Search
Wednesday 21 November 2018
  • :
  • :

బిజెపి అడ్రసుండదు

KTR speech against BJP party in Rajanna Siricilla

70 గెలుస్తామంటున్న బిజెపికి అంతమంది అభ్యర్థులే కరువు
100 స్థానాల్లో దాని డిపాజిట్లు గల్లంతు ఖాయం
సిరిసిల్ల షుక్రియా ఆదా సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / సిరిసిల్ల : వచ్చే శాసనసభలో బిజెపి ఆనవాళ్లే కనిపించనీయమని, 119 శాసనసభా స్థానాల్లో వంద సీట్లలో బిజెపి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ ముస్లింల షుక్రియా ఆదా ( ఆశీర్వాద సభ ) లో మంత్రి కెటిఆర్ పూర్తిగా ఉర్దూలోనే మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రాష్ట్రంలోకి వచ్చి తెరాసను ఓడిస్తామని అంటూ పగటి కలలు కంటున్నారన్నారు. స్వామి పరిపూర్ణానంద బిజెపి నేత అవతారమెత్తి రాష్ట్రంలో 70 సీట్లు గెలుస్తామంటున్నారని, 70 సీట్లలో అభ్యర్థులే లేరని ఆయన అన్నారు. బిజెపితో టిఆర్‌ఎస్‌కు ఏనాడూ పొత్తు లేదన్నారు. ఇకముందు కూడా ఉండదన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు బిజెపితో పొత్తు పెట్టుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు కలిశాడని అన్నారు. బిజెపికి ప్రస్తుత శాసనసభలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని వారందరూ కూడా ఓడిపోతారని వచ్చే శాసనసభలో బిజెపి ఆనవాళ్లే ఉండవన్నారు.

వాట్సాప్‌లలో ప్రతిపక్షాలు కెసిఆర్ బిజెపితో మిలాఖత్ అయ్యాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని, కెసిఆర్ అసలైన సెక్యులర్‌వాది అని అన్నారు. గతంలో అన్ని పార్టీలు ముస్లింలను ఓటుబ్యాంకుగా చూసేవారన్నారు. సీఎం కెసిఆర్ మాత్రం వారిని మనుషులుగా గుర్తించి పేదవారికి మద్దతు పలికి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపిలు 2004 నుండి 2014వ సంవత్సరం వరకు మైనార్టీల సంక్షేమం కోసం 2000 కోట్ల రూపాయలు కేటాయించాయన్నారు. యేటా 200 కోట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం కెసిఆర్ గత నాలుగేళ్లలో యేటా 2000 కోట్ల రూపాయలు కేటాయించి ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడన్నారు. దేశంలో ముస్లింల సంక్షేమం కోసం సూచనలు చేసిన సచార్ కమిటీ నివేదికను ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పేద ముస్లింల కోసం డబుల్ బెడ్‌రూంలలో ఇండ్లు కేటాయిస్తామన్నారు. చివరి పేద వారికి డబుల్ బెడ్‌రూం అందే వరకు పథకం కొనసాగిస్తామన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కాంగ్రెస్ చేయ్యిచ్చిందన్నారు. బిజెపి పాలనలో ప్రజల చెవిలో పెద్దపూలు పెట్టిందన్నారు. కెసిఆర్ కారు ఉత్సాహంతో నడుస్తుందని శరవేగంగా కెసిఆర్ డ్రైవింగ్ చేస్తున్నాడని ఆయన్ను మరింత బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలన్నారు. డిసెంబర్ 11న సీఎంగా మళ్లీ కెసిఆరే వస్తారని తనకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, తెరాస రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments