Home తాజా వార్తలు చారాణ పనిచేశాను బారాణ మిగిలింది

చారాణ పనిచేశాను బారాణ మిగిలింది

 KTR Speech against congress At Rajanna Sircilla Public Meeting

మరోసారి అవకాశమివ్వండి..
కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయండి
సిరిసిల్ల ఓటర్లకు కెటిఆర్ విజ్ఞప్తి

సంక్షేమ పథకాలతో సామాన్యులముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది
సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ వారు 200 కేసులు వేశారు
మున్నూరుకాపు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ సహా పలువురు యువజన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ మంత్రి వెల్లడి

మన తెలంగాణ / సిరిసిల్ల: ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పిందే అసలైన తీర్పు అని నమ్ముతూ ప్రజా కోర్టుకు వచ్చా మని ప్రజలే కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు దక్కకుండా చేయాలని. కాంగ్రెస్ నేతలను ఊరి పొలిమేర లకు తరిమికొట్టాలని. మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ము న్నూరు కాపు యువజన సంఘం రాష్ట్ర అధ్య క్షులు దుమాల శ్రీకాంత్‌తో పాటు పలువురు యువజన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి కెటిఆర్ వారికి కండు వాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిం చాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారని, చనిపోయిన వారి పేరిట దొంగవేలిముద్రలు వేస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారని ప్రాజెక్టులు ఆపాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. బీడు భూములకు నీళ్లివ్వాలని కెసిఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ వారు కోర్టులకు వెళ్లి 200 కేసులు వేశారని కెటిఆర్ వివరించారు.

సిరిసిల్ల శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా గత మూడేళ్లలో సిరిసిల్లలో చారాణ మందం అభివృధ్ధి పనులు చేపట్టానని, మరో బారాణ మందం పనులు చేయాల్సి ఉందని అందువల్ల తనకు మరోసారి అవకాశం ఇస్తే సిరిసిల్లలో ఇప్పటికన్నా పదింతల అభివృధ్ధి పనులు చేపడుతానని రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఓడగొట్టాలని అనేక పార్టీలు రకరకాల ఫీట్లు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్షం గా ఆవిర్భవించిన టిడిపి,కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రమంతా మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పేదవారి సంక్షేమమే లక్షంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృధ్ధి చేశానని, సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా రాజీ లేకుండా అభివృధ్ధి చేస్తున్నానని, సిరిసిల్ల నియోజక వర్గాన్ని ఇప్పటికన్నా పదింతల అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, దీపావళి నాటికి ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని మహిళల నీటికష్టాలు అతి సమీప భవిష్యత్తులోనే తీరతాయన్నారు. నాణ్యమైన 24 గంటల కరెంట్‌ను అందిస్తున్నామన్నారు.

నేతన్నలకు ఉపాధి కోసం సిరిసిల్లలో ఆర్వీఎం, బతుకమ్మ చీరె లు ఉత్పత్తి చేసి రాష్ట్రమంతా పంపిణీ చేస్తున్నామన్నారు. సిరిసిల్ల నేతన్నలకు నెలకు 20 నుండి 25 వేల రూపాయల వేతనం లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ వస్త్రాల ఉత్పత్తితో నేతన్నలకు యేటా 9 నుండి 10 నెలల పని కల్పిస్తున్నామన్నారు. కన్నతల్లి తనకు జన్మనిస్తే సిరిసిల్ల రాజకీయ జన్మనిచ్చిందని అందుకే మరోసారి తనను గెలిపిస్తే మరో మూడేళ్లలో సిరిసిల్లలో రైలు కూత వినిపించే విధంగా కృషి చేస్తామన్నారు. దీనితో బొంబాయి, షోలాపూర్‌కు సిరిసిల్ల నుండే రైలులో  వెళ్లే అవకాశం కాలుగుతుందన్నారు. సిరిసిల్ల ప్రాంతం పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతోందని, ఇప్పటికే సిరిసిల్ల రూపు రేఖలే మారిపోయాయన్నారు. కొత్తవారు సిరిసిల్లకు వస్తే సిరిసిల్ల గుర్తు పట్టనంతగా మారిపోయిందన్నారు. బిజెపి ఇంటి కిరాయలు కడుతామంటున్నారని, పెద్దనోట్లు రద్దు చేసి మోడీ అనేక ఇబ్బందుల పాలు చేశాడని, మహిళలు పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారన్నారు.

మోడీ చెప్పినట్లు విదేశాల్లోని నల్లడబ్బు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తే బిజెపి నేతల ఇండ్ల కిరాయలన్నీ తామే కడుతామని కెసిఆర్ చెప్పిన మాటను కెటిఆర్ గుర్తు చేశారు. ఉత్తుత్తి మాటల ఉత్తుత్తి కుమార్ రెడ్డి గడ్డం పెంచుతున్నానని అధికారంలోకి వస్తేనే గడ్డం తీస్తానంటున్నాడని, ఆయన గడ్డం పెంచుకుంటే ఎవడికి లాభం ఎవడికి నష్టం అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఒక్క ఓటు పడని వారు కూడా తామే సిఎం అభ్యర్థులమని చెప్పుతున్నారని ఇలాంటి వారు  30 ,40 మంది వరకు ఉన్నారన్నారు  ఓ పార్టీకి క్యాడర్ లేదు, మరో పార్టీకి లీడర్ లేడు.. జోగి జోగి రాసుకున్నట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందన్నారు. డబ్బాలో ఓట్లు పడితే ఎవరి సంగతేమిటో తేలిపోతుందన్నారు కాంగ్రెస్ వారు ఎన్ని కోర్టులకు వెళ్లిన తాము మాత్రం అసలు సిసలైన కోర్టు ప్రజాకోర్టు అని నమ్ముతూ ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పి చైర్‌పర్సన్ తుల ఉమ,మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని పాల్గొన్నారు.

 KTR Speech against congress At Sircilla Public Meeting