Home స్పెషల్ ఆర్టికల్స్ చిన్నారి దివ్యకు అన్నలా మారిన కెటిఆర్

చిన్నారి దివ్యకు అన్నలా మారిన కెటిఆర్

KTR Rakhi Celebrations with Disabled Girl

రాఖీ కట్టాలన్న కోరికను నెరవేర్చిన మంత్రి
బహుమతిగా ఆమె తండ్రికి సొంత ఆటోను సమకూర్చుతానని హామీ
మంత్రి ఉదారతకు ఉప్పొంగిపోయిన దివ్య కుటుంబం

హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఒక చిన్నారికి అన్నగా మారి రాఖీ పండుగను బహుమతి ఇచ్చారు. గత  ఏప్రిల్ నెలలో కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన తొమ్మిది సంవత్సరాల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయి ఆటోను నడుపుకునే దివ్య తండ్రి, చికిత్సకు అవసరమైన డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో  ఉన్న విషయాన్ని కూకట్‌పల్లి టిఆర్‌ఎస్ యువజన నాయకుడు జగన్మోగన్‌రావు మంత్రి కెటిఆర్‌కు  ట్విట్టర్ ద్వారా తెలిపారు. అప్పుడు వెంటనే స్పందించిన మంత్రి, నిమ్స్ వైద్యాధికారులతో మాట్లాడి దివ్యకు అవసరమైన పూర్తి చికిత్స అందించాల్సిందిగా కోరారు. మంత్రి సహాయంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే తన ఎడమకాలిని ప్రమాదంలో పొగొట్టుకుంది. ఆపద సమయంలలో అన్నలా ఆదుకున్న మంత్రి కెటిఆర్‌కు రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షను దివ్య వెలిబుచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న కెటిఆర్ తన స్వగృహానికి ఆహ్వానించి ఆదివారం దివ్యతో రాఖీ కట్టించుకున్నారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడిన మంత్రి, ఈ రోజు తనతో రాఖీ కట్టించుకోవడం పట్ల దివ్య సంతోషం వ్యక్తం చేశారు. దివ్యకు ఏం కావాలని మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అవసరమైన కృత్రిమ అవయవాన్ని అందించడంతో పాటు ఇంకేదైనా ఇవ్వలన్న తన ఆకాంక్షను మంత్రి వెలిబుచ్చారు. తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అని, తనకు ఇంకేమి వద్దని మంత్రికి దివ్య తెలిపింది. దివ్య తండ్రి కిరాయి ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి త్వరలోనే ఆయనకు ఒక కొత్త ఆటోను రాఖీ పూర్ణిమ బహుమతిగా దివ్య తరపున అందిస్తామని హామి ఇచ్చారు. కూతురు ప్రాణాలు కాపాడడంతో పాటు కుటుంబ జీవనానికి ఇప్పుడు ఆటోను అందిస్తానన్న మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని దివ్య కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.