Home తాజా వార్తలు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రా సింహం కెసిఆరా ఎవరు కావాలి?

సీల్డ్ కవర్ ముఖ్యమంత్రా సింహం కెసిఆరా ఎవరు కావాలి?

KTR speech at public meeting in Nagarkurnool

చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీకట్టి ఎన్‌టిఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచాడు
అది తెలంగాణ ద్రోహుల కూటమి
రాష్ట్రాన్ని చంద్రబాబుకు, ఢిల్లీలో కాంగ్రెస్‌కు దాసోహం చేద్దామా?
ముష్టి మూడుసీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ ముందు పొర్లుదండాలు
మాటలతో మాయచేసేవారిపట్ల ఆలోచిం చాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలదే

నాగర్‌కర్నూల్ అభివృద్ధి నివేదన సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

మనతెలంగాణ/ నాగర్‌కర్నూల్ : ఎందరో ప్రాణత్యాగాల ఫలం, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు  ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలో , తెలంగాణ సింహం కెసిఆర్ కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలపైనే ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీమైదానంలో తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ అభ్యర్థి మర్రిజనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నాగర్‌కర్నూల్ అభివృద్ధి నివేదన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణను సాధించుకున్నది  ఆత్మగౌరవం కోసం, నీళ్లు, నిధులు, నియామకాలకోసమని అలాంటి తెలంగాణను మహాకూటమి పేరుతో దోస్తికట్టిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్ద, తెలంగాణకు ద్రోహిగా మారిన ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడుకు అమరావతి వద్ద దాసో హం చేద్దామా తెలంగాణ బిడ్డలే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు విద్యుత్ కావాలని అడిగితే కాల్చిచంపిన రాబందులు కావాలా, రైతులను ఆదుకుంటున్న రైతుబంధు కెసిఆర్ కావాలో ప్రజలు స్పష్టతకు రావాల్సిన అవసరం  ఎంతైనా ఉందన్నారు.

మహాకూటమిగా ఏర్పడి వారు రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడం పక్కనబెట్టి కేవలం కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా దింపడమే లక్షమని చెప్పుకుంటున్నారని రెండువందల నుంచి వెయ్యి రూపాయలకు పింఛన్ ఇచ్చినందుకా, 24 గంటలు రైతులకు విద్యుత్ , రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో ఆదుకుంటున్నందుకా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి నీరు, ప్రతిబీడు భూమికి సాగునీరు అందిస్తున్నందుకా ఎందుకు కెసిఆర్‌ను దించాలని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ 67 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడూ చేపట్టని సంక్షేమ పథకాలను కెసిఆర్ ఒకటి ఇస్తానంటే మాపార్టీ రెండు ఇస్తుందని ప్రజలను మభ్యపెట్టే పథకాలను ప్రకటిస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలకు ఆరు రాష్ట్రాల బడ్జెట్ ఖర్చుచేసినా సరిపోదని, మాయమాటలతో మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. 67 ఏళ్లు అధికారమిస్తే చేయని వారు ఇప్పుడు ఎలా చేస్తారో ప్రజలు  ఆలోచించాలని అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే కక్కుర్తితో పెళ్లీడుకు వచ్చిన మగపిల్లలను ఆడపిల్లలను వెతికి పెళ్లిళ్లు చేస్తామని మీ ఇంట్లో వంటలు సైతం మేమే చేస్తామని , చివరికి మీపిల్లల డైపర్లు సైతం మారుస్తామని మాయమాటలు చెప్పే స్థితికి కాంగ్రెస్‌వారు దిగజారారని కెటిఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ  ప్రాజెక్టులను ఆపాలని కోర్టులకు పోయింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. పాలమూరు, రంగారెడ్డి  ఎత్తిపోతలతోపాటు అనేక ప్రాజెక్టులను  ఆపడానికి కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌కు చెందిన నాగం జనార్దన్‌రెడ్డిలు కోర్టులో కేసులు వేశారని వీరు ఓట్లుకోసం వస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందన్నారు.

హల్లికి హల్లి సున్నకు సున్నా అనే చందంగా మొట్టికాయలు వేసుకున్నారని నాగం జనార్దన్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడే కోదండరాం ముష్టి మూడు సీట్లకోసం కాంగ్రెస్‌పార్టీ ముందు పొర్లుదండాలు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. కేవలం పది, పదిహేను సీట్లకోసం తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌పార్టీకి తాకట్టు పెట్టడం అంతటి నీతిమాలిన పని మరోకటి లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను చంద్రబాబునాయుడు దత్తత తీసుకుంటే కరువు విలయతాండవం చేసిందని కెసిఆర్ దత్తత తీసుకుంటే తెలంగాణను సాధించి పచ్చపాలమూరుగా మార్చారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని , నాగర్‌కర్నూల్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న మర్రిజనార్దన్‌రెడ్డిని భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ బహిరంగ సభలో మంత్రి జూపల్లికృష్ణారావు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపి బాల్కసుమన్ , ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధి మందజగన్నాథం, జడ్పిచైర్మన్ బండారి భాస్కర్, జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.