Home తాజా వార్తలు అంబేడ్కర్ చూపిన బాటలోనే.. తెలంగాణ సాధించుకున్నాం

అంబేడ్కర్ చూపిన బాటలోనే.. తెలంగాణ సాధించుకున్నాం

ktrవిగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నాం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చలువ వల్లనే తెలంగాణ ఏర్పడిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. శాసనసభ అనుమతి లేకుండానే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన మాట తెలంగాణ ఏర్పాటుకు శ్రీరామ రక్ష అయ్యిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కెసిఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి, కొప్పుల ఈశ్వర్, ఎంపి పసునూరి దయాకర్, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, కె.పి.వివేకానంద,ఎంఎల్‌సిలు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో అంబేద్కర్ చూపిన మార్గంలోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. చిన్న రాష్ట్రాల విషయంలో ఆనాడు అంబేడ్కర్ ఆలోచన చేయకుంటే తెలంగాణ ఏర్పడేది కాదన్నారు. ఇప్పుడు అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణలో సంక్షేమం అమలవుతోందని పేర్కొన్నారు. శాసనసభలో మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు కావాలనే వాదనను తోసిపుచ్చి అల్పసంఖ్యాకుల గొంతుకు అంబేద్కర్ బలమిచ్చారని చెప్పారు.

ఎవరి నుంచైతే వేరు పడాలని అనుకుంటారో, ఎవరి వల్లనైతే అన్యాయం జరుగుతుందని గొంతెత్తుతారో వారి నుంచే అనుమతి తెచ్చుకోవడం సాధ్యమయ్యే పని కాదని చెప్పి, కొత్త రాష్ట్రం ఏర్పాటుకు శానససభలో మెజారిటి ఉండాలనే నిబంధనను తిరస్కరించారని చెప్పారు. అంబేద్కర్ తత్వం నేటి భారతదేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. బలహీనులు, అల్పసంఖ్యాక వర్గాలకు అండగా ఉండటమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో ఆపన్నులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు. అంబేద్కర్ కొందరివాడు కాదు.. అందరి నాయకుడని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఒక కులానికో, ఒక జాతికో, ఒక మతానికో పరిమితమైన వ్యక్తి కాదని,ఆ నాడు దేశానికి పనిచేసిన అందరి నాయకులకు ఏమాత్రం తీసిపోని దార్శనికుడు అని కొనియాడారు.

దార్శనికుడు అన్న పదం అంబేద్కర్‌కు సరిపోయినంతగా ఎవరికీ సరిపోదని వ్యాఖ్యానించారు. శనివారం పంజాగుట్లలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని కెటిఆర్ ఖండించారు. ఆ సంఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధ్యులు ఎవరైనా, ఏ పార్టీవారైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. దళితులకు చట్ట సభల్లో అవకాశం కల్పించింది అంబేద్కర్ అని పేర్కొన్నారు.

బాబా సాహెబ్ అడుగు జాడల్లో తెలంగాణ ప్రయాణిస్తోందని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. పేదల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. దేశంలోనే సంక్షేమం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ నిరంతరం తపిస్తుంటారని అన్నారు.

KTR Speech at Ambedkar Jayanti Celebrations