం ట్రస్ట్‌కు ముఖ్యమంత్రి పన్ను మినహాయింపు ఇవ్వటంతో ఎంతో మందికి లాభం కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసిఆర్ ఆదేశించారన్నారు. బసవతారకం ఆసుపత్రి పన్ను రద్దు చేయాలని పదేళ్లలో ముగ్గురు సీఎంలను అడిగినా చేయలేదని, సీఎం కేసిఆర్ పన్ను రద్దు చేశారని మంతి పేర్కొన్నారు. బసవతారకం హాస్పిటల్ బయట షెల్టర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని షెడ్డులను ఏర్పాటు చేస్తామన్నారు. అవగాహనతోనే క్యాన్సర్‌ని నిర్మూలించవచ్చని, సెలబ్రెటీలు కూడా స్వచ్ఛందంగా ముందికి వచ్చి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి కానీ.. ఆసుపత్రి అభివృద్ధికి ఏదైనా చేయాలని తనతో చెప్పేదని ఆయన వెల్లడించారు. ఇండియాకు వచ్చిన తరువాత బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి మా అమ్మ వందసార్లు అయినా చెప్పి ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బసవతారకం ఆసుపత్రి చైర్మన్, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌కు చికిత్సను అందిస్తున్నామన్నారు. మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా బీఎంటీ యూనిట్‌ను ప్రారంభించడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. 40బెడ్లతో ప్రారంభమైన ఆస్పత్రి.. నేడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌కు చికిత్సను అందిస్తున్నదంటే డాక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు.