Home తాజా వార్తలు కూటమితో భూములు బీళ్లు

కూటమితో భూములు బీళ్లు

KTR

పొత్తుల పేరుతో తెలంగాణ పొట్టకొట్టనున్న చంద్రబాబు
ఏ గట్టున ఉంటారో..
ఖమ్మం జిల్లా బహిరంగ సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికే ఆంధ్రా సిఎం చంద్రబాబు నాయుడు పొత్తుల పేరుతో తెలంగాణ పొట్టకొట్టేందుకు వస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి ఓట్లు వేస్తే సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయి మీ ప్రాంతమంతా బీడు భూములుగా మిగులుతాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిరలో జరిగిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు, లింగాల కమల్ రాజు నామినేషన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మూడు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కేంద్రానికి పలు మార్లు లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతరామ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేంద్రానికి 30 ఉత్తరాలు రాశాడని కెటిఆర్ తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలనే వాదన కలిగిన పార్టీ నాయకులు సత్తుపల్లిలో నిలబడ్డారని ప్రజలు వాస్తవాలు గ్రహించాలని కోరారు. చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు మరోసారి అన్యాయం చేసేందుకు వస్తుందన్నారు. మూడు జెండాలు కట్టుకొని వస్తున్న నాయకుల ఏకైక ఏజెండా కెసిఆర్‌ను గద్దె దించడం కోసమేనని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో తెలంగాణను నిలిపిన కెసిఆర్ ఎందుకు గద్దె దిగాలని ఆయన విపక్షాలను సూటిగా ప్రశ్నించారు. సిద్ధాంతాలను పక్కన పెట్టి కెసిఆర్‌ను గద్దె దించాలని కూటమి నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అవకాశవాద పొత్తులు, అవకాశ వాద రాజకీయాలు తెలంగాణపై పట్టుకోసం పాకులాడుతున్నాయని ఆయన విమర్శించారు.

ఒక వైపు గట్టున టిడిపి, కాంగ్రెస్, మరో గట్టున టిఆర్‌ఎస్ ఉందని సత్తుపల్లిలోని నాగన్నలు ఏ గట్టున ఉండాలో నిర్ణయించుకోవాలని పిలుపు నిచ్చారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్, టిడిపి ఓ గట్టున, 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిన టిఆర్‌ఎస్ మరో గట్టున ఉందని ఏ గట్టుకు చేరుకుంటారో మీరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకూ భీమా సౌకర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. సత్తుపల్లికి కాబోయే ఎంఎల్‌ఏ పిడమర్తి రవి అని అందులో ఏ మాత్రం అనుమానం లేదన్నారు. నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు తలపడ్డ నాయకులు నేడు ఒకే వేధికపైకి వచ్చి కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, చంద్రబాబు నోట్లు ఇచ్చిన టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి ప్రజా కూటమికి బుద్ది చెప్పాలని కెటిఆర్ పిలుపు నిచ్చారు.

అనంతరాములు లేకుంటే భట్టి ఎక్కడ?
టి ఆర్ ఎస్ ది కుటుంబం పాలన అని విమర్శంచేవాళ్ళు మల్లు అనంతరామలు లేకుంటే మల్లు రవి, మల్లు భట్టి ఎక్కడ అని మధిరలో జరిగిన బహిరంగ సభలో కెటిఆర్ ప్రశ్నించారు,ఇక్కడ కాంగ్రెస్‌కు ఓట్లువేస్తే కన్నీళ్ళే మిగులుతాయన్నారు. మధిరలో భట్టి పనితీరుకు నత్త కూడా సిగ్గు పడే విధంగా జాలిమూడి పనులు జరుగుతున్నాయన్నారు. పెద్ద వారిని విమర్శిస్తే పెద్దవారు అవుతారని భట్టి అనుకుంటున్నారని ఆయన చెప్పేవన్ని వట్టి మాటలు నీటి మూటలన్నారు. తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అని ర్యాలీ చేసిన భట్టి మధిర మున్సిపాల్టీ కోసం ఏనాడు కూడా పైస అడగలేదన్నారు. ఎంపి పొంగులేటి అడగానే మధిర మున్సిపాల్టీకి రూ.25కోట్ల నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేద వారికి సంక్షేమ పధకాలు అందకుండా ఆరు నెలల పాటు సంతకాలు చేయకుండా అపుతున్నా భట్టికి ఈ ఎన్నికల్లో బుద్ది చేప్పాలన్నారు.

మధిరలో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మడుపల్లిలో లెదర్‌పార్క్‌ను, బోనకల్‌లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. మధిరలో సభ చూస్తుంటే లింగాల కమల్ రాజు విజయోత్సవ సభలాగా ఉందన్నారు. ఈ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మాజీ ఎంఎల్‌ఏ కొండబాల కోటేశ్వరరావు, బుడాన్ బేగ్,నల్లమల్ల వెంకటేశ్వర్ రావు, బొమ్మెర రాంమూర్తి ,డాక్టర్ మట్టా దయానంద్ ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. హైద్రాబాద్ నుంచి నేరుగా సత్తుపల్లికి వచ్చిన కెటిఆర్‌అక్కడ టిఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అశ్వారావుపేటకు చేరుకొని తాటి వెంకటేశ్వర్లు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తరువాత మధిరలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

KTR spoke in open house of Khammam district

Telangana Latest News