Home తాజా వార్తలు దేశానికి కావాల్సింది జిమ్మేదారు…

దేశానికి కావాల్సింది జిమ్మేదారు…

KTR

కేంద్ర పాలకులకు పోలవరం ముద్దు, కాళేశ్వరం చేదు
ఢిల్లీకి సలాం కొట్టే
ఎంపిలు మనకొద్దు
కొట్లాడే వారినే గెలిపించండి
ఐదేళ్ల కాలంలో మోడీ
రెండు సార్లే వచ్చాడు
కేబినెట్ నుంచి దత్తాత్రేయను తొలగించి తెలంగాణను అవమానించారు

చౌకీదారులు, టేకీదారులు కాదు : సిరిసిల్ల సభలో కెటిఆర్

ఢిల్లీకి గులాంగిరి చేసే ఎంపిలు మనకొద్దు, మన గురించి పేగులు తెగేదాక కొట్లాడే వారినే ఎంపిలుగా గెలిపించుకోవాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం రాత్రి సిరిసిల్లలో తెరాస ఎంపి అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచార సభలో కెటిఆర్ ప్రసంగించారు. దేశానికి చౌకీదార్‌లు, టేకీదార్‌లు పాలన కాకుండా దందార్, అసల్దార్, జిమ్మేదార్ లైన కెసిఆర్ లాంటి నాయకుల పాలన అవసరమన్నారు. ప్రస్తుతం చేతల నాయకులు దేశానికి అవసరమని మాటల నాయకులు కాదని కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు 16 మంది ఎంపిలనిస్తే కేసిఆర్ వాటికి మరో 150ని తోడు చేస్తాడన్నారు. ఎర్రకోటపై జాతీయ జండాను ఎగురవేసేది ఎవరో తెరాస నిర్ణయించే రోజు త్వరలోనే వస్తుందని ఆయన అన్నారు. దేశానికి కెసిఆర్ పథకాలు ఆచరణాత్మకంగా మారాయని, ఇటీవల ప్రక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా దిగిపోవడానికి కొద్దిరోజుల ముందు రైతుబంధును కాపి కొట్టి అన్నదాత సుఖీభవ పధకాన్ని ప్రారంభించారన్నారు. నరేంద్ర మోడి కూడా రైతు బంధును కాపి కొట్టి పిఎం కిసాన్ పథకాన్ని ప్రకటించాడన్నారు. కెసిఆర్ వల్లే ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా రైతులందరికి లాభం కలుగుతోందన్నారు. తెలంగాణలో అన్ని కులవృత్తుల వారు సంతోషంగా ఉన్నారన్నారు.

తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలు అయి ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేవలం కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే సంక్షోభంలో ఉన్నాయన్నారు.సిరిసిల్లలో తనను ఎంఎల్‌ఎగా తానే నమ్మలేనంతగా 89,009 ఓట్ల మెజార్టీతో గెలిపించారని, అదే స్ఫూర్తితో ఎంపిగా వినోద్‌కుమార్‌ను లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవలే ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మనగడ సాగిస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసిఆర్ గుర్తింపు పొందారన్నారు. తెలంగాణలోని 80 శాతం మంది సంతోషంగా ఉన్నారని సర్వేలో ప్రజలు తెలిపారన్నారు. మంచి మెజార్టీతో బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే సిఎం కేసిఆర్ కరీంనగర్ శంఖారావసభలో అన్నట్లుగా అన్నీ కలిసొస్తే కేంద్రమంత్రిగా సిరిసిల్లకు తిరగి వస్తారని కెటిఆర్ జోస్యం చెప్పారు. ఎంఎల్‌ఏ ఎన్నికల్లో కారుకు ఓట్లేసి సిఎం గా కెసిఆర్‌ను గెలిపించాక మళ్లీ కారుకే ఎందుకు ఓట్లు వేయాలని బిజెపి, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని అయితే వారికి ఒక్కటే చెపుతున్నానన్నారు. కాంగ్రెస్ ఎంపిలు గెలిస్తే రాహుల్‌గాంధీకి లాభం కలుగుతుందని, బిజేపి ఎంపీలు గెలిస్తే నరేంద్రమోడీకి లాభం కలుగుతుందన్నారు.

గులాబీ జండాపై కారు గుర్తున్న ఎంపిలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం కలుగుతుందన్నారు.ఎట్టికైనా మట్టికైనా మనోడుండాలనే సామెతను మన పూర్వీకులు చెప్పనే చెప్పారు కదా అన్నారు. మన ఇంటి పార్టీ టిఆర్‌ఎస్ గులాబీ పార్టీ అనీ మనకు గులాంగిరీ పార్టీలు వద్దన్నారు. కాంగ్రెస్, బిజెపి ఎంపిలు గెలిస్తే డిల్లీలో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారన్నారు. టికెట్లు పొందడం మొదలు కొని ఏ చిన్న పనికైనా చివరికి బాత్‌రూంకు పోవాలన్నా డిల్లీ పర్మిషన్ కావాలన్నారు. డిల్లీలో ఉన్నవారికి గల్లీలోని వారి బాధలు పట్టవన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కెసిఆర్ లాంటి నాయకులు, ఆయన కోరుకున్న గులాబీ దండు తెలంగాణ గడ్డకు లాభం కలగాలని పేగులు తెగేదాక పోరాడుతారన్నారు.దమ్ము ధైర్యం ఉన్న మొనగాడు కెసిఆర్ అని మనం 16 సీట్లిస్తే ఆయన వాటికి మరో వందయాభై జతచేసి దేశ పటంలో తెలంగాణను మెరుగ్గా గుర్తించేలా చేస్తారన్నారు. కాంగ్రెస్ బిజేపిలకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉందన్నారు.

బెంగాల్‌లో మమత బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, మాయావతి ఇలా అనేక మంది ఉన్నారన్నారు. నాన్ బిజెపి, నాన్ కాంగ్రెస్ పార్టీలకు 150కి పైగా సీట్లు వస్తాయన్నారు.2014లో బిజెపి నరేంద్రమోడిని నమ్మి 280కి పైగా సీట్లిస్తే ప్రజలకు చేసిందేమి లేదన్నారు. మోడి వేడి తగ్గిందన్నారు. కాంగ్రెస్‌కు జోష్‌లేదు, బిజెపికి హోష్ లేదన్నారు.బిజేపి 150 సీట్లు, కాంగ్రెస్ 110 సీట్లు కూడా గెలుచుకునే స్థితి లేదని ఇద్దరు కలిసినా 270 కూడా రాలేని స్థితి ఉందన్నారు. సంకీర్ణ యుగంలో ఒక్కో ఎంపి సీటు కూడా కీలకం అవుతుందన్నారు. 16 సీట్లు ఉంటే ఏం సాధిస్తారని బిజెపి, కాంగ్రెసోల్లు మాట్లాడుతున్నారని అయితే గత ఎన్నికల్లో పక్క రాష్ట్రంలో 15 సీట్లు సాధించిన టిడిపి డిల్లీలో చక్రం తిప్పి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకున్నారన్నారు. మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాకోసం ప్రయత్నిస్తే ఫలితం లేకుండా పోయిందన్నారు. 16 మంది గులాబి దండు ఉంటే డిల్లీకి పోవడం కాదు వారే దిగి వచ్చి హైదరాబాద్‌లో మనం అడిగింది ఇచ్చి పోతారన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మోడి తెలంగాణకు ఏ సహయం చేయలేదన్నారు.

కేంద్రంలో 75 మందితో మంత్రి మండలి ఉండగా ఉన్న ఒక్క బండారు దత్తాత్రేయను తొలగించి తెలంగాణను అవమానించారన్నారు. తెలంగాణ బిజెపిలో మోడీకి ఒక్కడైనా తెలివిగలవాడు కనిపించలేదా అని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో మోడీ కేవలం రెండుసార్లే తెలంగాణ వచ్చాడన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులిచ్చారని, కాళేశ్వరానికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. దండలు వేసినా దండాలు పెట్టినా శాలువాలు కప్పినా కనికరించలేదన్నారు. అదే గులాబి దండు ఎంపిలుగా ఉంటే నిధులు తన్నుకొని రావా అన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్, నియోజక వర్గం ఇంచార్జీ బస్వరాజ్ సారయ్య, ఎంఎల్‌సి భానుప్రసాదరావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, జడ్‌పి చైర్మన్ తుల ఉమ, మాజి విప్ ఆరెపల్లి మోహన్, మున్సిపల్‌చైర్‌పర్సన్ సామల పావని, మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి, తెరాస నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి,గడ్డం నర్సయ్య, రేణ, దార్నం లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Ktr Speech At Siricilla TRS Public Meeting